మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా): ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని ఓ చిన్నారి బలైపోయింది. డ్రైవర్ ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని నడుపుతుండగా ట్యాంకర్ చిన్నారి పైకి దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ సంఘటన మండల పరిధి రావిర్యాలలోని వండర్‌లా అమ్యూజింగ్ పార్క్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బలభద్రపల్లి గ్రామానికి నర్సమ్మ, వెంకటప్ప దంపతులకు కూతురు జయశ్రీ(1) ఉంది. వీరు రావిర్యాలలోని వండర్‌లా అమ్యూజింగ్ పార్క్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ అక్కడే షెడ్లలో ఉంటున్నారు. శనివారం సాయంత్రం దంపతులు పనులు ముగించుకొని షెడ్డుకు వచ్చారు. చిన్నారి జయశ్రీ షెడ్ పక్కన ఆడుకుంటోంది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సైదులు నీటిని నింపుకొని పార్క్‌లోకి వచ్చాడు.
అతడు నిర్లక్ష్యంగా నడపడంతో చిన్నారి జయశ్రీ పైకి దూసుకెళ్లింది. తల పైనుంచి లారీ టైర్ వెళ్లడంతో నుజ్జునుజ్జయి చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సైదులు వాహనాన్ని వదిలేసి పరారయ్యేందుకు యత్నించగా కార్మికులు, స్థానికులు పరుగెత్తి పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఆదిబట్ల ఠాణా ఎస్‌ఐ మదన్‌లాల్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి మృతికి కారణమైన డ్రైవర్ సైదులును అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పార్క్ యాజమాన్యం కార్మికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మికులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని కంపెనీ మేనేజర్ మధుసూదన్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయిందని స్థానికులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు నర్సమ్మ, వెంటకప్ప దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈమేరకు ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మదన్‌లాల్ తెలిపారు.
వాటర్ ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి
Published Sat, Jul 25 2015 9:35 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement