
తన కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫ్లాట్లు; భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు రెండు ఇండిపెండెంట్ ఇళ్లు; పెంపుడు శునకం మెడలో ఇండోనేసియా నుంచి రూ.3 లక్షలకు! కొన్న గంట; పబ్‌కు వెళితే కనీసం రూ.లక్ష, స్పాకు వెళితే కనీసం రూ.2 లక్షల బిల్లు– ఇవన్నీ ఎవరో బిజినెస్‌మ్యాన్‌కో, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికో చెందిన విలాసాలు అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే! విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్‌గా ఉండి దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ప్రముఖుల ఇళ్లల్లో చోరీలు చేసిన యమ రిచ్ దొంగ కర్రి సతీష్ అలియాస్ స్పైడర్ సతీష్ వ్యవహారం.
ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశాల్లో వందకు పైగా కేసులు ఉన్నాయి. ఇతణ్ణి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఒడిశా రాజధాని భువనేశ్వర్ అధికారులు కటకటాల్లోకి పంపారు.
విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. వాహనాల చోరీలతో పాటు ఓ ఇంట్లో దొంగతనం చేసి తొలిసారిగా 2005లో వైజాగ్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. దోపిడీ కేసులో విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేశారు. ఇన్ని కేసులున్నా, సత్తిబాబు విశాఖ నుంచి పాస్‌పోర్ట్ పొంది, 2010లో సింగపూర్ వెళ్లిపోయాడు. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉండి వెల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు.
తర్వాత తిరిగి వచ్చేసి, 2012 వరకు మొత్తం 16 చోరీలు చేశాడు. సత్తిబాబు కేవలం సంపన్నులు, ప్రముఖుల ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు. పగలు రెక్కీ చేసి అర్ధరాత్రి వేళ అపార్ట్‌మెంట్స్ గోడలు ఎగబాకి ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఇతడిని స్పైడర్ సతీష్ అని పిలుస్తుంటారు.
పోలీసు నిఘా పెరగడంతో సతీష్ వైజాగ్ వదిలి, 2013లో హైదరాబాద్‌కు వచ్చి చందానగర్‌లో స్థిరపడ్డాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని వీఐపీల ఇళ్లల్లో చోరీలు చేయడంతో ఇతడిపై 12 కేసులు నమోదయ్యాయి. ఈ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతో కేపీహెచ్‌బీ కాలనీలో ఇల్లు, ఓ కారు, ప్రొక్లైనర్ కొని సెటిలైపోయాడు. తర్వాత 2014లో ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు చిక్కాడు.
దీంతో వారికి భారీగా లంచాలు ఇచ్చి, అరెస్టును తప్పించుకున్నాడు. దీనికోసం ఇంటితో పాటు అన్నీ అమ్మేసుకున్నాడు. కొంత లంచం సొమ్మును పోలీసుల బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేశాడు. ఉన్నదంతా పోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టిన సతీష్ 2014లో సూర్యాపేట పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడి వద్ద దొరికిన ఓ బ్యాంకు రసీదు విషయం ఆరా తీస్తే, పోలీసులతో చేసుకున్న సెటిల్‌మెంట్ వెలుగులోకి వచ్చింది.
సతీష్ 2018లో హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖుల ఇళ్లల్లో చోరీలకు పాల్పడి, బెంగళూరుకు ఉడాయించాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 9న బెంగళూరులోని కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్క్ చేసి ఉన్న కారు పట్టుకుపోయాడు.
ఆ కారు నంబర్ తొలగించి, బోగస్ నంబర్ ప్లేట్ తగిలించాడు. అదే నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఇంట్లో సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు.
చోరీ సమయంలో సత్తిబాబు సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా గ్లౌజ్ ధరిస్తుంటాడు. బెంగళూరు పోలీసుల విచారణలోనే తన టార్గెట్‌లో జూబ్లీహిల్స్‌లోని సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇల్లు ఉందని వెల్లడించాడు. అరెస్టు అయినప్పుడల్లా కొత్త పేరు చెప్పే సతీష్‌కు సత్తిబాబు, సతీష్‌రెడ్డి, స్టీఫెన్ తదితర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడి భార్య మాత్రం ముద్దుగా బుజ్జి అని పిలుస్తుంది.
సత్తిబాబుపై హైదరాబాద్ పోలీసులు 2016లో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్ నరేంద్ర నాయక్, కడపకు చెందిన పి.శ్రీనివాస్‌లతో ముఠా కట్టాడు. ఆ ఇద్దరూ చిల్లర దొంగలు కావడంతో ‘థింక్ బిగ్’ అంటూ వారికి నూరిపోశాడు. 2018 మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ త్రయం వరుసపెట్టి చోరీలు చేసింది.
శ్రీకాకుళం, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, బంజారాహిల్స్‌ల్లో పంజా విసిరి 2018 నవంబర్ 27న హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. దీనికి ముందే శ్రీకాకుళం, బెంగళూరు కేసుల్లో అక్కడి అధికారులకు దొరికినా, బయటి ప్రాంతాల్లో చేసిన నేరాల వివరాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ ఏడాది జనవరి 26న ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిరంజన్ పట్నాయక్ ఇంటి నుంచి రూ.50 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు.
ఈ కేసులో ఫిబ్రవరి 13న భువనేశ్వర్ పోలీసులకు చిక్కాడు. విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లోను, హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డాక్టర్ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి నివాసాల్లోను, ఫిలింనగర్ సినార్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్‌ఎస్ శర్మ ఇంట్లోనూ చోరీలు చేసిన చరిత్ర ఇతడిది.
-శ్రీరంగం కామేష్
(చదవండి: ఉద్యోగం, వివాహం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే సివిల్స్ సత్తా చాటింది..!)
Comments
Please login to add a commentAdd a comment