water wars
-
నీటి యుద్ధాలు రానున్నాయా!
గత చరిత్రను చూస్తే ధనం, భూమి, స్త్రీ, ఆహారం, అధికారం, ఆధిపత్యం అనే అంశాల ప్రాతిపదికనే యుద్ధాలు సంభవించాయి. మానవుని ప్రాథమిక అవసరాలు గాలి, నీరు, ఆహారం. వీటిలో నీరు అమృతం వంటిది. సర్వ ప్రాణికోటి దాహార్తిని తీర్చుతుంది. ఆహారోత్పత్తిలో ప్రధాన వనరు నీరే. మానవ నాగరికత అంతా నదీ ప్రాంతాల్లోనే విలసిల్లింది. మనిషి సామాజిక, ఆర్థిక ప్రగతికి నీరే పునాదిగా నిలుస్తుంది. అందువల్ల నీటి వనరులను అత్యంత జాగరూకతతో కాపాడుకోవాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత మానవ జీవనానికి పెనుసవాలై నిలుస్తున్నది. ఎక్కడైనా తీవ్ర నీటి కొరత ఏర్పడితే, ఒక మనిషి మరొక మనిషిపై యుద్ధం చేసే పరిస్థితులు రావచ్చు. నీటి కొరత అనేది రాను రాను తీవ్రమైతే ఒక ఊరు మరొక ఊరుపై, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంపై, ఒక జాతి మరొక జాతిపై అంతర్యుద్ధాలు చేసే పరిస్థితి వస్తుంది. అలాగే ఇరుగుపొరుగు దేశాల మధ్యా యుద్ధాలు చెలరేగవచ్చు.నీటి కోసం జరిగే యుద్ధాలు రెండు రకాలుగా పుట్టుకొస్తాయి. మొదటిది నీటి కొరత వల్ల వచ్చే యుద్ధాలు. రెండోది అధిక నీటి లభ్యత వల్ల వచ్చే యుద్ధాలు. నీరు లభ్యత వల్ల వచ్చే యుద్ధాలను సులువుగా పరిష్కరించుకోవచ్చు.ఉదాహరణకు నదీ జలాల పంపకాలను ఇరుపక్షాల వారు చర్చల ద్వారా పరిష్కరించుకోగలరు. అదే నీటి కొరత వల్ల వచ్చే యుద్ధాలు దానికి గల మూల కారణాలను అన్వేషించటం, విశ్లేషించటం ద్వారా మాత్రమే పరిష్కరించగలరు. వీధుల్లో కుళాయిల వద్ద బిందెలను తాడించడంతో క్రిందిస్థాయిలో నీటి కొరత యుద్ధాలు మొదలవుతాయి. చిన్న చిన్న నీటి తగాదాలు, పెద్ద పెద్ద జల వివాదాలు, చిలికి చిలికి గాలివానై నీటి యుద్ధాలుగా మారుతాయి. నీటి యుద్ధాలు అని నేరుగా పిలవకపోయినా, నీరు అనేక సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారితీస్తుందనేది యథార్థం. ఇదిలా ఉంటే భవిష్యత్తులో నీటి యుద్ధాలు సంభవించే అవకాశాలు లేవని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.కానీ వీరి మాటలకు విరుద్ధంగా అఫ్ఘానిస్తాన్–ఇరాన్ దేశాల మధ్య హెల్మండ్ నదీ జలాల కోసం రెండు గంటలసేపు యుద్ధం తీవ్రంగా జరగడం చూశాం. ఇంకా చారిత్రకంగా పరిశీలిస్తే టర్కీ–సిరియా–ఇరాక్ దేశాల మధ్య టైగ్రిస్–యూప్రెటిస్ నీటి వివాదం పురాతన కాలం నుండి కొనసాగుతున్నది. నైలునది నీటి కోసం ఈజిప్ట్–సూడాన్–ఇథియోపియా దేశాల మధ్య జల జగడం సాగుతున్నది. మెకాంగ్ నది నీరు కోసం చైనా–లావోస్ మధ్య జల వివాదం ఉంది. భారతదేశంలో కావేరీ జలాల పంపిణీపై తమిళనాడు, కర్ణాటకల మధ్య అంతర్రాష్ట్ర జల వివాదముంది. దీనికి 2018లో పరిష్కారం దొరికినా, ఇంకా సమస్య శాశ్వతంగా కొలిక్కి రాలేదు.గత జల వివాదాలను దృష్టిలో పెట్టుకునే ఒకప్పటి ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) సెక్రటరీ జనరల్ బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ‘మధ్యప్రాచ్యంలో తదుపరి యుద్ధం నీటిపైనే జరుగుతుంది’ అని అన్నారు.మరో పూర్వ యూఎన్ఓ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ‘మంచినీటి కోసం తీవ్రమైన పోటీ ఏర్పడి, భవిష్యత్తులో అది కాస్తా సంఘర్షణగా, యుద్ధాలుగా మారవచ్చు’ అని సెలవిచ్చారు. ఇంకొక మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ‘యుద్ధాలు మరియు సంఘర్షణలకు నీటి కొరత అనేది శక్తిమంతమైన ఇంధనంగా పనిచేస్తుంది’ అని భవిష్యద్దర్శనం చేశారు. వీరి అభిప్రాయాలను బలపరుస్తూ ఇటీవల జరిపిన సర్వేలో ఐక్యరాజ్యసమితి తీవ్ర నీటి ఎద్దడికి గల కారణాలను కనుగొంది. ఇంకా నీటి యుద్ధాలు సంభవించే అవకాశాలను అంచనా కట్టిందిలా! యూఎన్ఓ గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ బట్టి 2030 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది అనగా 72 శాతం మంది ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కోనున్నారు. ‘ఒక వ్యక్తికి రోజుకు 50 లీటర్లు చొప్పున కనీసంగా నీరు ఇవ్వాల్సి వస్తే’... అన్న ప్రధాన అంశంతో పాటు మరో పదహారు సుస్థిరాభివృద్ధి సూచికలను ఐక్యరాజ్యసమితి తన సభ్యదేశాలకు నిర్దేశించింది. ఈ ప్రాధాన్యతా క్రమాలతో యూఎన్ఓ సర్వే జరిపి, పై గణాంకాలను వెల్లడించింది.నీటి కొరతకు గల కారణాలను విశ్లేషించగా, ఈ క్రింది విషయాలు తెలుస్తున్నాయి. ప్రపంచమంతటా కాలుష్యం పెరగడంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. దీనివల్ల అతివృష్టి, అనావృష్టులు ఏర్పడుతున్నాయి. అతివృష్టితో వరదలు సంభవించి, ఆ వరద నీరంతా సముద్రాల పాలవుతున్నది.అనావృష్టితో తీవ్ర నీటి సంక్షోభమేర్పడి కరవుకాటకాలు సంభవిస్తున్నాయి. రుతుపవనాలపై ఎక్కువగా ఆధారపడే దేశాలు ఆసియా ఖండంలోనూ, పసిఫిక్ మహాసముద్ర తీరం వెంబడేనూ ఉన్నాయి. అందువల్ల ఈ దేశాల్లోనే ‘ఎల్ నినో–లా నినో’ ప్రభావం అధికంగా ఉంటుంది. వీటి ప్రభావంతోనే ఆ యా దేశాల్లో నీటి కొరత తీవ్రమవుతున్నది. ఈ నీటి కొరతే ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీనివల్లనే వివిధ దేశాల ఆర్థికాభివృద్ధి రేటు దిగువ స్థాయిలో ఉండి, పేదరికం తాండవిస్తోంది. ఒక పక్క భూమ్మీద జనాభా పెరగడంతో నీటి డిమాండ్ ఎక్కువైంది. దాంతో నీటి కొరత సహజంగానే ఏర్పడుతుంది. మరోప్రక్క వ్యవసాయానికి, పరిశ్రమలకు అధిక నీరు అవసరం. అందువల్ల నీటి కొరత దానంతటదే వస్తుంది. పంటల సాగులో ఆధునిక సాగు పద్ధతులు పాటించకపోవడం వలన కూడా నీటి కొరత పుట్టుకొస్తుంది. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడెయ్యడం వల్ల కూడా నీటి కొరత సంభవిస్తుంది.అయితే నీటి కొరత నివారణకు పరిష్కార మార్గాలు లేకపోలేదు. మురుగునీరును, వ్యర్ధ జలాలను పెద్ద ఎత్తున పునర్వినియోగంలోకి తేవాలి. సామాజిక అడవుల పెంపకంతో వర్షపాతం స్థాయిని గణనీయంగా పెంచుకోవచ్చు. ప్రతి బొట్టు వర్షపు నీటినీ ఒడిసిపట్టి భూగర్భ జల నిల్వల స్థాయిని పెంచుకోవాలి. దీని కోసం నివాసం, కార్యాలయం అనే తేడా లేకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వరద నీరు సముద్రాల్లోకి పోకుండా ఎక్కడికక్కడ ఆనకట్ల నిర్మాణం జరగాలి. పెద్ద పెద్ద చెరువుల నిర్వహణ సక్రమంగా ఉండాలి.వీటితో పాటు ఇండియన్ వాటర్ మ్యాన్ ‘రాజేంద్ర సింగ్’ సూచించిన నీటి నిల్వల పరిరక్షణా సూత్రాలు (ఆరు ‘ఆర్’ ల విధానాన్ని) క్షేత్రస్థాయిలో అమలు పరచాలి.