Water tanker
-
వాటర్ ట్యాంకర్‌పై వధూవరుల ఊరేగింపు... అసలు సంగతి ఇది..
ఈరోజుల్లో వైరల్ అయిపోవడం చిటికేసినంత ఈజీ అయిపోయింది. చేసే పని ఎలాంటిదైనా కెమెరాకి చిక్కితే చాలూ అన్నట్లు ఉంది పరిస్థితి. కావాలని కొందరు.. అనుకోకుండా కొందరు మీమ్ స్టఫ్ అయిపోతున్నారు. అదే సమయంలో చర్చలకు సైతం దారి తీస్తున్నారు మరికొందరు. అలాంటి జంట గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వాటర్ ట్యాంకర్‌పై వధువు వరుడిని ఊరేగించిన ఘటన తాలుకా ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. వీళ్లేదో దేశాన్ని ఉద్దరిస్తున్నారా? అనుకోకండి.. సమస్య మీద పోరాటంలో భాగమే ఈ ఊరేగింపు. మహారాష్ట్ర కోల్హాపూర్‌కు చెందిన విశాల్ కోలేకర్(32) వివాహం అపర్ణ అనే యువతితో గురువారం జరిగింది. వివాహం తర్వాత ఆ ఇద్దరినీ ఓ వాటర్ ట్యాంకర్‌పై ఎక్కించి మరీ ఊరేగించారు బంధువులు. రోడ్లు, వీధుల వెంట వెళ్తున్న ఆ ఊరేగింపును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే వాళ్లు అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. కరువు.. చాలాచోట్ల సీజన్‌తో సంబంధంలేని సమస్యగా మారిపోయింది. అధికారులు కూడా నీటి కొరత తీర్చడంలో అసమర్థత ప్రదర్శిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తమ ప్రాంతానికి నీటి సరఫరా ఉండట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ జంట ఇలా చేసింది. ‘‘నగరంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మా ఏరియా(మంగళ్వార్ పేట్)లో నెలకొన్న సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ, ఫలితం లేకుండా పోతోంది. ప్రిన్స్ క్లబ్ అనే సోషల్ గ్రూప్ తరపున చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నాం.. అయినా నీరు సకాలంలో రావట్లేదు. అందుకే చాలా కుటుంబాలు వాటర్ ట్యాంకర్లనే నమ్ముకున్నాయి’’ అని వరుడు విశాల్ కోలేకర్ వాపోయాడు. Maharashtra | A Kolhapur couple rode a water-tanker on their wedding day, to call attention to the ongoing water crisis in the city. The newly-weds have vowed "not to go on a honey-moon until this crisis ends," according to the message on the tanker. (Source: self-made) pic.twitter.com/1kWM97ogTB — ANI (@ANI) July 9, 2022 ఈ నిరసన ఇక్కడితోనే ఆగిపోలేదు. వివాహ ఊరేగింపులో వాటర్ ట్యాంకర్‌కు ఓ బ్యానర్ కట్టింది ఈ జంట. అందులో నీటి సమస్య తీరేంత వరకు హనీమూన్ కూడా వెళ్లమంటూ పేర్కొన్నారు. విశాల్‌తో పాటు అతని ఆశయానికి అండగా నిలిచిన అపర్ణను చాలామంది అభినందిస్తున్నారు. -
రోబో వాక్యూమ్ క్లీనర్ ఇంట్లో ఉంటేనా.. అండర్ వాటర్ ట్యాంక్‌లో నలకలు మాయం!
భారీ నీటి తొట్టెలు, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి శుభ్రం చేయడం ఆషామాషీ పని కాదు. ఎంతగా శుభ్రం చేశామనుకున్నా, సూక్ష్మాతి సూక్ష్మమైన నలకలు, నాచు మొలకలు ఎక్కడో చోట ఇంకా మిగిలే ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ గనుక ఉంటే, వీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. ఇది నీటి అట్టడుగు వరకు ప్రయాణించగలదు. మూల మూలల్లోని చెత్తను, 180 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన నలకలను కూడా ఇట్టే ఒడిసి పట్టుకుని, తిరిగి నీట్లోకి చేరకుండా చూస్తుంది. ‘ఎయిపర్ సీగల్–3000’ పేరుతో జపాన్‌కు చెందిన ఎయిపర్ ఇంటెలిజెంట్ కంపెనీ రూపొందించిన ఈ అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. -
పెళ్లింట విషాదం.. ముగ్గురు మృతి
కామారెడ్డి : బిచ్కుంద మండలం చిన్న దేవాడలో గురువారం తెల్లవారుజామున పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా దగ్గరలోని వాగువద్ద నీళ్లు తెచ్చేందుకని ట్యాంకర్ తీసుకొని వెళ్లారు. వాగులో నీళ్లు తీసుకొని వస్తున్న సమయంలో ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందిన వారిని తుకారం, సాయిలు, శంకర్లుగా గుర్తించారు. కాగా డ్రైవర్ ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. -
చిన్నారిని చిదిమేసిందెవరు?
పాలబుగ్గల చిన్నారి.. ముద్దులొలికే పొన్నారి.. బుడిబుడి అడుగులతో ముచ్చట గొలుపుతుంది.. ఊసులాడుతూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. చందమామలాంటి ఆ పసిపాపను చూస్తే ఎంతటి పాపాత్ముడిలోనైనా పరివర్తన వస్తుంది.. మరి ఆ బుజ్జాయి ప్రాణాలు తీసేందుకు ఎలా మనసొచ్చింది..? ఎంతటి కిరాతక హృదయులో ఇంతటిదారుణానికి ఒడిగట్టారు.. ఆడుకుంటున్న పాపాయి ఊపిరి తీశారు.. అంత ఎత్తున ఉన్న నీళ్ల ట్యాంకులో ఎలా పడిందో.. కాదు కాదు ఎవరు పడదోశారో ప్రశ్నార్థకంగా మిగిలింది. సాక్షి, సోంపేట(శ్రీకాకుళం జిల్లా): మూల దుర్యోధన, కావ్య దంపతుల ముద్దుల పాపాయి హేమశ్రీ. సోంపేట మండలం టి.శాసనాం గ్రామానికి చెందిన వీరికి పెళ్లయిన రెండేళ్ల తర్వాత పుట్టింది. 11 నెలల ఈ చిన్నారంటే అందరికీ ముద్దే. అందుకే పక్కింట్లో ఉండే వి.నిర్మల ప్రతి రోజు ఈ పాపను వాళ్లింటికి తీసుకెళ్లి కాసేపు ఆడిస్తుంది. శుక్రవారం కూడా అలాగే జరిగింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పాపను ఆడిస్తానని తీసుకెళ్లిన నిర్మల.. 20 నిమిషాల తరువాత కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. పాప కనిపించడంలేదని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వీధిలో వెదకడం ప్రారంభించారు. అంతలో తమ ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో హేమ పడివుందని నిర్మల తెలిపింది. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే హేమశ్రీ మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప మృతిపై అనుమానాలు ఇంటి పైనున్న ట్యాంకు వరకు చిన్నారి వెళ్లలేదు. ఎవరో తీసుకువెళ్లి ఉండాలి. ట్యాంకుకు పైకప్పు ఉంది. కప్పుతీసి నీటిలో పడేసి మూత పెట్టారు. పాపను చంపే ఉద్దేశంతోనే ఎవరో ట్యాంకులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎవరు ఎందుకు చేశారో తల్లిదండ్రులకు అర్థం కావడంలే దు. పాపను ఇంట్లో ఆడిస్తూ పెరట్లోకి వెళ్లానని, అంతలోనే మాయమైందని నిర్మల చెబుతోంది. హేమశ్రీ తండ్రి దుర్యోధన వలస కార్మికుడిగా ముంబైలో పనులు చేస్తున్నారు. ఇచ్ఛాపురం సీఐ వినోద్ బాబు, బారువ ఎస్ఐ పి.నారాయణస్వామి టి. శాసనాం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నారి అంత ఎత్తు ట్యాంకులో ప్రమాదవశాత్తూ పడిపోయే అవకాశం లేదని, అందుకే హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. అనుమానితులను గుర్తించలేదని, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్మగ్లింగ్ రూట్ మారింది
సీతారామపురం: వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు తరలిస్తున్నట్టుగా నమ్మించారు. అయితే ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మండలంలోని చింతోడు గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో బుధవారం సీతారామపురం పోలీసులు 92 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దుంగలను కావలి డీఎస్పీ రఘు పరిశీలించి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వింజమూరుకి చెందిన భీమిరెడ్డి ఓబుల్‌రెడ్డి, చింతోడుకి చెందిన రాచూరి రవి కొందరితో కలిసి చింతోడు అటవీ ప్రాంతంలో దుంగలు నరికించారు. సమీపంలో చెరువు దగ్గర వాటర్ ట్యాంకర్లో నీళ్లు నింపుతున్నట్లుగా నటించి అందులో దుంగలను ఉంచారు. ట్యాంకర్ ద్వారా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారని సీతారామపురం పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఎస్సై రవీంద్రనాయక్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాళ్లు విసిరి.. చెరువు వద్దకు చేరుకున్న పోలీస్ వాహనాన్ని చూసిన ఎర్రచందనం దొంగలు ట్యాంకర్, రెండు మోటార్‌బైక్‌లు, ఒక ఆటోని వదిలి పోలీసులపై రాళ్లు విసురుతూ పరిగెత్తారు. దీంతో పోలీసులు వెంబడించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 11 మంది పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్యాంకర్‌ను పరిశీలించగా అందులో 92 ఎర్రచందనం దుంగలున్నాయి. వాటిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ రూ.1.25 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ట్యాంకర్, బైక్‌లు, ఆటో ఖరీదు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని ఓబుల్‌రెడ్డి, పవన్‌కుమార్‌గా గుర్తించి వారిని విభిన్న కోణాల్లో విచారిస్తున్నారు. ఎర్రచందనం దొంగలను పట్టుకుని, దొంగలను స్వాధీనం చేసుకున్న ఎస్సై రవీంద్రనాయక్‌ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఉదయగిరి సీఐ ఉప్పాల సత్యనారాయణ, ఎస్సై ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటి ట్యాంకరు బీభత్సం
విశాఖపట్నం, భీమునిపట్నం: మంచినీటి ట్యాంకరు వాహనానికి బ్రేకులు ఫెయిల్ కావడంతో బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భీమిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి ఎగువపేట వైపు దిగుతున్న జీవీఎంసీ మంచినీటి ట్యాంకరు బ్రేకులు ఫెయిల్ కావడంతో అతివేగంగా క్రిందకు దూసుకొచ్చింది. ఎగువపేట వేదిక వద్దకు వచ్చి వైజాగ్‌కు చెందిన ఓ వ్యక్తి నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చి పార్కు చేసిన కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు›మీద కూడా ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో ఇదే ప్రదేశంలో ఒక జీపు అదుపు తప్పడంతో ఇద్దరు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
టీడీపీ జెండాతో తాగునీటి సరఫరా!
చిత్తూరు, పలమనేరు: ప్రజలకు మంచినీటిని ప్రభుత్వం ద్వారా సరఫరా చేసే ట్యాంకర్‌కు పసుపు జెండా కట్టుకుని, ఆ పార్టీ అభ్యర్థి ఫొటోలను అంటించుకుని తిరుగుతున్న వాటర్ ట్యాంకర్‌ను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన మంగళవారం మండలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామంలో మంచినీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ స్టార్టర్ చెడిపోయింది. దీనిని రిపేరు చేయించకుండా అక్కడి టీడీపీ నేతల ఆదేశాలతో ఎన్నికల నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రభుత్వం ద్వారా ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని పక్క గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త తన ట్యాంకర్‌తో సరఫరా చేస్తున్నాడు. ఆ ట్రాక్టర్‌కు ముందు వైపు టీడీపీ జెండా, ట్యాంకర్‌కు అభ్యర్థి ఫొటోలను అంటించి మంచినీటి సరఫరా చేస్తుండడంతో గ్రామస్తులు నిలదీశారు. ఇలా నీటి సరఫరాతో ఓటర్ల ప్రలోభపెడుతున్నారని డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో అక్కడికి చేరుకున్న ట్రాక్టర్ యజమాని తమ ప్రభుత్వ పాలనలో ఇష్టం వచ్చినట్టు చేస్తామనడంతో వాగ్వాదానికి దారితీసింది. దీనిపై గ్రామస్తులు చిట్టిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి గ్రామీణనీటి సరఫరా, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో పాటు సిటిజన్ విజిలెన్స్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం! -
విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్..!
-
విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్..!
సాక్షి, హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మరో విద్యార్థిని బండి చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. అబిడ్స్‌లోని చాపెల్ రోడ్డులో గల రోజారీ కాన్వెంట్లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దియా జైన్‌పై నుంచి వాటర్ ట్యాంకర్ దూసుకుపోయింది. తీవ్ర గాయాలపాలైన బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తండ్రి నరేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. -
విమానం టేకాఫ్ అవుతుండగా..
కోల్‌కతా : ఖతార్ ఎయిర్వేస్కు చెందిన కోల్‌కతా- దోహ విమానాన్ని గురువారం తెల్లవారుజామున టేకాఫ్ అవుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ ఢీకొంది. కో్ల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 100 మంది ప్రయాణీకులున్నారు. ఘటన జరిగిన వెంటనే వారందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేశారు. విమానం పాక్షికంగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. కాగా ఉదయం 2.30 గంటలకు ప్రయాణీకులు విమానంలోకి ఎక్కుతున్న క్రమంలో వాటర్ ట్యాంకర్ విమానం ల్యాండింగ్ గేర్‌కు సమీపంలో మధ్య భాగాన్ని ఢీకొట్టిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన వెంటనే ప్రయాణీకులను దించివేసి తనిఖీలు చేపట్టారని, ప్రయాణీకులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమీప హోటల్లో ప్రయాణీకులందరికీ వసతి సౌకర్యం కల్పించామని, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానంలో వారిని దోహా తరలిస్తామని వెల్లడించారు. వాటర్ ట్యాంకర్ బ్రేక్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే విమానాన్ని ఢీ కొట్టిందని ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఏఏఐ అధికారులు పేర్కొన్నారు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదని నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నాడు. పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కిందకు దింపి అతని ప్రాణాలను కాపాడారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండె మండలం గుడిబండ గ్రామానికి చెందిన గణేష్ భార్య భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. కాపురానికి రావడానికి భార్య నిరాకరించడంతో చేసేది లేక శనివారం రాత్రి సుమారు 100 అడుగుల ఎత్తు ఉన్న నీటి ట్యాంక్ ఎక్కాడు. భార్య కాపురానికి రాకపోతే పైనుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకొంటానని బెదిరించారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ సీఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. ఎంతో నేర్పుతో అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. తరువాత భార్య భర్తలిద్దరికి సర్దిచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. -
కూకట్‌పల్లిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలోని మూసాపేట్ గూడ్ షెడ్ రోడ్డులో ఓ వాటర్ ట్యాంకర్ భీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి పార్క్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక కారు, ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
ఆలస్యానికి చెక్
►బుక్ చేసిన వెంటనే నీటి ట్యాంకర్ ►అదే రోజు 90 శాతం సరఫరా.. ►సిటీలో తగ్గుతున్న నీటి డిమాండ్ సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్‌ను బుక్‌చేసి నీటి కోసం కళ్లు కాయలు కాసేలా వేచిచూడాల్సిన అవసరం ఇక ఉండదు. మహానగరం పరిధిలో ఇక నుంచి బుకింగ్‌లు జరిగిన రోజునే 90 శాతం మందికి నీటిని సరఫరా చేసేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ట్యాంకర్ నీటి బుకింగ్‌లు క్రమంగా తగ్గుతుండడంతో కోరినవారికి వెంటనే ట్యాంకర్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కృష్ణా, గోదావరి జలాలతో గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు జలమండలి ప్రణాళికాబద్ధంగా పలు ప్రాంతాల్లో సరఫరా నెట్వర్క్ విస్తరిస్తోంది. దీంతో పలు ప్రాంతా ల్లోని సిటీజన్ల దాహార్తి క్రమంగా తీరడంతోపాటు ట్యాంకర్లకు డిమాండ్ భారీగా తగ్గింది. గతంలో సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి నగరానికి 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం వాటి నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో కృష్ణా, గోదావరి పథకం కింద 376 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. డిమాండ్ తగ్గుతోందిలా.. సుమారు కోటి జనాభా, 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నగరానికి ప్రస్తుతం మంచినీటి సరఫరాకు 8 వేల కిలోమీటర్ల మార్గంలో పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్ల రుణంతో శివారు ప్రాంతాల్లో 2000 కి.మీ. మార్గంలో పైప్లైన్లు, నీటినిల్వకు జలమండలి 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పైప్‌లైన్ పనులు పూర్తికావడంతో వందలాది శివారు కాలనీలకు జలభాగ్యం దక్కింది. దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులోకి రావడం.. ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో నీటిసరఫరా జరుగుతుండడంతో ట్యాంకర్ నీటిపై ఆధారపడడం తగ్గినట్లు జలమండలి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నాయి. రుతుపవనాలు కరుణిస్తే ఆయా ప్రాంతాలకు జూలై నుంచి రోజూ నీటిసరఫరా జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. -
కళాశాల ఎదుటే మృత్యు ఒడిలోకి..
