quarry
-
టీడీపీ నేత క్వారీలో జేసీబీ డ్రైవర్ మృతి!
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేత నడుపుతున్న క్వారీలో ఆదివారం జేసీబీ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బైక్‌పైనే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో అది ప్రమాదమా! లేక హత్యా! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మాదిగబండలోని అక్రమ క్వారీ కథ ఇది..స్థానికుల కథనం ప్రకారం.. మాదిగబండ సమీపంలోని సర్వే నంబర్లు 1367,1345, 1376లో 4.43 హెక్టార్లలో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ కోసం శరత్‌కుమార్ గనులశాఖ అనుమతులతో క్వారీ నడుపుతున్నారు. ఈక్రమంలో నిబంధనలు పాటించడంలేదని అధికారులు క్వారీకి అనుమతులు రద్దుచేస్తూ ఈ నెల 1న నోటీసులిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ క్వారీని టీడీపీ నేత జనార్థన్‌నాయుడు స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. దీని కరెంటు బిల్లులు రూ.20.09 లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ అధికారులు.. బకాయిలు చెల్లించకపోయినా స్పందించలేదు. అనర్హత వేటుపడిన ఈ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేయకుండా వదిలేశారు. ఇన్ని ఉల్లంఘనల మధ్య యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్వారీలో ఇప్పుడు జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదమా? చంపేశారా?ఈ క్వారీలో ఎర్రగొండేపల్లికి చెందిన చిన్నస్వామి (38) జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జేసీబీ ముందు భాగంలో తొట్టి వద్ద చిన్నస్వామి గ్రీజు వేస్తుండగా సెల్వ అనే వ్యక్తి జేసీబీ క్యాబిన్లో కూర్చొన్నాడు. సెల్వి సెల్‌ఫోన్ చూస్తూ గేర్ వేయడంతో జేసీబీ తొట్టె కిందికెళ్లిపోయి, గ్రీజు వేస్తున్న చిన్నస్వామిపై పడిందని, దాని కింద నలిగి అతను మృతి చెందినట్టు చెబుతున్నారు. పోలీసులను పిలవకుండానే మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తెచ్చారు. క్వారీలో ఉన్న జేసీబీని మాయం చేశారు. దీంతో ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చిన్నస్వామిని జేసీబీతో కొట్టి చంపేశారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్వారీ యజమాని ఆదేశాలతో ఆ ప్రాంతానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు మృతుడి కుటుంబానికి ఎంతోకొంత పరిహారం చెల్లించి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మృతుల బంధువులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఏం జరి గిందనేది తెలుస్తుందని పలమనేరు టౌన్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు. -
విషాదం.. క్వారీ గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి
సాక్షి, సూర్యాపేట: క్వారీ గుంతలోపడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి హాజరై క్వారీ చూసేందుకు వెళ్లి.. ప్రమాదవాశాత్తు అక్కడి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి వారు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి లు ఇద్దరూ ఆ గుంతలో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మైనింగ్ డాన్ కావ్య కృష్ణారెడ్డికి ముకుతాడు
పాతికేళ్ల క్రితం అతనో కామర్స్ అధ్యాపకుడు. తాను ఉండే ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. జలదంకి ఎంపీపీగా ఎన్నికై మైనింగ్ డాన్‌గా ఎదిగాడు. రియల్ ఎస్టేట్ నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయనే గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి. ఇన్నాళ్లు తెరచాటుగా సాగిస్తున్న అతని అవినీతి బాగోతం ఇటీవల సమాచారహక్కు చట్టంతో బయటపడింది. ‘స్పందన’ ఫిర్యాదుతో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం అతని అక్రమాలపై విచారణ జరిపి రూ.140 కోట్ల జరిమానా విధించి ఆ మైనింగ్ డాన్ దురాగతాలకు ముకుతాడు వేసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జలదంకి మండలానికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి 2008లో రోడ్డు మెటల్ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలే అడ్డాగా సమీపంలోని అనధికార భూముల్లో మెటల్ తవ్వేసి వందల కోట్ల రూపాయల దోపిడీకి తెరతీశాడు. పదేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకుని గడువు ముగిసి ఐదేళ్లు దాటిపోయినా యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నాడు. క్వారీ మైనింగ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్ బంకుల వంటివి ఏర్పాటు చేశాడు. అక్రమాలను తరచి చూస్తే.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరు మీద డీవీ కృష్ణారెడ్డి, డి.