గత చరిత్రను చూస్తే ధనం, భూమి, స్త్రీ, ఆహారం, అధికారం, ఆధిపత్యం అనే అంశాల ప్రాతిపదికనే యుద్ధాలు సంభవించాయి. మానవుని ప్రాథమిక అవసరాలు గాలి, నీరు, ఆహారం. వీటిలో నీరు అమృతం వంటిది. సర్వ ప్రాణికోటి దాహార్తిని తీర్చుతుంది. ఆహారోత్పత్తిలో ప్రధాన వనరు నీరే. మానవ నాగరికత అంతా నదీ ప్రాంతాల్లోనే విలసిల్లింది. మనిషి సామాజిక, ఆర్థిక ప్రగతికి నీరే పునాదిగా నిలుస్తుంది. అందువల్ల నీటి వనరులను అత్యంత జాగరూకతతో కాపాడుకోవాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత మానవ జీవనానికి పెనుసవాలై నిలుస్తున్నది.
ఎక్కడైనా తీవ్ర నీటి కొరత ఏర్పడితే, ఒక మనిషి మరొక మనిషిపై యుద్ధం చేసే పరిస్థితులు రావచ్చు. నీటి కొరత అనేది రాను రాను తీవ్రమైతే ఒక ఊరు మరొక ఊరుపై, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంపై, ఒక జాతి మరొక జాతిపై అంతర్యుద్ధాలు చేసే పరిస్థితి వస్తుంది. అలాగే ఇరుగుపొరుగు దేశాల మధ్యా యుద్ధాలు చెలరేగవచ్చు.నీటి కోసం జరిగే యుద్ధాలు రెండు రకాలుగా పుట్టుకొస్తాయి. మొదటిది నీటి కొరత వల్ల వచ్చే యుద్ధాలు. రెండోది అధిక నీటి లభ్యత వల్ల వచ్చే యుద్ధాలు. నీరు లభ్యత వల్ల వచ్చే యుద్ధాలను సులువుగా పరిష్కరించుకోవచ్చు.
ఉదాహరణకు నదీ జలాల పంపకాలను ఇరుపక్షాల వారు చర్చల ద్వారా పరిష్కరించుకోగలరు. అదే నీటి కొరత వల్ల వచ్చే యుద్ధాలు దానికి గల మూల కారణాలను అన్వేషించటం, విశ్లేషించటం ద్వారా మాత్రమే పరిష్కరించగలరు. వీధుల్లో కుళాయిల వద్ద బిందెలను తాడించడంతో క్రిందిస్థాయిలో నీటి కొరత యుద్ధాలు మొదలవుతాయి. చిన్న చిన్న నీటి తగాదాలు, పెద్ద పెద్ద జల వివాదాలు, చిలికి చిలికి గాలివానై నీటి యుద్ధాలుగా మారుతాయి. నీటి యుద్ధాలు అని నేరుగా పిలవకపోయినా, నీరు అనేక సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారితీస్తుందనేది యథార్థం. ఇదిలా ఉంటే భవిష్యత్తులో నీటి యుద్ధాలు సంభవించే అవకాశాలు లేవని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
కానీ వీరి మాటలకు విరుద్ధంగా అఫ్ఘానిస్తాన్–ఇరాన్ దేశాల మధ్య హెల్మండ్ నదీ జలాల కోసం రెండు గంటలసేపు యుద్ధం తీవ్రంగా జరగడం చూశాం. ఇంకా చారిత్రకంగా పరిశీలిస్తే టర్కీ–సిరియా–ఇరాక్ దేశాల మధ్య టైగ్రిస్–యూప్రెటిస్ నీటి వివాదం పురాతన కాలం నుండి కొనసాగుతున్నది. నైలునది నీటి కోసం ఈజిప్ట్–సూడాన్–ఇథియోపియా దేశాల మధ్య జల జగడం సాగుతున్నది. మెకాంగ్ నది నీరు కోసం చైనా–లావోస్ మధ్య జల వివాదం ఉంది. భారతదేశంలో కావేరీ జలాల పంపిణీపై తమిళనాడు, కర్ణాటకల మధ్య అంతర్రాష్ట్ర జల వివాదముంది. దీనికి 2018లో పరిష్కారం దొరికినా, ఇంకా సమస్య శాశ్వతంగా కొలిక్కి రాలేదు.గత జల వివాదాలను దృష్టిలో పెట్టుకునే ఒకప్పటి ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ) సెక్రటరీ జనరల్ బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ‘మధ్యప్రాచ్యంలో తదుపరి యుద్ధం నీటిపైనే జరుగుతుంది’ అని అన్నారు.
మరో పూర్వ యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ‘మంచినీటి కోసం తీవ్రమైన పోటీ ఏర్పడి, భవిష్యత్తులో అది కాస్తా సంఘర్షణగా, యుద్ధాలుగా మారవచ్చు’ అని సెలవిచ్చారు. ఇంకొక మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ‘యుద్ధాలు మరియు సంఘర్షణలకు నీటి కొరత అనేది శక్తిమంతమైన ఇంధనంగా పనిచేస్తుంది’ అని భవిష్యద్దర్శనం చేశారు. వీరి అభిప్రాయాలను బలపరుస్తూ ఇటీవల జరిపిన సర్వేలో ఐక్యరాజ్యసమితి తీవ్ర నీటి ఎద్దడికి గల కారణాలను కనుగొంది. ఇంకా నీటి యుద్ధాలు సంభవించే అవకాశాలను అంచనా కట్టిందిలా! యూఎన్‌ఓ గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ బట్టి 2030 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది అనగా 72 శాతం మంది ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కోనున్నారు. ‘ఒక వ్యక్తికి రోజుకు 50 లీటర్లు చొప్పున కనీసంగా నీరు ఇవ్వాల్సి వస్తే’... అన్న ప్రధాన అంశంతో పాటు మరో పదహారు సుస్థిరాభివృద్ధి సూచికలను ఐక్యరాజ్యసమితి తన సభ్యదేశాలకు నిర్దేశించింది. ఈ ప్రాధాన్యతా క్రమాలతో యూఎన్‌ఓ సర్వే జరిపి, పై గణాంకాలను వెల్లడించింది.