మరికొన్ని అడుగులు వేస్తే కళాశాల.. ఇంతలో వాటర్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళింపు. కళాశాలకు కూతవేటు దూరంలోమృత్యు ఒడిలోకి తమ విద్యార్థులు చేరడంతో అధ్యాపక సిబ్బంది ఆగ్రహంతో రోడ్డెక్కడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఈవినింగ్ కళాశాలకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థినులను ట్యాంకర్ లారీ బలిగొనడం సర్వత్రా విషాదంలో నెట్టింది. - సాక్షి, చెన్నై ► లారీ రూపంలో కబళింపు ► ముగ్గురు విద్యార్థినుల బలి ► మరో ముగ్గురి పరిస్థితి విషమం ► కట్టలు తెంచుకున్న ఆగ్రహం ► ట్రాఫిక్ పద్మవ్యూహంలో గిండి - సైదాపేట మార్గం ► ఈవినింగ్ కళాశాలతో ఉన్నత చదువు సాక్షి, చెన్నై: చెన్నై మహానగరంలోని ప్రధాన మార్గం గిండి - సైదాపేట మీదుగా సాగే అన్నా సాలై. ఈ మార్గంలో నిత్యం వాహనాలు దూసుకెళ్తుంటాయి. గిండి నుంచి సైదాపేట వైపుగా మెట్రో రైలు పనులు ముగియడంతో రోడ్డు కాస్త విశాలంగానే ఉంటుంది. దీంతో అతి వేగంగా దూసుకెళ్లే వాహనాలు ఎక్కువే. ఇక్కడి వంతెనల కింద కూర్చుని జరిమాన మోత మో గించడం మీద ఉత్సాహం చూపించే ట్రాఫిక్ సిబ్బంది, ఆ మార్గం వెన్నంటి రోడ్డు దాటాలంటే గగనంతో సతమతం అవుతున్న వారికి సాయ పడేది అరుదే. గిండి - సైదాపేట మా ర్గంలో కొన్ని ప్రైవేటు సంస్థలు, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్పిక్ తదితర కార్యాలయాలతో పాటు చెల్లమ్మాల్ మహిళా డిగ్రీ కళాశాల ఉంది. ఇక్కడ ఈవినింగ్ క్లాసులు షిఫ్ట్‌ల వారీగా సైతం జరుగుతూ వస్తున్నాయి. ఈ దృష్ట్యా, నిత్యం ఇక్కడికి విద్యార్థినులు వస్తూ వెళ్తుంటారు. అయితే, ఇక్కడికి రావాలంటే, గిండి బస్టాండ్ లేదా, చిన్న మలై బస్టాండ్ నుంచి సుమారు ఒకటిన్నర కిమీ దూరానికి పైగా నడవాల్సిందే. మధ్యలో బస్టాప్ ఉన్న , వంతెన మీద నుంచి దూసుకొచ్చే నగర రవాణా సంస్థ డ్రైవర్లకు ఆ స్టాప్ పట్టదు. దీంతో విద్యార్థినులు, సిబ్బంది తదిరులు గిండి లేదా, చిన్నమలై నుంచి నడక సాగించాల్సిన పరిస్థితి. గురువారం నాటి ఘటనతో ఏ మేరకు విద్యార్థినులు రోడ్డు దాటేందుకు ఇక్కడ ఇక్కట్లకు గురి అవుతున్నారో, కిలో మీటర్ల కొద్ది ఏ మేరకు నడక సాగించి కళాశాల మెట్లు ఎక్కుతున్నారో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇందుకు చెల్లించుకున్న మూల్యం ముగ్గురు విద్యార్థినుల ప్రాణాలు. కళాశాల ఎదుటే...: మరికొన్ని అడుగు వేస్తే కళాశాల, అయితే, క్షణాల వ్యవధిలో ట్యాంకర్ లారీ రూపంలో ముగ్గురు విద్యార్థినుల్ని మృత్యువు కబళించింది. ఏడుగురు విద్యార్థినులు గిండిలో బస్సు దిగి, కళాశాలకు నడచుకుంటూ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటల సమయంలో గిండి వంతెన మీద నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ లారీ స్పిక్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద ముందుగా వెళ్తున్న మోటార్‌సైకిళ్లను ఢీకొంది. లారీని అదుపు చేయని పరిస్థితిలో ఉన్న డ్రైవర్ మరింత ముందుకు తీసుకెళ్లి ఓ ఆటోను ఢీకొట్టాడు. ఆటోను ఢీకొని, కళాశాల వైపుగా అడుగులు వేస్తున్న విద్యార్థుల మీదుగా దూసుకెళ్లాడు. మెట్రో రైలు వంతెనను ఢీకొని లారీ ఆగడంతో క్షణాల్లో డ్రైవర్ ఉడాయించాడు. ఈ హఠాత్ పరిణామంతో ఆ పరిసరాల్లో దూసుకెళ్తోన్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగాయి. పరుగున వెళ్లిన వాళ్లందరూ అక్కడి దృశ్యాల్ని చూసి తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సంఘటన స్థలంలో ముగ్గురు విద్యార్థినులు విగత జీవులుగా మారడం, మరో విద్యార్థిని గాయాలతో కొట్టు మిట్టాడుతుండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ ట్యాంకర్ కారణంగా మోటారు సైకిలిస్టు, మరో వ్యక్తి తీవ్రగాయాలతో పడి ఉండడంతో ఆ ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రాయపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉద్వేగం...ఆగ్రహం: తమ కళాశాల విద్యార్థినులు ప్రమాదంలో మరణించిన సమాచారంతో అక్కడి అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు బయటకు పరుగులు తీశారు.విగత జీవులుగా పడి ఉన్న సహచర విద్యార్థినులను చూసి బోరున విలపించారు. అధ్యాపక సిబ్బంది ఉద్వేగానికి లోనయ్యరు. రోడ్డు మీదకు చేరుకుని తాము, తమ విద్యార్థినులు పడుతున్న దిన దిన గండం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి.ట్రాఫిక్ పోలీసులు ఉరకలు తీశారు. పోలీసులకే ముచ్చమటలు పట్టించే విధంగా మహిళా సిబ్బంది విరుచుకు పడ్డారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వారిని బుజ్జగించేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఆ గమేఘాలపై మృతదేహాలను రాయపేట మార్చురీకి తరలించారు. మృతి చెందిన విద్యార్థినుల్లో గాయత్రి, చిత్ర, ఆశ ఉన్నారు. గాయత్రి బీకాం ద్వితీయ సంవత్సరం, మిగిలిన ఇద్దరు తృతీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలకు చెందిన వారు కావడం గమనార్హం. తమ పిల్లల మరణ సమాచారంతో ఆ కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగాయి. ఈ ఘటన చెన్నై వాసుల్ని విషాదంలోకి నెట్టాయి. గాయపడ్డ వారిని మోటారు సైకిలిస్టు శివరాజ్, మరో విద్యార్థిని జయశ్రీ గా గుర్తించారు. మరొకరి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో అన్నా సాలై ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. ఇక, ఉడాయించిన లారీ డ్రైవర్ విరుదునగర్‌కు చెందిన రాజేంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లి ముగ్గురు విద్యార్థినులు మృతి
చెన్నై: కళాశాలకు వెళ్తున్న విద్యార్థినులపై వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు విద్యార్థినులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థినులతోపాటు ఓ మోటారు సైకిలిస్టు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చెన్నైలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే చెన్నై గిండి - సైదాపేట మార్గంలోని తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుకు కూత వేటు దూరంలో చెల్లమ్మాల్ డిగ్రీ కళాశాల ఉంది. ఈ కళాశాల విద్యార్థినులు పలువురు గిండి నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వైపుగా కళాశాలకు సమీపంలో వెళ్తుండగా, వాటార్ ట్యాంకర్ రూపంలో ముగ్గుర్ని మృత్యువు కబళించింది. అతి వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ ముందుగా ఓ మోటారు సైకిల్‌ను, మరో ఆటోను ఢీకొట్టి అదుపుతప్పి విద్యార్థినుల మీదుగా లారీ దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలో చిత్ర, గాయత్రి, ఆషా అనే ముగ్గురు విద్యార్థినులు మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ జయశ్రీ అనే విద్యార్థిని, మోటారు సైకిలిస్టు శివరాజ్‌తో పాటు మరొకర్ని చికిత్స నిమిత్తం రాయపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ రాజేంద్రన్ పోలీసులు అరెస్టు చేశారు. -
నీటి ట్యాంకర్ బోల్తా
హిందూపురం అర్బన్ : పట్టణంలోని పులమతి రోడ్డు గంగమ్మ గుడి వెనుక 10వ వార్డులో ఆదివారం నీటి ట్యాంకర్ బోల్తా పడింది. వార్డులో రోడ్డు, డ్రైన్లు లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తమై ఒక్కసారిగా పక్కకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం జేసీబీ యంత్రాన్ని తీసుకువచ్చి ట్యాంకర్‌ను సరి చేసి రోడ్డుపైకి తీసుకువచ్చారు. రోడ్లు సరిగా వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా బిర్కూరు మండలం నసుర్లాబాద్లో ఆదివారం ఉదయం నీళ్ల ట్యాంకర్ వాహనం వేగంగా వచ్చి సైకిల్‌పై వెళుతున్న సబావత్ చందర్ (55)ను ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు అక్కడే మృతి చెందాడు. మృతుడ్ని రాములగుట్ట తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. -
వాటర్ ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి
వాటర్ ట్యాంకర్ ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని శేర్లింగంపల్లి చౌరస్తా వద్ద గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ రోడ్డు మీద ఉన్న చిన్నారిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయాలై అక్కడిక క్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారి మధ్యలో విజయవాడ వైపు వెళ్లే మార్గంలో డివైడర్‌పై ఉన్న మొక్కలకు నీళ్ల ట్యాంకర్ సాయంతో ఓ కూలీ నీరు పెడుతున్నాడు. అదే సమయంలో వచ్చిన ఓ ట్రాలీ నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్‌తోపాటు, నీరు పెడుతున్న కూలీ కూడా మృతి చెందాడు. -
దుండగుల దుశ్చర్యతో కలకలం
► నీటి ట్యాంకర్లో విషగుళికలు కలిపిన వైనం ► లట్టుపల్లిలో 20మందికి అస్వస్థత ► విచారణ చేపట్టిన ఎస్ఐ బిజినేపల్లి : నీటి ట్యాంకర్లో దుండగు లు విషగుళికలు కలపడం కలకలం రేపింది. ఈ సంఘటనతో 20మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం బిజినేపల్లి మండలం లట్టుపల్లిలోని మూడు, నాలుగు వార్డుల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అంతకుముందే అందులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుళికలమందు కలపగా ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో ఆ నీటిని తాగిన సునీత, గీత, రాంచరణ్, ప్రవళిక, సోఫియాన్, మహిన్, చిన్న య్య, సూర్యతేజ, జరీనాబేగం, ఊశన్న, అబ్దుల్అజీద్తోపాటు మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరు వాంతులు చేసుకోవడంతోపాటు కడుపునొప్పితో బాధపడుతుండటంతో వెంటనే 108వాహనంలో బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని (పీహెచ్సీ) కి తీసుకెళ్లి వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ ఎద్దుల రాములు బాధితులను పరామర్శించి మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి ట్యాంకర్‌ను నిలిపి ఉంచిన చోట వేముల జెన్నయ్య ఇంటి వద్ద పశుగ్రాసంపైనా విషగుళికలు చల్లడంతో అవి తిన్న రెండు కోళ్లు మృతి చెందాయి. కాగా ఈఓపీఆర్డీ పండరీనాథ్, సెక్రటరీ జయరాం గ్రామంలో తిరిగి విషం కలిసిన నీటిని పారబోయించారు. ఈ విషయమై పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వీరబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
నీళ్ల ట్యాంకర్ పడి యువకుడి దుర్మరణం
నేరేడుచర్ల: కూలీ పనులకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన కురుపోతు నగేష్(21) నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె సమీపంలో కొనసాగుతున్న సాగర్ కాల్వ పనుల్లో పాల్గొంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పనులకు అవసరమైన నీటిని సరఫరా చేసే ట్యాంకర్ ప్రమాదవశాత్తు అతనిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన నగేష్ అక్కడికక్కడే చనిపోయాడు. -
వాటర్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
