నాగులుప్పలపాడు, న్యూస్‌లైన్ : క్రిస్మస్‌ను పురస్కరించుకుని ఇంట్లోని దుస్తులను శుభ్రం చేసేందుకు వెళ్లిన తల్లీకూతుళ్లను క్వారీ బలి తీసుకుంది. ఈ సంఘటన మండలంలోని ఉప్పుగుండూరులో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని దిన్నె మీద నివసించే కొలకలూరి వరప్రపాదరావు స్థానికంగా బజాజ్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భార్య ప్రభావతి(35) ఉప్పుగుండూరులోనే అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. క్రిస్మస్ సమీపిస్తుండటంతో ఇంట్లోని దుప్పట్లు శుభ్రం చేసేందుకు చిన్న కుమార్తె సోఫియా(13)ను వెంట తీసుకొని దగ్గరలోని క్వారీకి వెళ్లింది. ఉదయం 9 గంటలకు క్వారీకి వెళ్లిన తల్లీకూతుళ్లు ఎంతకీ తిరిగి ఇంటికి రాలేదు.
అంతేకాకుండా క్వారీ ఒడ్డున దుప్పట్లు తీసుకెళ్లిన గిన్నె, చెప్పులు ఉండటం గమనించిన స్థానికులు వెంటనే వరప్రసాదరావుకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన వచ్చి క్వారీ ఒడ్డున ఉన్న దుప్పట్లు తమవేనని నిర్ధారించాడు. అనుమానం వచ్చి స్థానికులతో కలిసి గాలాలతో క్వారీలో గాలింపు చర్యలు చేపట్టగా తొలుత ప్రభావతి మృతదేహం కనిపించింది. ఆ తర్వాత కొద్ది దూరంలో సోఫియా మృతదేహాన్ని గుర్తించారు. దుస్తులు ఉతుకుతూ తొలుత కుమార్తె ప్రమాదవశాత్తు క్వారీలో పడి ఉంటుందని, రక్షించేందుకు వెళ్లి తల్లి కూడా నీటిలో మునిగి ఉంటుందని, ఎవరూ గమనించక పోవడంతో ఇద్దరూ మృతి చెంది ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సోఫియా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మృతురాలి పెద్ద కుమార్తె ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా కుమారుడు చీరాల కళాశాలలో పాల్‌టెక్నిక్ చదువుతున్నాడు. మృతదేహాలపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ వి.భూషణం పరిశీలించారు. ప్రమాదం వివరాలను స్థానికులనడిగి తెలుసుకున్నారు. సీఐతో పాటు పీఎస్సై టి.త్యాగరాజు, ఎస్సై చంద్రశేఖర్ ఉన్నారు.
తల్లీకూతుళ్లను బలి తీసుకున్న క్వారీ
Published Sun, Dec 22 2013 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement