auto permit
-
ఆటో పర్మిట్ల బ్లాక్.. డ్రైవర్లకు షాక్!
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటో పర్మిట్ల దందాకు మళ్లీ తెరలేచింది. నగరంలో కొత్త ఆటో పర్మిట్లు విడుదలైన ప్రతిసారీ నిరుపేద డ్రైవర్ల సొమ్మును ఫైనాన్షియర్లు, డీలర్లు కొల్లగొడుతున్నారు. ఆటోమొబైల్ తయారీదారులు నిర్ణయించిన ధర ప్రకారం ఒక ఆటోరిక్షా రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు డ్రైవర్‌కు లభించాలి. కానీ, కొందరు ఫైనాన్షియర్లు, డీలర్లు కుమ్మక్కై బినామీ ఆటోడ్రైవర్ల పేరుతో పర్మిట్లను బ్లాక్ చేస్తున్నారు. తరువాత ఒక్కో ఆటోను రూ.2.5 లక్షలకు విక్రయిస్తున్నారు. ఎలాగైనా సొంతంగా ఆటోరిక్షాను సంపాదించుకోవాలనుకునే డ్రైవర్లు ఫైనాన్షియర్ల చక్రవడ్డీకీ, ధనదాహానికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో 686 కొత్త ఆటోలకు అనుమతినిచ్చింది. తాజాగా మరో జీవో విడుదల: నగరంలో వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా 2002లో కొత్త ఆటోలపై అధికారులు నిషేధం విధించారు. ఈ నిషేధమే ఆటోడీలర్లు, ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తోంది. నగరంలోని సుమారు 1.4 లక్షల ఆటోల్లో 80 శాతం ఇప్పటికీ ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. చక్రవడ్డీకి అప్పులిచ్చి ఆటోడ్రైవర్లకు ఆటోలను కట్టబెట్టడం, వాళ్లు డబ్బులు చెల్లించుకోలేని స్థితిలో తిరిగి వాటిని స్వాధీనం చేసుకొని మరో డ్రైవర్‌కు విక్రయించడం, అక్కడా అప్పు చెల్లించకుంటే జప్తు చేయడం సర్వసాధారణంగా మారింది. గతంలో ఇవ్వగా మిగిలిపోయిన 686 పర్మిట్లకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం అనుమతినిస్తూ జీవో విడుదల చేసింది. ఈ పర్మిట్లపై ఇప్పటికే బినామీ పేర్లతో ప్రొసీడింగ్స్ సంపాదించిన ఫైనాన్షియర్లు తాజాగా దందాకు తెరలేపారు. ఆర్టీఏలోనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలి... ఆటోడ్రైవర్లపై దోపిడీని అరికట్టి బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలోనే నిజమైన ఆటోడ్రైవర్లను గుర్తించి ప్రొసీడింగ్స్ (అనుమతి పత్రాలు) ఇవ్వాలని ఆటోసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దందాకు ఆస్కారమిచ్చేవిధంగా ఇప్పటివరకు షోరూమ్‌లలో ప్రొసీడింగ్స్ ఇచ్చేవారని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వి.మారయ్య, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం నాయకులు ఎ.సత్తిరెడ్డి, అమానుల్లాఖాన్ పేర్కొన్నారు. ప్రొసీడింగ్ల జారీలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రవాణా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. -
పర్మిట్ల పేరిట ఫలహారం!
సాక్షి, హైదరాబాద్: ఆటో పర్మిట్ల బ్లాక్ దందాకు రంగం సిద్ధమైంది. నిరుపేద డ్రైవర్లే లక్ష్యంగా నిలువుదోపిడీ సాగించే ఫైనాన్షియర్లు, డీలర్లు మరోసారి భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. 5,200 ఆటో పర్మిట్ల పునరుద్ధరణ పేరిట సుమారు రూ.100 కోట్ల అక్రమార్జనకు రంగం సిద్ధం చేశారు. గతంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదై, గ్రేటర్లో తిరిగేందుకు అనుమతి ఉన్న పాత ఆటో రిక్షాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ఆటో అమ్మకాలకు అనుమతిని కోరుతూ కొందరు ఇటీవల రవాణా మంత్రిని, ఉన్నతాధికారులను కలిశారు. పాత పర్మిట్ల పునరుద్ధరణ పేరిట జరిగే ఈ భారీ అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం సైతం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటో పర్మిట్లపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పాత పర్మిట్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆటోడ్రైవర్లు తమ వద్ద ఉన్న ఆటోలను తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్త ఆటోను కొనుగోలు చేయాలి. కొత్త ఆటో కొనుగోలు చేయాలంటే డ్రైవర్ కనీసం రూ.2.5 లక్షలు వెచ్చించాలి. ఇలా పర్మిట్ల పునరుద్ధరణకు అవకాశం కల్పించే 5,200 ఆటోలపైన రూ.వంద కోట్లకు పైగా భారీ మొత్తంలో ఆటోడ్రైవర్లు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఎందుకీ పునరుద్ధరణ... అప్పటి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు తాము గ్రేటర్లో తిరిగేందుకు అనుమతినివ్వాలని కోరుతూ 2010లో రవాణా శాఖను ఆశ్రయించారు. 