ప్రపంచ నీటి వినియోగం గత శతాబ్దం కాలంలో రెండింతలు పెరిగింది. భూమి యొక్క మంచినీటి సరఫరా కేవలం 2.5 శాతం మాత్రమే. వీటిలో ఎక్కువ భాగం హిమానీనదాలలో మంచు రూపంలోనే ఉంది. ఇది ప్రపంచ అవసరాలకు సరిపోవటం లేదు. అందువల్లనే నీరు సమృద్ధిగా ఉన్న దేశాలు, నీరు కొరతగా ఉన్న దేశాలు అన్న విభజన జరిగినట్లు జర్నలిస్ట్ స్టీవెన్ సోలమన్ తన పుస్తకం ‘వాటర్: ది ఎపిక్ స్ట్రగుల్ ఫర్ వెల్త్, పవర్, అండ్ సివిలిజేషన్’లో చెబుతారు.గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే నీటిపై ఆందోళనలు విపరీతంగా పెరిగాయి. నీటిని పరిరక్షించవలసిన బాధ్యతను అందరూ గుర్తిస్తున్నారు. అందువల్ల అధిక జనాభా అవసరాలకు తగినట్టుగా నీటి వనరులను సంరక్షించేందుకు సంబంధిత ప్రభుత్వ పాలనా యంత్రాంగాలు ప్రజల భాగస్వామ్యంతో కృషి చేయాలి. ఇంకా వారికి వివిధ ప్రజా సమూహాలు, పర్యావరణ సమితులు, జల సంరక్షణా కేంద్రాలు, వనమిత్ర మండళ్ళు తమవంతుగా చేయూతనివ్వాలి. అలాకానిచో ప్రపంచంలో తీవ్ర నీటి సంక్షోభం రాకమానదు. ఇదే భవిష్యత్తులో వచ్చే ఎన్నో నీటి యుద్ధాలకు ప్రధాన హేతువు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. -పిల్లా తిరుపతిరావు, వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయుడు ‘ 7095184846 -
భవిష్యత్తులో జల యుద్ధాలు జరగొచ్చు
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కళ్యాణదుర్గం : రాబోయే రోజుల్లో జల యుద్ధాలు రావొచ్చని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. శెట్టూరు మండల పరిధిలోని ములకలేడులో ఆదివారం రుణవిముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆస్తులు, డబ్బుల కోసం యుద్ధాలు రావని, నీటి కోసమే యుద్ధాలు జరగొచ్చన్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఆనకట్ట కడితే మూడవ ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నారు. ప్రాజెక్టుల పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే స్వార్థంతో చంద్రబాబు ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల నాటికి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కళ్యాణదుర్గం చెరువులకు నీటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రైతు రుణమాఫీ చేశారన్నారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ రైతుల మేలు కోసమే సీఎం చంద్రబాబు రుణమాఫీ చేశారన్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. అదేవిధంగా పెరుగుపాళ్యం గ్రామంలో రూ.7.50 లక్షలతో నిర్మించిన గోపాలమిత్ర భవనాన్ని కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమాల్లో యార్డు చెర్మైన్ బాదన్న, జెడ్పీటీసీ కవిత, ఎంపీపీ మానస, తెలుగు యువత నాయకుడు మారుతి చౌదరి, పార్టీ మాజీ కన్వీనర్లు గురుప్రసాద్, రామరాజు, మాజీ జెడ్పీటీసీ శివశంకర, మాజీ ఎంపీపీ మల్లికార్జున, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ జేసీ కళ్యాణదుర్గం పట్టణంలో రూ.6.50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మైన్ గౌస్ మొహిద్దీన్ ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చెర్మైన్ వైపీ రమేష్, కౌన్సిలర్ విశ్వనాథ్, జయం పురుషోత్తం, అనంతపురం గ్రంథాలయాధికారి సుబ్బరత్నమ్మ, వివిధ గ్రంథాలయాధికారులు శ్రీనివాసులు, కిరణ్, తిరుపతమ్మ, కంబన్న, రేవతిభాయి, ఆదిలక్ష్మి, సిబ్బంది వెంకటేశులు, పుల్లన్న, రజిని పాల్గొన్నారు. -
