నీటి యుద్ధాలకు..ఇది ఆరంభం!
ద్వారకలో వాటర్‌ట్యాంకర్ హైజాకింగ్‌పై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో నీటి యుద్ధాలు మొదలయ్యాయని అత్యున్నత న్యాయస్థానమైన ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నగరంలోని ద్వారక ప్రాంతంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్‌ను స్థానికులు కొందరు హైజాక్ చేసిన ఘటనపై స్పందిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో జరగబోయే నీటి యుద్ధాలకు ద్వారక ఘటన ఆరంభమని పేర్కొంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, ఆ ప్రాంతాల్లో ఉంటున్నవారి పరిస్థితి దయనీయంగా ఉందని కోర్టు పేర్కొంది.
ద్వారకలో నీటి కొరతను తీర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు బదార్ బుర్రేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఆగస్టు 6న డీడీఏకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 10 నాటికి ద్వారక వాసుల నీటి కొరతను తీర్చేందుక పది బోరువావులను అందుబాటులోకి తేవాలని ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారం పదో తేదీ దాటిపోవడంతో తాము చేపట్టిన చర్యలను డీడీఏ కోర్టుకు వివరించింది. ద్వారక ప్రాంతంలో 14 గొట్టపు బావులు అందుబాటులో ఉన్నాయని, కోర్టు ఆదేశించినట్లుగా మరో పది బోరుబావులను ఏర్పాటు చేశామని, అందులో 8 ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయని తెలిపింది.
సాంకేతిక కారణాల వల్ల మిగతా రెండు బోర్లు పనిచేయడం లేదని, రెండువారాల్లో అవి కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పింది. కాగా డీడీఏ ఇచ్చిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ద్వారకలో నీటి కొరతపై రెండు వారాల్లో స్థాయీ నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఏర్పాటు చేసిన బోరుబావులకు సంబంధించిన చిత్రాలను కోర్టు ముందుంచాలని సూచించింది. ఈ బోరుబావుల్లోని నీటిని ప్రధాన నీటి సరఫరా పైపులైన్‌కు కలుపుతున్నారా? లేక నీటి ట్యాంకర్లను నింపేందుకు ఉపయోగిస్తున్నారా? అనే వివరాలను కూడా కోర్టుకు తెలియజేయాలని పేర్కొంది.
అయితే ఈ బోరుబావులు, ట్యాంకర్లు తాత్కాలికంగా మాత్రమే ప్రజల దాహార్తిని తీరుస్తాయని, ద్వారకవాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు ఏం చేయాలని యోచిస్తున్నారో చెప్పండంటూ కోర్టు ప్రశ్నించింది. దీనికి డీడీఏ న్యాయవాది స్పందిస్తూ... ఢిల్లీ జల్ బోర్డు నీటి కోసం తాము ఎదురు చూస్తున్నామని, ప్రధాన పైపులైన్‌కు సంబంధించి కొన్ని కేసులు హైకోర్టులో పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ జల్‌బోర్డు తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ద్వారక ప్రాంతం చాలా ఇరుకైన ప్రదేశమని, నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలన్నా, బోరుబావులు తవ్వలన్నా అక్కడ ఖాళీ ప్రదేశమే లేదన్నారు. అయినప్పటికీ 16 బోరుబావులను ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు.
విద్యుత్ సంబంధిత పనులు పూర్తయితే మరో 10 త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. కేవలం ద్వారకలో మాత్రమే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు ఢిల్లీ జల్ బోర్డు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. ఇదిలాఉండగా నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ వేసవికి నీటి ఇబ్బందులు పెద్దగా ఉండవని చెబుతున్నారు. అయితే వాటిని నగరవాసులకు సరఫరా చేయడమే ఇబ్బందికరంగా మారింది.