వాటర్ ట్యాంకర్ ఢీకొని హైదరాబాద్ లోని కాచిగూడ చౌరస్తాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సయ్యుద్దీన్‌అలీ (40) చౌరస్తా సమీపంలో కేడీఆర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా... వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అతడిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అలీ అక్కడే మృతి చెందాడు. పోలీసులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రఫీని అదుపులోకి తీసుకున్నారు. -
ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి
నారాయణపేట్: ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారిని నీటి ట్యాంకర్ బలి తీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌లోని బీసీ కాలనీలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నీటితో ట్యాంకర్ బీసీ కాలనీలో వెళుతుండగా.. రేఖ అనే నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంట్లోంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. డ్రైవర్ గమనించి ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ట్యాంకు వెనుక టైర్ కిందపడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన తర్వాత స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాటర్ ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి
మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా): ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని ఓ చిన్నారి బలైపోయింది. డ్రైవర్ ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని నడుపుతుండగా ట్యాంకర్ చిన్నారి పైకి దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ సంఘటన మండల పరిధి రావిర్యాలలోని వండర్లా అమ్యూజింగ్ పార్క్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బలభద్రపల్లి గ్రామానికి నర్సమ్మ, వెంకటప్ప దంపతులకు కూతురు జయశ్రీ(1) ఉంది. వీరు రావిర్యాలలోని వండర్లా అమ్యూజింగ్ పార్క్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ అక్కడే షెడ్లలో ఉంటున్నారు. శనివారం సాయంత్రం దంపతులు పనులు ముగించుకొని షెడ్డుకు వచ్చారు. చిన్నారి జయశ్రీ షెడ్ పక్కన ఆడుకుంటోంది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సైదులు నీటిని నింపుకొని పార్క్‌లోకి వచ్చాడు. అతడు నిర్లక్ష్యంగా నడపడంతో చిన్నారి జయశ్రీ పైకి దూసుకెళ్లింది. తల పైనుంచి లారీ టైర్ వెళ్లడంతో నుజ్జునుజ్జయి చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సైదులు వాహనాన్ని వదిలేసి పరారయ్యేందుకు యత్నించగా కార్మికులు, స్థానికులు పరుగెత్తి పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఆదిబట్ల ఠాణా ఎస్ఐ మదన్‌లాల్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి మృతికి కారణమైన డ్రైవర్ సైదులును అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్క్ యాజమాన్యం కార్మికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మికులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని కంపెనీ మేనేజర్ మధుసూదన్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయిందని స్థానికులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు నర్సమ్మ, వెంటకప్ప దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈమేరకు ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మదన్‌లాల్ తెలిపారు. -
బైక్‌ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్..ఒకరు మృతి
హైదరాబాద్ సిటీ: సికింద్రాబాద్‌లోని బోయిన్ పల్లి డెయిరీ ఫాం వద్ద బైక్‌ను వాటర్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. దీంతో కాసేపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయి వ్యక్తి వివరాలు తెలియరాలేదు.