నీటి యుద్ధాలకు..ఇది ఆరంభం!
ద్వారకలో వాటర్‌ట్యాంకర్ హైజాకింగ్‌పై ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: రాజధాని నగరంలో నీటి యుద్ధాలు మొదలయ్యాయని అత్యున్నత న్యాయస్థానమైన ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నగరంలోని ద్వారక ప్రాంతంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్‌ను స్థానికులు కొందరు హైజాక్ చేసిన ఘటనపై స్పందిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో జరగబోయే నీటి యుద్ధాలకు ద్వారక ఘటన ఆరంభమని పేర్కొంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, ఆ ప్రాంతాల్లో ఉంటున్నవారి పరిస్థితి దయనీయంగా ఉందని కోర్టు పేర్కొంది. ద్వారకలో నీటి కొరతను తీర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు బదార్ బుర్రేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఆగస్టు 6న డీడీఏకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 10 నాటికి ద్వారక వాసుల నీటి కొరతను తీర్చేందుక పది బోరువావులను అందుబాటులోకి తేవాలని ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారం పదో తేదీ దాటిపోవడంతో తాము చేపట్టిన చర్యలను డీడీఏ కోర్టుకు వివరించింది. ద్వారక ప్రాంతంలో 14 గొట్టపు బావులు అందుబాటులో ఉన్నాయని, కోర్టు ఆదేశించినట్లుగా మరో పది బోరుబావులను ఏర్పాటు చేశామని, అందులో 8 ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయని తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల మిగతా రెండు బోర్లు పనిచేయడం లేదని, రెండువారాల్లో అవి కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పింది. కాగా డీడీఏ ఇచ్చిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ద్వారకలో నీటి కొరతపై రెండు వారాల్లో స్థాయీ నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఏర్పాటు చేసిన బోరుబావులకు సంబంధించిన చిత్రాలను కోర్టు ముందుంచాలని సూచించింది. ఈ బోరుబావుల్లోని నీటిని ప్రధాన నీటి సరఫరా పైపులైన్‌కు కలుపుతున్నారా? లేక నీటి ట్యాంకర్లను నింపేందుకు ఉపయోగిస్తున్నారా? అనే వివరాలను కూడా కోర్టుకు తెలియజేయాలని పేర్కొంది. అయితే ఈ బోరుబావులు, ట్యాంకర్లు తాత్కాలికంగా మాత్రమే ప్రజల దాహార్తిని తీరుస్తాయని, ద్వారకవాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు ఏం చేయాలని యోచిస్తున్నారో చెప్పండంటూ కోర్టు ప్రశ్నించింది. దీనికి డీడీఏ న్యాయవాది స్పందిస్తూ... ఢిల్లీ జల్ బోర్డు నీటి కోసం తాము ఎదురు చూస్తున్నామని, ప్రధాన పైపులైన్‌కు సంబంధించి కొన్ని కేసులు హైకోర్టులో పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ జల్‌బోర్డు తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ద్వారక ప్రాంతం చాలా ఇరుకైన ప్రదేశమని, నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలన్నా, బోరుబావులు తవ్వలన్నా అక్కడ ఖాళీ ప్రదేశమే లేదన్నారు. అయినప్పటికీ 16 బోరుబావులను ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ సంబంధిత పనులు పూర్తయితే మరో 10 త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. కేవలం ద్వారకలో మాత్రమే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు ఢిల్లీ జల్ బోర్డు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. ఇదిలాఉండగా నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ వేసవికి నీటి ఇబ్బందులు పెద్దగా ఉండవని చెబుతున్నారు. అయితే వాటిని నగరవాసులకు సరఫరా చేయడమే ఇబ్బందికరంగా మారింది. -