5,200 ఆటోలకు అవకాశం కల్పిస్తూ రవాణా అధికారులు వాటి పర్మిట్లపైన ప్రత్యేకంగా స్టాంప్ వేశారు. ఈ పర్మిట్లను ఏడాదికొకసారి పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. కొంతకాలం ఈ ప్రక్రియ సాగినా ఆ తరువాత డ్రైవర్లు దీన్ని వదిలేశారు. కాగా ఆటో పర్మిట్లపై నిషేధం ఉన్న హైదరాబాద్‌లో మాత్రమే పాతవాటిని స్క్రాప్‌గా చేసి, కొత్తవాటిని తీసుకునేందుకు అవకాశముంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ అవకాశం లేదు. తాజాగా ఈ రెండు జిల్లాల్లో కూడా స్క్రాప్‌నకు అనుమతినివ్వాలని వ్యాపార వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. తద్వారా 5,200 ఆటోల స్థానంలో కొత్తవాటిని విక్రయించేందుకు అవకాశం లభిస్తుంది. ఇందుకోసం కొన్ని ఆటో సంఘాలు కూడా మద్దతివ్వడం గమనార్హం. క్యాబ్‌లకు అనుమతిస్తే మంచిది... ఇలా ఉండగా, పాత ఆటోల స్థానంలో కొంతమంది అక్రమ వ్యాపారానికి ఊతమిచ్చే కొత్త ఆటో పర్మిట్లకు అవకాశం కల్పించడానికి బదులు క్యాబ్‌లకు అనుమతినివ్వడం మంచిదని కొన్ని ఆటో సంఘాలు కోరుతున్నాయి. తద్వారా ప్రయాణికుల నుంచి మెరుగైన ఆదరణ లభించడమే కాకుండా డ్రైవర్లకు కూడా ఉపాధి ఉంటుందని కోరుతున్నాయి. ఇలా చక్రం తిప్పారు... వాహన కాలుష్యం తీవ్రత.. భూరేలాల్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 2002లో ఆటో అమ్మకాలపైన ఆంక్షలు విధించింది. కానీ పెరుగుతున్న నగర జనాభా అవసరాల మేరకు ఆటో అమ్మకాలపైన ఉన్న నిషేధాన్ని పలు దఫాలు ఎత్తేశారు. అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో 30 వేలకు పైగా కొత్త ఆటోలకు పలుమార్లు అనుమతినిచ్చారు. కేవలం రూ.1.2 లక్షలకు లభించే ఆటో రిక్షా ఖరీదును ఆటోడీలర్లు, ఫైనాన్షియర్లు అమాంతంగా రూ.1.8 లక్షలకు పెంచి దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా కొత్త పర్మిట్లను విడుదల చేసేందుకు అవకాశం లేకపోవడంతో పాత వాటి స్థానంలోనే కొత్త వాటిని విక్రయించేందుకు మరోసారి రంగం సిద్ధం చేశారు. -
ఆటో పర్మిట్ల మంజూరుకు కొత్త నియమాలు
సాక్షి, ముంబై: కొత్త ఆటో పర్మిట్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను రూపొందించింది. ఇక మీదట ఆటో పర్మిట్లను పొందాలనుకున్నవారు తమ వాహనాలకు తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ (జీపీఆర్ఎస్) పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం రూఫ్ టాప్ ఇండికేటర్లు, ఐడెంటిటీ కార్డులు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌లను కూడా అమర్చుకోవడం తప్పనిసరి. అయితే ఆర్ఎఫ్ఐడీ పరికరాన్ని అమర్చితే టోల్‌నాకాల వద్ద వాహనం సమాచారాన్ని సులువుగా నమోదు చేయవచ్చు. టోల్‌ను కూడా ఆన్లైన్ పద్ధతిలో వసూలు చేయవచ్చు. ఆటో పర్మిట్లను జారీకి రూపొందించిన నిబంధనల్లో చాలా వరకు పాతవే ఉన్నాయి. జీపీఎస్, జీపీఆర్ఎస్, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్, రూఫ్ టాప్ ఇండికేటర్లు, డిస్ప్లే కార్డులు (ఈ కార్డుల్లో డ్రైవర్లకు చెందిన పూర్తి సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది) తదితర పరికరాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నియమాల ప్రకారం ప్రతి డ్రైవర్‌కు లెసైన్సులు, ఆటోరిక్షా బ్యాడ్జీలు, మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్లుగా రుజువు చేసే పత్రాలు కలిగి ఉంటే సరిపోతుంది. ఇక నుంచి మరిన్ని కొత్త నియమాలను కూడా డ్రైవర్లు పాటించాల్సి ఉంటుంది. కొత్త పర్మిట్ల కేటాయింపునకు లాటరీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీనియర్ రవాణా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొత్త నియమాల గురించి ఇంతకు ముందే సమాచారాన్ని డ్రైవర్లకు అందజేశామన్నారు. ఇక ముంబైవ్యాప్తంగా 18 వేల కొత్త పర్మిట్లను జారీ చేస్తారు. ఇందులో 9,350 పర్మిట్లను అంధేరీ ఆర్టీఓ, 8,750 పర్మిట్లను వడాలా ఆర్టీఓ జారీ చేస్తుంది. నిద్రాణస్థితిలో (డోర్మంట్) ఉన్న వాటిలో 50 శాతం పర్మిట్లను కూడా పునరుద్ధరిస్తారు. అయితే పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి చెల్లుబాటు గల ఆటో లెసైన్సును కలిగి ఉండాలి. ప్రజారవాణా బ్యాడ్‌జ కూడా తప్పనిసరి. స్థానిక భాష, స్థానిక పర్యాటక ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్టు నిరూపించే ధ్రువపత్రం సమర్పించాలి. గత ఏడాదిలో తనపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదంటూ పోలీసులు మంజూరు చేసిన ధ్రువపత్రాన్ని కూడా ఇవ్వాలి.