అన్నీ అతిక్రమణలే...
సీతారాంబాగ్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగుచూస్తున్న నిజాలు
అనుమతి జీప్లస్ 1కు... నిర్మించింది జీ ప్లస్ 4 అంతస్తులు నివాస భవనంలో వాణిజ్య కార్యకలాపాలు
{పమాదాలు జరిగినప్పుడే అధికారుల హెచ్చరికలు.. ఆపై షరా మామూలే...
సిటీబ్యూరో: అనుమతి తీసుకున్నది జీ ప్లస్ 1 నివాస గృహానికి...నిర్మాణం జరిపింది జీ ప్లస్ 4 అంతస్తులు. నిర్వహిస్తున్నది వాణిజ్య కార్యకలాపాలు(ప్లాస్టిక్ సామాన్ల గోదాము). ఇందుకు ట్రేడ్‌లెసైన్సు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇవీ ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగి కుప్పకూలిపోయిన సీతారాంబాగ్‌లోని భవనానికి సంబంధించిన వివరాలు. నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు ఇదో ఉదాహరణ. అంతేకాదు.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా కోర్టునుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. స్టే ఆర్డర్‌ను సైతం ఉల్లంఘించి నాలుగంతస్తులు నిర్మించారు. భారీ అగ్నిప్రమాదంతో ఆరా తీస్తే ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. లేని పక్షంలో వివరాలే తెలిసేవి కావు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు నగరంలో అడుగడుగునా ఎన్నెన్నో. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవాల్సిందిగా సలహాలిచ్చేది కూడా జీహెచ్‌ఎంసీ సిబ్బందేననే ఆరోపణలకు ఊతమిచ్చేదిగా ఉంది ఈ ఘటన. కోర్టు స్టే ఆర్డర్‌ను కూడా ఉల్లంఘించి, అక్రమంగా జీప్లస్ నాలుగంతస్తులు నిర్మించి, దీన్ని క్రమబద్ధీకరించాల్సిందిగా కూడా భవన యజమాని బీఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇలా భవనాలు అగ్నిప్రమాదాల బారిన పడినప్పుడో, లేక నిర్మాణం జరుగుతుండగానే కుప్పకూలినప్పుడు మాత్రమే అక్రమాలను సహించేది లేదని ప్రకటిస్తున్న యంత్రాంగం ఆ తర్వాత మిన్నకుంటోంది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.
భవన నిర్మాణం వెనుక...
సీతారాంబాగ్‌లో విజయ్‌సింగ్ అనే వ్యక్తి జీప్లస్ 1 అంతస్తుకు 2013లో జీహెచ్‌ఎంసీ సర్కిల్-7 కార్యాలయం నుంచి అనుమతి పొందారు. అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా సెట్‌బ్యాక్స్ ఉల్లంఘలనకు పాల్పడ్డారు. అదనపు అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన టౌన్‌ప్లానింగ్‌అధికారులు 2014లో నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా నిర్మాణ పనులు కొనసాగించారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. మొదటి అంతస్తు సెంట్రింగ్ పనులు జరుగుతుండగా అడ్డుకోగా, యజమానితో పాటు స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. 2014 ఆగస్టు 14న షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసు అందాక నిర్మాణం ఆపి సిటీ సివిల్‌కోర్టునాశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో అధికారులు తిరిగి దాని వైపు చూడలేదు. స్టే ఆర్డర్ సాకుతో కోర్టు ఉత్తర్వులను సైత ం ఉల్లంఘించి అక్రమంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈకేసు జూనియర్ సివిల్‌కోర్టులో వచ్చే జూలై 5వ తేదీన విచారణకు రానుండగా, తాజాగా జరిగిన అగ్నిప్రమాదంతో వివరాలు వెలుగు చూశాయి. ఇలాంటి అక్రమ భవన నిర్మాణాలు నగరంలో వేలాదిగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌కు అందిన దాదాపు 1.40 లక్షల దరఖాస్తులే ఇందుకు నిదర్శనం.