Water conflict
-
నీటి యుద్ధాలు రానున్నాయా!
గత చరిత్రను చూస్తే ధనం, భూమి, స్త్రీ, ఆహారం, అధికారం, ఆధిపత్యం అనే అంశాల ప్రాతిపదికనే యుద్ధాలు సంభవించాయి. మానవుని ప్రాథమిక అవసరాలు గాలి, నీరు, ఆహారం. వీటిలో నీరు అమృతం వంటిది. సర్వ ప్రాణికోటి దాహార్తిని తీర్చుతుంది. ఆహారోత్పత్తిలో ప్రధాన వనరు నీరే. మానవ నాగరికత అంతా నదీ ప్రాంతాల్లోనే విలసిల్లింది. మనిషి సామాజిక, ఆర్థిక ప్రగతికి నీరే పునాదిగా నిలుస్తుంది. అందువల్ల నీటి వనరులను అత్యంత జాగరూకతతో కాపాడుకోవాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత మానవ జీవనానికి పెనుసవాలై నిలుస్తున్నది. ఎక్కడైనా తీవ్ర నీటి కొరత ఏర్పడితే, ఒక మనిషి మరొక మనిషిపై యుద్ధం చేసే పరిస్థితులు రావచ్చు. నీటి కొరత అనేది రాను రాను తీవ్రమైతే ఒక ఊరు మరొక ఊరుపై, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంపై, ఒక జాతి మరొక జాతిపై అంతర్యుద్ధాలు చేసే పరిస్థితి వస్తుంది. అలాగే ఇరుగుపొరుగు దేశాల మధ్యా యుద్ధాలు చెలరేగవచ్చు.నీటి కోసం జరిగే యుద్ధాలు రెండు రకాలుగా పుట్టుకొస్తాయి. మొదటిది నీటి కొరత వల్ల వచ్చే యుద్ధాలు. రెండోది అధిక నీటి లభ్యత వల్ల వచ్చే యుద్ధాలు. నీరు లభ్యత వల్ల వచ్చే యుద్ధాలను సులువుగా పరిష్కరించుకోవచ్చు.ఉదాహరణకు నదీ జలాల పంపకాలను ఇరుపక్షాల వారు చర్చల ద్వారా పరిష్కరించుకోగలరు. అదే నీటి కొరత వల్ల వచ్చే యుద్ధాలు దానికి గల మూల కారణాలను అన్వేషించటం, విశ్లేషించటం ద్వారా మాత్రమే పరిష్కరించగలరు. వీధుల్లో కుళాయిల వద్ద బిందెలను తాడించడంతో క్రిందిస్థాయిలో నీటి కొరత యుద్ధాలు మొదలవుతాయి. చిన్న చిన్న నీటి తగాదాలు, పెద్ద పెద్ద జల వివాదాలు, చిలికి చిలికి గాలివానై నీటి యుద్ధాలుగా మారుతాయి. నీటి యుద్ధాలు అని నేరుగా పిలవకపోయినా, నీరు అనేక సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారితీస్తుందనేది యథార్థం. ఇదిలా ఉంటే భవిష్యత్తులో నీటి యుద్ధాలు సంభవించే అవకాశాలు లేవని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.కానీ వీరి మాటలకు విరుద్ధంగా అఫ్ఘానిస్తాన్–ఇరాన్ దేశాల మధ్య హెల్మండ్ నదీ జలాల కోసం రెండు గంటలసేపు యుద్ధం తీవ్రంగా జరగడం చూశాం. ఇంకా చారిత్రకంగా పరిశీలిస్తే టర్కీ–సిరియా–ఇరాక్ దేశాల మధ్య టైగ్రిస్–యూప్రెటిస్ నీటి వివాదం పురాతన కాలం నుండి కొనసాగుతున్నది. నైలునది నీటి కోసం ఈజిప్ట్–సూడాన్–ఇథియోపియా దేశాల మధ్య జల జగడం సాగుతున్నది. మెకాంగ్ నది నీరు కోసం చైనా–లావోస్ మధ్య జల వివాదం ఉంది. భారతదేశంలో కావేరీ జలాల పంపిణీపై తమిళనాడు, కర్ణాటకల మధ్య అంతర్రాష్ట్ర జల వివాదముంది. దీనికి 2018లో పరిష్కారం దొరికినా, ఇంకా సమస్య శాశ్వతంగా కొలిక్కి రాలేదు.గత జల వివాదాలను దృష్టిలో పెట్టుకునే ఒకప్పటి ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) సెక్రటరీ జనరల్ బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ‘మధ్యప్రాచ్యంలో తదుపరి యుద్ధం నీటిపైనే జరుగుతుంది’ అని అన్నారు.మరో పూర్వ యూఎన్ఓ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ‘మంచినీటి కోసం తీవ్రమైన పోటీ ఏర్పడి, భవిష్యత్తులో అది కాస్తా సంఘర్షణగా, యుద్ధాలుగా మారవచ్చు’ అని సెలవిచ్చారు. ఇంకొక మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ‘యుద్ధాలు మరియు సంఘర్షణలకు నీటి కొరత అనేది శక్తిమంతమైన ఇంధనంగా పనిచేస్తుంది’ అని భవిష్యద్దర్శనం చేశారు. వీరి అభిప్రాయాలను బలపరుస్తూ ఇటీవల జరిపిన సర్వేలో ఐక్యరాజ్యసమితి తీవ్ర నీటి ఎద్దడికి గల కారణాలను కనుగొంది. ఇంకా నీటి యుద్ధాలు సంభవించే అవకాశాలను అంచనా కట్టిందిలా! యూఎన్ఓ గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ బట్టి 2030 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది అనగా 72 శాతం మంది ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కోనున్నారు. ‘ఒక వ్యక్తికి రోజుకు 50 లీటర్లు చొప్పున కనీసంగా నీరు ఇవ్వాల్సి వస్తే’... అన్న ప్రధాన అంశంతో పాటు మరో పదహారు సుస్థిరాభివృద్ధి సూచికలను ఐక్యరాజ్యసమితి తన సభ్యదేశాలకు నిర్దేశించింది. ఈ ప్రాధాన్యతా క్రమాలతో యూఎన్ఓ సర్వే జరిపి, పై గణాంకాలను వెల్లడించింది.నీటి కొరతకు గల కారణాలను విశ్లేషించగా, ఈ క్రింది విషయాలు తెలుస్తున్నాయి. ప్రపంచమంతటా కాలుష్యం పెరగడంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. దీనివల్ల అతివృష్టి, అనావృష్టులు ఏర్పడుతున్నాయి. అతివృష్టితో వరదలు సంభవించి, ఆ వరద నీరంతా సముద్రాల పాలవుతున్నది.అనావృష్టితో తీవ్ర నీటి సంక్షోభమేర్పడి కరవుకాటకాలు సంభవిస్తున్నాయి. రుతుపవనాలపై ఎక్కువగా ఆధారపడే దేశాలు ఆసియా ఖండంలోనూ, పసిఫిక్ మహాసముద్ర తీరం వెంబడేనూ ఉన్నాయి. అందువల్ల ఈ దేశాల్లోనే ‘ఎల్ నినో–లా నినో’ ప్రభావం అధికంగా ఉంటుంది. వీటి ప్రభావంతోనే ఆ యా దేశాల్లో నీటి కొరత తీవ్రమవుతున్నది. ఈ నీటి కొరతే ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీనివల్లనే వివిధ దేశాల ఆర్థికాభివృద్ధి రేటు దిగువ స్థాయిలో ఉండి, పేదరికం తాండవిస్తోంది. ఒక పక్క భూమ్మీద జనాభా పెరగడంతో నీటి డిమాండ్ ఎక్కువైంది. దాంతో నీటి కొరత సహజంగానే ఏర్పడుతుంది. మరోప్రక్క వ్యవసాయానికి, పరిశ్రమలకు అధిక నీరు అవసరం. అందువల్ల నీటి కొరత దానంతటదే వస్తుంది. పంటల సాగులో ఆధునిక సాగు పద్ధతులు పాటించకపోవడం వలన కూడా నీటి కొరత పుట్టుకొస్తుంది. భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడెయ్యడం వల్ల కూడా నీటి కొరత సంభవిస్తుంది.అయితే నీటి కొరత నివారణకు పరిష్కార మార్గాలు లేకపోలేదు. మురుగునీరును, వ్యర్ధ జలాలను పెద్ద ఎత్తున పునర్వినియోగంలోకి తేవాలి. సామాజిక అడవుల పెంపకంతో వర్షపాతం స్థాయిని గణనీయంగా పెంచుకోవచ్చు. ప్రతి బొట్టు వర్షపు నీటినీ ఒడిసిపట్టి భూగర్భ జల నిల్వల స్థాయిని పెంచుకోవాలి. దీని కోసం నివాసం, కార్యాలయం అనే తేడా లేకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వరద నీరు సముద్రాల్లోకి పోకుండా ఎక్కడికక్కడ ఆనకట్ల నిర్మాణం జరగాలి. పెద్ద పెద్ద చెరువుల నిర్వహణ సక్రమంగా ఉండాలి.వీటితో పాటు ఇండియన్ వాటర్ మ్యాన్ ‘రాజేంద్ర సింగ్’ సూచించిన నీటి నిల్వల పరిరక్షణా సూత్రాలు (ఆరు ‘ఆర్’ ల విధానాన్ని) క్షేత్రస్థాయిలో అమలు పరచాలి.ప్రపంచ నీటి వినియోగం గత శతాబ్దం కాలంలో రెండింతలు పెరిగింది. భూమి యొక్క మంచినీటి సరఫరా కేవలం 2.5 శాతం మాత్రమే. వీటిలో ఎక్కువ భాగం హిమానీనదాలలో మంచు రూపంలోనే ఉంది. ఇది ప్రపంచ అవసరాలకు సరిపోవటం లేదు. అందువల్లనే నీరు సమృద్ధిగా ఉన్న దేశాలు, నీరు కొరతగా ఉన్న దేశాలు అన్న విభజన జరిగినట్లు జర్నలిస్ట్ స్టీవెన్ సోలమన్ తన పుస్తకం ‘వాటర్: ది ఎపిక్ స్ట్రగుల్ ఫర్ వెల్త్, పవర్, అండ్ సివిలిజేషన్’లో చెబుతారు.గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే నీటిపై ఆందోళనలు విపరీతంగా పెరిగాయి. నీటిని పరిరక్షించవలసిన బాధ్యతను అందరూ గుర్తిస్తున్నారు. అందువల్ల అధిక జనాభా అవసరాలకు తగినట్టుగా నీటి వనరులను సంరక్షించేందుకు సంబంధిత ప్రభుత్వ పాలనా యంత్రాంగాలు ప్రజల భాగస్వామ్యంతో కృషి చేయాలి. ఇంకా వారికి వివిధ ప్రజా సమూహాలు, పర్యావరణ సమితులు, జల సంరక్షణా కేంద్రాలు, వనమిత్ర మండళ్ళు తమవంతుగా చేయూతనివ్వాలి. అలాకానిచో ప్రపంచంలో తీవ్ర నీటి సంక్షోభం రాకమానదు. ఇదే భవిష్యత్తులో వచ్చే ఎన్నో నీటి యుద్ధాలకు ప్రధాన హేతువు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. -పిల్లా తిరుపతిరావు, వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయుడు ‘ 7095184846 -
తేలని.. ‘మహా’ జలవివాదం
భువనేశ్వర్: మహానది జలాల పంపిణీకి సంబంధించి ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతుంది. మహానది జల వివాదాల ట్రిబ్యునల్‌లో ఈకేసు విచారణ కొనసాగుతుంది. తాజాగా జరిగిన విచారణ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేర్వేరుగా నివేదికలను దాఖలు చేయాలని ట్రిబ్యునల్ ఉభయ రాష్ట్రాలకు ఆదేశించింది. రానున్న జనవరిలో క్షేత్రస్థాయి పరిశీలన ముగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 4న ఛత్తీస్గడ్ ప్రభుత్వ ప్రతినిధులు ఒడిశాను సందర్శిస్తారు. అనంతరం అదే నెల 16న ఒడిశా ప్రతినిధులు ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని ట్రిబ్యునల్ తేదీలను ఖరారు చేసింది. ఈ రెండు ప్రభుత్వాల నివేదిక దాఖలైన మేరకు వచ్చే ఫిబ్రవరి 1న తదుపరి విచారణ జరుగుతుందని ట్రిబ్యునల్ తెలిపింది. గతంలో ఉభయ రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో సందర్శించాయి. ఈ ఏడాది అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు ఒడిశా ప్రభుత్వ ప్రతినిధులుఛత్తీస్‌గడ్‌లో పర్యటించారు. నవంబరు 2వ వారంలో అక్కడి అధికారుల బృందం స్థానికంగా సందర్శించింది. ఉభయ బృందాలు క్షేత్రస్థాయి నివేదికను ట్రిబ్యునల్‌కు దాఖలు చేశాయి. ఛత్తీస్గడ్ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు శనివారం నివేదిక దాఖలు చేయగా.. దీనిపై అభ్యంతర పిటిషన్ దాఖలు చేసేందుకు ఒడిశాకు 4 వారాల గడువు మంజూరు చేయడం విశేషం. ఉమ్మడి సర్దుబాటుకు సంకేతాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్న మహానది జలాల పంపిణీ వివాదం క్రమంగా కొలిక్కి వస్తున్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాలు మహానది జలాల పంపిణీ విషయంలో ఉమ్మడి సూత్ర ప్రాతిపదికన రాజీ కుదరకుంటే ట్రిబ్యునల్ చొరవ కల్పించుకుని పరిష్కార మార్గదర్శకం జారీ చేస్తుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న జరగనున్న విచారణలో నదీ జలాల పంపిణీ వివాదానికి స్పష్టమైన పరిష్కారం ఖరారు అవుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా అభ్యర్థన మహానది ఎగువ భాగంలో ఛత్తీస్గడ్ ప్రభుత్వం బ్యారేజీలు ఇతరేతర నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులను వెంటనే నిలిపి వేయాలని ఒడిశా ప్రభుత్వం అభ్యర్థించింది. వర్షాకాలం తరువాతి వ్యవధిలో రాష్ట్రంలో మహానది లోతట్టు ప్రాంతాలకు 1.74 మిలియన్ ఎకరపు అడుగుల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను అభ్యర్థించింది. -
మరోసారి సాగర్ నీటి వివాదం
-
కావేరి మంటలు
-
కావేరి మంటలు
