కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కర్ణాటకలో అయితే అల్లరిమూకలు రెచ్చిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశం ఇచ్చింది. ఆ వెనువెంటనే అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరు నిప్పుల కొలిమిగా మారింది. నగరంలో 100కు పైగా బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.