సాక్షి, హైదరాబాద్: ఆటో పర్మిట్ల బ్లాక్ దందాకు రంగం సిద్ధమైంది. నిరుపేద డ్రైవర్లే లక్ష్యంగా నిలువుదోపిడీ సాగించే ఫైనాన్షియర్లు, డీలర్లు మరోసారి భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. 5,200 ఆటో పర్మిట్ల పునరుద్ధరణ పేరిట సుమారు రూ.100 కోట్ల అక్రమార్జనకు రంగం సిద్ధం చేశారు. గతంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదై, గ్రేటర్‌లో తిరిగేందుకు అనుమతి ఉన్న పాత ఆటో రిక్షాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ఆటో అమ్మకాలకు అనుమతిని కోరుతూ కొందరు ఇటీవల రవాణా మంత్రిని, ఉన్నతాధికారులను కలిశారు.
పాత పర్మిట్ల పునరుద్ధరణ పేరిట జరిగే ఈ భారీ అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం సైతం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటో పర్మిట్లపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పాత పర్మిట్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆటోడ్రైవర్లు తమ వద్ద ఉన్న ఆటోలను తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్త ఆటోను కొనుగోలు చేయాలి.
కొత్త ఆటో కొనుగోలు చేయాలంటే డ్రైవర్ కనీసం రూ.2.5 లక్షలు వెచ్చించాలి. ఇలా పర్మిట్ల పునరుద్ధరణకు అవకాశం కల్పించే 5,200 ఆటోలపైన రూ.వంద కోట్లకు పైగా భారీ మొత్తంలో ఆటోడ్రైవర్లు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
ఎందుకీ పునరుద్ధరణ...
అప్పటి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు తాము గ్రేటర్‌లో తిరిగేందుకు అనుమతినివ్వాలని కోరుతూ 2010లో రవాణా శాఖను ఆశ్రయించారు. 5,200 ఆటోలకు అవకాశం కల్పిస్తూ రవాణా అధికారులు వాటి పర్మిట్లపైన ప్రత్యేకంగా స్టాంప్ వేశారు. ఈ పర్మిట్లను ఏడాదికొకసారి పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. కొంతకాలం ఈ ప్రక్రియ సాగినా ఆ తరువాత డ్రైవర్లు దీన్ని వదిలేశారు.
కాగా ఆటో పర్మిట్లపై నిషేధం ఉన్న హైదరాబాద్‌లో మాత్రమే పాతవాటిని స్క్రాప్‌గా చేసి, కొత్తవాటిని తీసుకునేందుకు అవకాశముంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ అవకాశం లేదు. తాజాగా ఈ రెండు జిల్లాల్లో కూడా స్క్రాప్‌నకు అనుమతినివ్వాలని వ్యాపార వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. తద్వారా 5,200 ఆటోల స్థానంలో కొత్తవాటిని విక్రయించేందుకు అవకాశం లభిస్తుంది. ఇందుకోసం కొన్ని ఆటో సంఘాలు కూడా మద్దతివ్వడం గమనార్హం.
క్యాబ్‌లకు అనుమతిస్తే మంచిది...
ఇలా ఉండగా, పాత ఆటోల స్థానంలో కొంతమంది అక్రమ వ్యాపారానికి ఊతమిచ్చే కొత్త ఆటో పర్మిట్లకు అవకాశం కల్పించడానికి బదులు క్యాబ్‌లకు అనుమతినివ్వడం మంచిదని కొన్ని ఆటో సంఘాలు కోరుతున్నాయి. తద్వారా ప్రయాణికుల నుంచి మెరుగైన ఆదరణ లభించడమే కాకుండా డ్రైవర్లకు కూడా ఉపాధి ఉంటుందని కోరుతున్నాయి.
ఇలా చక్రం తిప్పారు...
వాహన కాలుష్యం తీవ్రత.. భూరేలాల్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 2002లో ఆటో అమ్మకాలపైన ఆంక్షలు విధించింది. కానీ పెరుగుతున్న నగర జనాభా అవసరాల మేరకు ఆటో అమ్మకాలపైన ఉన్న నిషేధాన్ని పలు దఫాలు ఎత్తేశారు. అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో 30 వేలకు పైగా కొత్త ఆటోలకు పలుమార్లు అనుమతినిచ్చారు. కేవలం రూ.1.2 లక్షలకు లభించే ఆటో రిక్షా ఖరీదును ఆటోడీలర్లు, ఫైనాన్షియర్లు అమాంతంగా రూ.1.8 లక్షలకు పెంచి దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా కొత్త పర్మిట్లను విడుదల చేసేందుకు అవకాశం లేకపోవడంతో పాత వాటి స్థానంలోనే కొత్త వాటిని విక్రయించేందుకు మరోసారి రంగం సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment