వినూత్న విధానాలతో ముందుకు!
సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులతో ప్రధాని భేటీ...
- పారిశ్రామిక రంగం కష్టాలపై దృష్టి
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వినూత్న రీతి ఆలోచనలతో ముందుకు పోవాలని సూచించారు. తయారీ రంగం వృద్ధే లక్ష్యంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతానికి సంయుక్త కృషి జరగాలని పిలుపునిచ్చారు. రెండు ప్రముఖ పారిశ్రామిక సంఘాలు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) ప్రతినిధులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. గత ఏడాది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోడీ ఈ తరహా భేటీ ఇదే తొలిసారి.
మూలధన వ్యయాలు పెరగడం నుంచి సంక్లిష్ట పన్ను అంశాల వరకూ పారిశ్రామిక ప్రతినిధులు నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఫిక్కీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి కార్యాలయం సైతం ఈ చర్చలపై ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం...
- అధిక మూలధన వ్యయాలు, రుణ సమీకరణలో వడ్డీల భారం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందుల వల్ల దేశంలో పెట్టుబడులు ఊపందుకోవడం లేదని పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు.
- చమురు, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు సంబంధించి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని మోడీ హామీ. అలాగే పలు ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి పెడుతుందని తెలిపారు.
- విశ్వాసం, విధానాల్లో సంక్లిష్టతలను తొలగించడం, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాల్లో మరింత ముందడుగు అవసరమని ప్రధాని సూచించారు.
- కార్పొరేట్ బాధ్యతల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అంశాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
- వ్యవసాయ ఉత్పత్తులు, జౌళి, రక్షణ సంబంధ తయారీ రంగం మరింత అభివృద్ధి సాధించాలి.
నిరాశాజనక పరిస్థితి: మూడీస్
ఇదిలావుండగా, అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ మూడీస్... దేశంలో సంస్కరణల తీరు పట్ల నిరుత్సాహం నెలకొన్నట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. ‘ఇన్‌సైడ్ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో మూడీస్ ప్రత్యేకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిరుత్సాహ ధోరణులను ప్రస్తావించింది. భారత్ సావరిన్ రేటింగ్‌కు సంబంధించి ఇది ‘క్రెడిట్ నెగిటివ్’ అని వివరించింది. విధాన ప్రతిష్టంభనపై ఆందోళనలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.5 శాతంగా మూడీస్ అంచనావేస్తోంది.