సాక్షి, ముంబై: కొత్త ఆటో పర్మిట్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను రూపొందించింది. ఇక మీదట ఆటో పర్మిట్లను పొందాలనుకున్నవారు తమ వాహనాలకు తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ (జీపీఆర్‌ఎస్) పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం రూఫ్ టాప్ ఇండికేటర్లు, ఐడెంటిటీ కార్డులు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగ్‌లను కూడా అమర్చుకోవడం తప్పనిసరి.
అయితే ఆర్‌ఎఫ్‌ఐడీ పరికరాన్ని అమర్చితే టోల్‌నాకాల వద్ద వాహనం సమాచారాన్ని సులువుగా నమోదు చేయవచ్చు. టోల్‌ను కూడా ఆన్‌లైన్ పద్ధతిలో వసూలు చేయవచ్చు. ఆటో పర్మిట్లను జారీకి రూపొందించిన నిబంధనల్లో చాలా వరకు పాతవే ఉన్నాయి. జీపీఎస్, జీపీఆర్‌ఎస్, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్, రూఫ్ టాప్ ఇండికేటర్లు, డిస్‌ప్లే కార్డులు (ఈ కార్డుల్లో డ్రైవర్లకు చెందిన పూర్తి సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది) తదితర పరికరాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ప్రస్తుతం నియమాల ప్రకారం ప్రతి డ్రైవర్‌కు లెసైన్సులు, ఆటోరిక్షా బ్యాడ్జీలు, మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్లుగా రుజువు చేసే పత్రాలు కలిగి ఉంటే సరిపోతుంది. ఇక నుంచి మరిన్ని కొత్త నియమాలను కూడా డ్రైవర్లు పాటించాల్సి ఉంటుంది. కొత్త పర్మిట్ల కేటాయింపునకు లాటరీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీనియర్ రవాణా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొత్త నియమాల గురించి ఇంతకు ముందే సమాచారాన్ని డ్రైవర్లకు అందజేశామన్నారు. ఇక ముంబైవ్యాప్తంగా 18 వేల కొత్త పర్మిట్లను జారీ చేస్తారు. ఇందులో 9,350 పర్మిట్లను అంధేరీ ఆర్టీఓ, 8,750 పర్మిట్లను వడాలా ఆర్టీఓ జారీ చేస్తుంది. నిద్రాణస్థితిలో (డోర్మంట్) ఉన్న వాటిలో 50 శాతం పర్మిట్లను కూడా పునరుద్ధరిస్తారు.
అయితే పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి చెల్లుబాటు గల ఆటో లెసైన్సును కలిగి ఉండాలి. ప్రజారవాణా బ్యాడ్‌జ కూడా తప్పనిసరి. స్థానిక భాష, స్థానిక పర్యాటక ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్టు నిరూపించే ధ్రువపత్రం సమర్పించాలి. గత ఏడాదిలో తనపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదంటూ పోలీసులు మంజూరు చేసిన ధ్రువపత్రాన్ని కూడా ఇవ్వాలి.
ఆటో పర్మిట్ల మంజూరుకు కొత్త నియమాలు
Published Tue, Oct 8 2013 11:35 PM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement