ఆలస్యానికి చెక్
►బుక్ చేసిన వెంటనే నీటి ట్యాంకర్
►అదే రోజు 90 శాతం సరఫరా..
►సిటీలో తగ్గుతున్న నీటి డిమాండ్
సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్‌ను బుక్‌చేసి నీటి కోసం కళ్లు కాయలు కాసేలా వేచిచూడాల్సిన అవసరం ఇక ఉండదు. మహానగరం పరిధిలో ఇక నుంచి బుకింగ్‌లు జరిగిన రోజునే 90 శాతం మందికి నీటిని సరఫరా చేసేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ట్యాంకర్ నీటి బుకింగ్‌లు క్రమంగా తగ్గుతుండడంతో కోరినవారికి వెంటనే ట్యాంకర్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
కృష్ణా, గోదావరి జలాలతో గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు జలమండలి ప్రణాళికాబద్ధంగా పలు ప్రాంతాల్లో సరఫరా నెట్‌వర్క్ విస్తరిస్తోంది. దీంతో పలు ప్రాంతా ల్లోని సిటీజన్ల దాహార్తి క్రమంగా తీరడంతోపాటు ట్యాంకర్లకు డిమాండ్ భారీగా తగ్గింది. గతంలో సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి నగరానికి 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం వాటి నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో కృష్ణా, గోదావరి పథకం కింద 376 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది.
డిమాండ్ తగ్గుతోందిలా..
సుమారు కోటి జనాభా, 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నగరానికి ప్రస్తుతం మంచినీటి సరఫరాకు 8 వేల కిలోమీటర్ల మార్గంలో పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్ల రుణంతో శివారు ప్రాంతాల్లో 2000 కి.మీ. మార్గంలో పైప్‌లైన్లు, నీటినిల్వకు జలమండలి 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పైప్‌లైన్ పనులు పూర్తికావడంతో వందలాది శివారు కాలనీలకు జలభాగ్యం దక్కింది.
దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులోకి రావడం.. ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో నీటిసరఫరా జరుగుతుండడంతో ట్యాంకర్ నీటిపై ఆధారపడడం తగ్గినట్లు జలమండలి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నాయి. రుతుపవనాలు కరుణిస్తే ఆయా ప్రాంతాలకు జూలై నుంచి రోజూ నీటిసరఫరా జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.