జూలై నుంచి జలసిరి!
జంట నగరాల్లో ఐదు లక్షల నల్లాలకు రోజూ నీళ్లు
♦ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వెల్లడి
♦ మే నుంచి గ్రేటర్‌లోని 9.05 లక్షల నల్లాలకు ఎస్‌ఎంఎస్ సందేశం
♦ ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానం..
♦ ఫిబ్రవరి ఒకటి నుంచి 173 మురికివాడలకు రోజూ నీళ్లు..
సాక్షి, హైదరాబాద్: జంటనగరవాసులకు శుభవార్త. జూలై నెల నుంచి ప్రధాన నగరం (కోర్‌సిటీ) పరిధిలోని ఐదు లక్షల నల్లాలకు రోజూ నీళ్లిచ్చేందుకు జలమండలి చర్యలు ప్రారంభించింది. కృష్ణా, గోదావరి జలాల లభ్యత పుష్కలంగా ఉండడం, జూన్ నెలా ఖరులోగా నగరంలో పలు భారీ స్టోరేజి రిజ ర్వాయర్ల నిర్మాణం పూర్తవనున్న నేపథ్యంలో ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. మరోవైపు నల్లా నీళ్ల సరఫరా వేళలపై వినియోగదారుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ సమాచారం అందించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మే నెల నుంచి గ్రేటర్ పరిధిలోని 9.05 లక్షల నల్లాలకు నీటి సరఫరా వేళలపై ఖచ్చితమైన సమాచారం అందించాలని సంకల్పించింది. ఈ మేరకు సంక్షిప్త సందేశం అందించే ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఎండీ తెలిపారు.
ప్రస్తుతానికి కూకట్‌పల్లి డివిజన్ పరిధిలో 50 వేల నల్లాలకు ఈ సందేశం చేరవేస్తున్నామని.. ఫిబ్రవరి నెలలో సనత్‌నగర్ నియోజకవర్గానికి ఎస్‌ఎంఎస్ అందించాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి నగరంలోని 173 మురికివాడల్లో 50 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా ఉంటుందన్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి అదనంగా మరో లక్ష నల్లాలకు రోజూ గంటకు తగ్గకుండా నీళ్లిస్తామన్నారు. ఇదే సమయంలో నీటి వృథాను అరికట్టడం, కలుషిత జలాల సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు లేదా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యన ఒక గంట పాటు మంచినీటిని సరఫరా చేయనున్నామన్నారు.
బస్తీల్లో అవగాహన కార్యక్రమాలు..
నీటి పొదుపు, అన్ని నల్లాలకు నీటి మీటర్ల ఏర్పాటు, వృథాను అరికట్టడం, కలుషిత జలాల నివారణ, సమస్యల పరిష్కారంలో స్థానికుల భాగస్వామ్యం, రోజువారీగా ఎదుర్కొంటున్న సమస్యలపై జలమండలికి ఫిర్యాదు చేయడం ఎలా.. తదితర అంశాలపై పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయిం చినట్లు ఎండీ చెప్పారు. ఆయా బస్తీల్లో కర పత్రాల పంపిణీ, పోస్టర్ల ఏర్పాటుతోపాటు, స్థానికులతో సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం...
అరకొర నీటి సరఫరా.. ఉప్పొంగుతున్న మురుగు సమస్యలు, కలుషిత జలాలు..అధిక నీటి బిల్లుల మోత.. తదితర సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసే వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను మరో నెల రోజుల్లో 50 వేల మంది అనుకరించేలా (ఫాలోవర్స్) చర్యలు ప్రారంభించారు. జలమండలి అందిస్తున్న సేవలను గ్రేటర్ సిటీజన్లకు చేరవేయడం, సమస్యల గుర్తింపు, తరచూ సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించడం, తక్షణం ఆయా ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ ఉత్తమ సాధనమని భావిస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్‌మెన్లకు అందజేసిన స్మార్ట్‌ఫోన్లలో ఉన్న జల్‌యాప్ మాధ్యమం ద్వారా నిత్యం 200కుపైగా ఫిర్యాదులు అందుతున్నాయ న్నారు. సిబ్బంది, అధికారుల్లో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి సమావేశానికి ముందు గాంధీ ప్రతిజ్ఙ చేయిస్తున్నామని, వినియోగదారులే తమకు అత్యంత ముఖ్యమని భావించేలా ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపే యత్నం చేస్తున్నామని దానకిశోర్ పేర్కొన్నారు.
మరో వందేళ్లకు తాగునీటికి ఢోకా లేకుండా...
గ్రేటర్ నగరానికి మరో వందేళ్లపాటు తాగునీటికి ఢోకాలేకుండా శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్... మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వ సామర్థ్యంతో మల్కాపురం(నల్లగొండ) రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎండీ తెలిపారు. ఇందుకు అవసరమైన భూముల లభ్యతను గుర్తించడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనుల్లో నిమగ్నమయ్యామన్నారు.