జల వివాదంతో భగ్గుమన్న కర్ణాటక, తమిళనాడు - కర్ణాటకలో రెచ్చిపోయిన నిరసనకారులు..తమిళుల వాహనాలు, ఆస్తులు లక్ష్యంగా దాడులు - దహనాలు, లూటీలు... బెంగళూరులో ఒక్క రోజే 100 వాహనాలు దగ్ధం - బెంగళూరులో పోలీసు కాల్పుల్లో ఒకరి మృతి - తమిళనాడులోనూ పేట్రేగిన హింస.. - కర్ణాటకకు వ్యతిరేకంగా తమిళ సంఘాల నిరసన ప్రదర్శనలు.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు - కర్ణాటకకు 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు..అవసరమైతే తమిళనాడుకూ: కేంద్రం సాక్షి ప్రతినిధి, బెంగళూరు/చెన్నై: కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కర్ణాటకలో అయితే అల్లరిమూకలు రెచ్చిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశం ఇచ్చింది. ఆ వెనువెంటనే అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరు నిప్పుల కొలిమిగా మారింది. నగరంలో 100కు పైగా బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. తమిళనాడులోనూ కర్ణాటకకు చెందిన సంస్థలు, వాహనాలపై దాడులు జరిగాయి. నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు సహా వాహనాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ హింసకు మీరంటే మీరు కారణమంటూ రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, సంస్థల నాయకులు ఎదుటి రాష్ట్రంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. తమ రాష్ట్ర ప్రజలపై దాడులు చేస్తే సహించేది లేదని దుండగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘మీ రాష్ట్రంలో మా రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించండి’ అంటూ పరస్పరం లేఖలు రాసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పూర్తి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న కర్ణాటకకు 10 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపించింది. అవసరమైతే తమిళనాడులోనూ ఈ బలగాలను మోహరిస్తామని చెప్పింది. పరిస్థితి ఇలావుంటే.. కావేరి పర్యవేక్షక కమిటీ నదీ జలాల విడుదల విషయంపై ఎటువంటి నిర్ణయం చేయకుండా సమావేశాన్ని 19వ తేదీకి వాయిదా వేసింది. ఒకవైపు తమిళనాడులో కర్ణాటక వాసులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు.. మరొకవైపు కావేరి నీటి విడుదల ఆదేశాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన వార్త వెలువడిన వెంటనే.. కర్ణాటకలో ఒక్కసారిగా హింస చెలరేగింది. వాహనాల దహనాలు, పలు సంస్థలు, దుకాణాలపై దాడులతో రాష్ట్రం అట్టుడికింది. రాజధాని బెంగళూరులో తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు కలిగివున్న బస్సులు, ట్రక్కులతో సహా దాదాపు 100 వాహనాలను అల్లరిమూకలు దగ్ధం చేశాయి. అందులో తమిళనాడుకు చెందిన కేపీఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు 40 వరకూ ఉన్నాయి. తమిళనాడు మూలాలు గల పలు దుకాణాలు, సంస్థలపై దాడులు, లూటీలతో బెంగళూరు వణికిపోయింది. నగరంలోని రాజగోపాల్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హగ్గేనహళ్లి వద్ద వాహనాలకు నిప్పంటిస్తున్న అల్లరిమూకలపై పోలీసులు కాల్పులు జరపగా.. ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. మండ్య, మైసూరు, చిత్రదుర్గ, ధార్వాడ్ జిల్లాల్లో కూడా పరిస్థితి అదుపుతప్పింది. దీంతో.. బెంగళూరు, మండ్య, మైసూరు నగరాలతో పాటు.. కర్ణాటకలో కావేరి నదిపై గల 4 జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ కింద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు విధించారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రాష్ట్రానికి పంపింది. జయ, సిద్ధరామయ్యల లేఖలు... కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం రాత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జయలలిత, సిద్ధరామయ్యలతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతల వ్యవహారంలో కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తామన్నారు. అనంతరం.. కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొంది. కర్ణాటకలో హింస ఆందోళనకరంగా ఉందని, తమిళ ప్రజలు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని తమిళనాడు సీఎం జయలలిత కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం అంతకు కొన్ని గంటల ముందే అదే తరహా లేఖను జయలలితకు రాశారు. తమిళనాడులో కర్ణాటక ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని జయ తన లేఖలో హామీ ఇచ్చారు. ఇదిలావుంటే.. కావేరి జలాలపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చినట్లయితే రాష్ట్రంలో కొన్ని నిరసనలు జరుగుతాయని భావించామని.. కానీ ఇంత దూరం వెళతాయని తమ ప్రభుత్వం ఊహించలేదని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర పేర్కొన్నారు. బెంగళూరు భగభగ బెంగళూరులోని డిసౌజా నగర్లో కేపీఎన్ ట్రావెల్స్‌కు చెందిన డిపోలో 50 బస్సులు నిలిపి ఉంచగా.. నిరసనకారులు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డిపో వద్దకు చేరుకుని రెండు బస్సులకు నిప్పు పెట్టి పరారయ్యారు. బస్సుల ట్యాంకర్లలో డీజిల్ ఎక్కువగా ఉండటంతో మంటలు అన్ని బస్సులకూ వ్యాపించాయి. అక్కడి మార్గంలో దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా రోడ్లపై నిరసనకారులు టైర్లకు నిప్పు పెట్టడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేకపోయారు. గంటన్నర తర్వాత చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తం బస్సుల్లో 44 పూర్తిగా దగ్ధం కాగా, మిగిలినవి 60 శాతానికి పైగా తగలబడిపోయినట్లు సమాచారం. ఈ ట్రావెల్స్ తమిళనాడు వాస్తవ్యుడైన నటరాజన్‌కు చెందినదని చెప్తున్నారు. దుండగులు బెంగళూరులోని నైస్ రోడ్డుపై తమిళనాడు రవాణా శాఖకు చెందిన బస్సులకు కూడా నిప్పంటించారు. నందినీ లేఅవుట్లో పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారు. బెంగళూరులోని కన్వర్జీస్ సాఫ్ట్వేర్ సంస్థలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లి అక్కడి సిబ్బందిని బయటికి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న మరికొన్ని ఐటీ కంపెనీలు నైట్‌షిఫ్ట్ ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. అడియార్ ఆనంద్భవన్, పూర్విక మొబైల్ దుకాణాలకు చెందిన పలు శాఖలపై దాడులు చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. యాదగిరిలో తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్‌ను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. నగరంలో నిరసనల ఉధృతి నేపథ్యంలో సాయంత్రం 4:30 నుంచి బీఎంటీసీ బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. తమిళనాడుకు వెళ్లే దాదాపు అన్ని బస్సులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నమ్మమెట్రో సేవలు కూడా సాయంత్రం ఆరుగంటల తర్వాత నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో మండ్యలో ఈనెల 17 వరకూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ జియాఉల్లా సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కాల్పుల్లో ఒకరి మృతి బెంగళూరు రాజగోపాల్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హగ్గేనహళ్లి 50 మంది నిరసనకారులు రెచ్చిపోయారు. బందోబస్తులో భాగంగా అక్కడికి వచ్చిన పోలీసుల వాహనంపై దాడి చేసి నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి యత్నించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి, గాలిలో కాల్పులు జరిపారు. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై కాల్పులు జరపగా.. ఐదుగురు గాయపడ్డారు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా సింగేనహళ్లికి చెందిన ఉమేశ్(25) వెన్ను నుంచి ఛాతిలోకి తూటా దూసుకెళ్లడంతో మృతిచెందాడు. మరొకరు కోమాలోకి వెళ్లాడు. నగరంలోని హొసగుడ్డద హళ్లి వద్ద నిరసనకారులు తమిళనాడుకు చెందిన రెండు ప్రైవేటు బస్సులకు నిప్పుపెట్టారు. వారు లారీలకు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అయితే నిరసనకారులు రాళ్లతో దాడికి దిగడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మొత్తంగా 10 మంది పోలీసులు గాయపడ్డారు. గోపాలన్ మాల్ వద్ద హింసను టీవీ చానల్ కోసం చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై నిరసనకారులు దాడి చేశారు. -
పదకొండు అంశాలతో ఎజెండా
- ఖరారు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు - ఏపీ, తెలంగాణ జల వివాదంపై 27న సమావేశం... సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న సమావేశం ఎజెండాను ఖరారు చేసింది. నీటి యాజమాన్యం, కొత్త ప్రాజెక్టులు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పరిధి వంటి వాటితో కలిపి మొత్తంగా 11 అంశాలను ఎజెండాలో చేర్చింది. ఈ మేరకు మంగళవారం సమావేశపు ఎజెండాను బోర్డు సభ్యకార్యదర్శి ఆర్కే గుప్తా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపారు. ఇందులో తొలి అంశంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు, తయారు చేసుకున్న ముసాయిదా అంశాల అమలు, వాటి కొనసాగింపును చేర్చారు. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశారు. పాలమూరు, డిండిపై చర్చ? నీటి వినియోగ లెక్కల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తరుచూ వివాదం రేకెత్తుతున్న దృష్ట్యా ముసాయిదా కొనసాగింపు, లేదా అందులో మార్పులకు బోర్డు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ట్లుగా తెలుస్తోంది. నీటి నిర్వహణ అంశాన్ని రెండో ప్రాధాన్యతగా చేర్చారు. కేవలం నీటి విడుదల సమయంలో మాత్రమే ఇరు రాష్ట్రాలు తమ అవసరాలు, వినియోగాన్ని పేర్కొంటున్నాయి తప్పితే ముందస్తుగా వెల్లడించడం లేదు. వివాదం తలెత్తినప్పుడు ఏ రాష్ట్ర లెక్కలు సరైనవన్నది తేల్చడం బోర్డుకు పెద్ద తలనొప్పిగా మారింది. వీటితో పాటే ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణను ఎవరు చూడాలన్న దానిపై లోతుగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని బోర్డు భావిస్తోంది. దీంతో పాటే కృష్ణా పరీవాహకంలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల అంశాన్ని బోర్డు ఎజెండాలో చేర్చింది. తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల విషయంలో ఏపీ అనేక అభ్యంతరాలను లేవనెత్తుతోంది. ఈ అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు బోర్డు నిర్వహణ ఖర్చు, డ్యామ్‌ల భద్రత తదితర అంశాలను ఎజెండాలో చేర్చింది.