రాష్ట్రం విడిపోయినా.. నీటి యుద్ధాలు రావు : సుదర్శన్‌రెడ్డి
మంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడి రాష్ట్రం విడిపోయినా ఇప్పుడున్న కేటాయింపులే కొనసాగుతాయి జల పంపిణీకి బోర్డులు ఏర్పడతాయి వరదలొస్తేనే మిగులుజల ఆధారిత ప్రాజెక్టులకు నీళ్లు సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం విడిపోయినా ఎలాంటి నీటి యుద్ధాలు రావని రాష్ర్ట సాగునీటి శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. నీటి పంపకాల్లో కొత్త సమస్యలు రావని, ఇప్పుడున్న కేటాయింపులనే కొనసాగిస్తారని అన్నారు. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు నీటిని మన రాష్ర్టంతో పాటు కర్ణాటక కూడా పంచుకుంటోందని, ఇందుకోసం ప్రత్యేక బోర్డు ఉందని గుర్తుచేస్తూ...భవిష్యత్తులో తెలంగాణ-సీమాంధ్ర రాష్ట్రాలకు జల పంపిణీకి బోర్డులు వస్తాయని అన్నారు. నీళ్లు రావనే విషయంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలు భయాందోళనలకు గురికావద్దని సూచించారు. అయితే మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు మాత్రం నీటి కేటాయింపులు రావని, వరదలు వచ్చిన సమయంలోనే ఈ ప్రాజెక్టులు నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో నీటి కేటాయింపుల్లో సమస్యలు తలెత్తుతాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి మంగళవారం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో పరోక్షంగా విభేదించారు. ‘ఆయన (సీఎం) అభిప్రాయం అది...నా అభిప్రాయం ఇది..’ అంటూ వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయం వ్యక్తిగతమా? ప్రభుత్వ పరమైనదా? అన్న ప్రశ్నకు.. ఒక మంత్రిగా చెప్తున్నానని అన్నారు. పోలవరానికి నీరు రాదనే ప్రచారాన్ని నమ్మవద్దని గోదావరి జిల్లాల ప్రజలకు సూచించారు. కృష్ణా డెల్టాకు కూడా ఎలాంటి సమస్య రాదన్నారు. మిగులు జలాలపై ఆధార పడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ (ఎస్ఎల్బీసీ), తెలుగుగంగ, వెలుగొండ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఎలా? అన్న ప్రశ్నకు మాత్రం మంత్రి సరైన సమాధానం చెప్పలేకపోయారు. అలాగే కృష్ణా ట్రిబ్యునల్ కొత్త తీర్పు అమల్లోకి వస్తే దిగువకు వరదనీరు రావడం కూడా కష్టమవుతుంది కదా? అన్న ప్రశ్నకూ సుదర్శన్‌రెడ్డి సరైన వివరణ ఇవ్వలేదు. కృష్టా, గోదావరి నదుల నుంచి ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, ఈ నీటితో ప్రాజెక్టుల అవసరాలను తీర్చవచ్చని అన్నారు. విలేకరుల సమావేశానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వరరావులతోపాటు అంతరాష్ట్ర జలవనరుల విభాగం సీఈ రవూఫ్ తదితరులు హాజరయ్యారు. అయితే వీరంతా వేదిక దిగువున కూర్చున్నారు.