నీటి కొరతకు గల కారణాలను విశ్లేషించగా, ఈ క్రింది విషయాలు తెలుస్తున్నాయి. ప్రపంచమంతటా కాలుష్యం పెరగడంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. దీనివల్ల అతివృష్టి, అనావృష్టులు ఏర్పడుతున్నాయి. అతివృష్టితో వరదలు సంభ
వించి, ఆ వరద నీరంతా సముద్రాల పాలవుతున్నది.
అనావృష్టితో తీవ్ర నీటి సంక్షోభమేర్పడి కరవుకాటకాలు సంభవిస్తున్నాయి. రుతుపవనాలపై ఎక్కువగా ఆధారపడే దేశాలు ఆసియా ఖండంలోనూ, పసిఫిక్ మహాసముద్ర తీరం వెంబడేనూ ఉన్నాయి. అందువల్ల ఈ దేశాల్లోనే ‘ఎల్ నినో–లా నినో’ ప్రభావం అధికంగా ఉంటుంది. వీటి ప్రభావంతోనే ఆ యా దేశాల్లో నీటి కొరత తీవ్రమవుతున్నది. ఈ నీటి కొరతే ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీనివల్లనే వివిధ దేశాల ఆర్థికాభివృద్ధి రేటు దిగువ స్థాయిలో ఉండి, పేదరికం తాండవిస్తోంది. ఒక పక్క భూమ్మీద జనాభా పెరగడంతో నీటి డిమాండ్ ఎక్కువైంది. దాంతో నీటి కొరత సహజంగానే ఏర్పడుతుంది. మరోప్రక్క వ్యవసాయానికి, పరిశ్రమలకు అధిక నీరు అవసరం. అందువల్ల నీటి కొరత దానంతటదే వస్తుంది. పంటల సాగులో ఆధునిక సాగు పద్ధతులు పాటించకపోవడం వలన కూడా నీటి కొరత పుట్టుకొస్తుంది. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడెయ్యడం వల్ల కూడా నీటి కొరత సంభవిస్తుంది.
అయితే నీటి కొరత నివారణకు పరిష్కార మార్గాలు లేకపోలేదు. మురుగునీరును, వ్యర్ధ జలాలను పెద్ద ఎత్తున పునర్వినియోగంలోకి తేవాలి. సామాజిక అడవుల పెంపకంతో వర్షపాతం స్థాయిని గణనీయంగా పెంచుకోవచ్చు. ప్రతి బొట్టు వర్షపు నీటినీ ఒడిసిపట్టి భూగర్భ జల నిల్వల స్థాయిని పెంచుకోవాలి. దీని కోసం నివాసం, కార్యాలయం అనే తేడా లేకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వరద నీరు సముద్రాల్లోకి పోకుండా ఎక్కడికక్కడ ఆనకట్ల నిర్మాణం జరగాలి. పెద్ద పెద్ద చెరువుల నిర్వహణ సక్రమంగా ఉండాలి.
వీటితో పాటు ఇండియన్ వాటర్ మ్యాన్ ‘రాజేంద్ర సింగ్’ సూచించిన నీటి నిల్వల పరిరక్షణా సూత్రాలు (ఆరు ‘ఆర్’ ల విధానాన్ని) క్షేత్రస్థాయిలో అమలు పరచాలి.ప్రపంచ నీటి వినియోగం గత శతాబ్దం కాలంలో రెండింతలు పెరిగింది. భూమి యొక్క మంచినీటి సరఫరా కేవలం 2.5 శాతం మాత్రమే. వీటిలో ఎక్కువ భాగం హిమానీనదాలలో మంచు రూపంలోనే ఉంది. ఇది ప్రపంచ అవసరాలకు సరిపోవటం లేదు. అందువల్లనే నీరు సమృద్ధిగా ఉన్న దేశాలు, నీరు కొరతగా ఉన్న దేశాలు అన్న విభజన జరిగినట్లు జర్నలిస్ట్ స్టీవెన్ సోలమన్ తన పుస్తకం ‘వాటర్: ది ఎపిక్ స్ట్రగుల్ ఫర్ వెల్త్, పవర్, అండ్ సివిలిజేషన్’లో చెబుతారు.
గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే నీటిపై ఆందోళనలు విపరీతంగా పెరిగాయి. నీటిని పరిరక్షించవలసిన బాధ్యతను అందరూ గుర్తిస్తున్నారు. అందువల్ల అధిక జనాభా అవసరాలకు తగినట్టుగా నీటి వనరులను సంరక్షించేందుకు సంబంధిత ప్రభుత్వ పాలనా యంత్రాంగాలు ప్రజల భాగస్వామ్యంతో కృషి చేయాలి. ఇంకా వారికి వివిధ ప్రజా సమూహాలు, పర్యావరణ సమితులు, జల సంరక్షణా కేంద్రాలు, వనమిత్ర మండళ్ళు తమవంతుగా చేయూతనివ్వాలి. అలాకానిచో ప్రపంచంలో తీవ్ర నీటి సంక్షోభం రాకమానదు. ఇదే భవిష్యత్తులో వచ్చే ఎన్నో నీటి యుద్ధాలకు ప్రధాన హేతువు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
-పిల్లా తిరుపతిరావు, వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయుడు ‘ 7095184846
Comments
Please login to add a commentAdd a comment