భవిష్యత్తులో జల యుద్ధాలు జరగొచ్చు
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
కళ్యాణదుర్గం : రాబోయే రోజుల్లో జల యుద్ధాలు రావొచ్చని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. శెట్టూరు మండల పరిధిలోని ములకలేడులో ఆదివారం రుణవిముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆస్తులు, డబ్బుల కోసం యుద్ధాలు రావని, నీటి కోసమే యుద్ధాలు జరగొచ్చన్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఆనకట్ట కడితే మూడవ ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నారు. ప్రాజెక్టుల పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే స్వార్థంతో చంద్రబాబు ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల నాటికి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కళ్యాణదుర్గం చెరువులకు నీటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రైతు రుణమాఫీ చేశారన్నారు.
ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ రైతుల మేలు కోసమే సీఎం చంద్రబాబు రుణమాఫీ చేశారన్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. అదేవిధంగా పెరుగుపాళ్యం గ్రామంలో రూ.7.50 లక్షలతో నిర్మించిన గోపాలమిత్ర భవనాన్ని కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమాల్లో యార్డు చెర్మైన్ బాదన్న, జెడ్పీటీసీ కవిత, ఎంపీపీ మానస, తెలుగు యువత నాయకుడు మారుతి చౌదరి, పార్టీ మాజీ కన్వీనర్లు గురుప్రసాద్, రామరాజు, మాజీ జెడ్పీటీసీ శివశంకర, మాజీ ఎంపీపీ మల్లికార్జున, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ జేసీ
కళ్యాణదుర్గం పట్టణంలో రూ.6.50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మైన్ గౌస్ మొహిద్దీన్ ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చెర్మైన్ వైపీ రమేష్, కౌన్సిలర్ విశ్వనాథ్, జయం పురుషోత్తం, అనంతపురం గ్రంథాలయాధికారి సుబ్బరత్నమ్మ, వివిధ గ్రంథాలయాధికారులు శ్రీనివాసులు, కిరణ్, తిరుపతమ్మ, కంబన్న, రేవతిభాయి, ఆదిలక్ష్మి, సిబ్బంది వెంకటేశులు, పుల్లన్న, రజిని పాల్గొన్నారు.