కవిత పేరుతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వేనంబర్ 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్ తవ్వకానికి పదేళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అదే మండలం అన్నవరంలో సర్వేనంబర్ 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో రోడ్డు మెటల్ తవ్వకానికి 10 ఏళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్ మీటర్ల మెటల్ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్‌శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరుల భూములు, ప్రభుత్వ భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు ఇటీవల మైనింగ్‌శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను కూడా మైనింగ్ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతోపాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేపట్టి 5 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను తవ్వేసినట్లు వెలుగుచూసింది. ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ గత ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పరి్మట్తోనే విచ్చలవిడిగా మైనింగ్ చేపట్టాడు. మొత్తంగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవి్వనట్లు మైనింగ్ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు ‘స్పందన’లో ఫిర్యాదు చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది. కరెంట్ బిల్లు ఆధారంగా.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్, రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగలేదని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. క్రషర్లకు వినియోగించిన కరెంట్ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు తేలింది. టన్ను మెటల్ ప్రాసెస్ చేయడానికి 2.5 యూనిట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. చితికిన ప్రాణాలు అక్రమ మైనింగ్ వాహనాల కింద పడి పదేళ్ల కాలంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. నిత్యం వందలాది వాహనాల్లో రోడ్మెటల్ నుంచి పెద్ద బండరాళ్లు, కంకర, మట్టి లాంటి సహజ వనరులను లూటీ చేశారు. ఈ అక్రమ రవాణా వాహనాల కిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి కేసులు లేకుండా భయపెట్టి రాజీచేసి పంపించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనధికార బ్లాస్టింగ్లు చేస్తూ ఊరినే వణికిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులను ప్రలోభపెట్టి.. అక్రమ మైనింగ్‌కు స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌శాఖల సహకారం ఉన్నట్లు ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని అక్రమ మైనింగ్‌పై ఎన్నోమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ అక్రమాల గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడంతోపాటు ఇళ్లకు వెళ్లి బెదిరించేవారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా మధ్యస్తం చేసి పంపేవారని స్థానికులు పేర్కొంటున్నారు. గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లతో.. డీవీ కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీతీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌కు కంకర, సిమెంట్ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్ మిక్సింగ్ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండడంతో రూపాయి ఖర్చు లేకుండా నదీతీరాలను తవ్వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అమలు చేసి ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లలో ఈ నాలుగేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను పరిశీలిస్తే అందులోని అక్రమాలు కూడా బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు క్రషర్ల వద్ద కరెంట్ వినియోగాన్ని లెక్కిస్తే మరికొన్ని నిజాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యజమాని డీవీ కృష్ణారెడ్డి ఎన్నో ఏళ్లుగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి సీనరేజ్ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నా. అక్రమాలను ప్రశ్నించినందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మద్దతుగా నిలిచింది. విచారణ జరిపి జరిమానా విధించడం ద్వారా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టపడింది. – గుమ్మలపాటి సుబ్బారావు, ఉప సర్పంచ్, గట్టుపల్లి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ ద్వారా గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతు లు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. – దివి నరేంద్రచౌదరి, గట్టుపల్లి, జలదంకి మండలం -
దారుణం: కళ్ల ముందే మునిగిపోయాడు!
మేళ్లచెరువు (నల్గొండ): ప్రమాదవశాత్తు సున్నపురాయి క్వారీ నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని రామాపురం పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండలంలోని రామపురం గ్రామానికి చెందిన ఉండేటి కొండలు కుమారుడు ఉండేటి వెంకటేష్ (15) సోమవారం ఉదయం తన స్నేహితులు నలుగురితో కలిసి క్వారీ వైపు బహిర్భూమికి వెళ్లారు. అదే సమయంలో వెంకటేష్ క్వారీలోకి దిగి కాళ్లు కడుక్కుంటుండగా కాలు జారి నీటిలో పడిపోయాడు. మునిగిపోతున్న వెంకటేష్‌ను చూసిన అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ లోపు గ్రామస్తులు, కుంటుంబ సభ్యులు క్వారీ వద్దకు చేరుకొని వెంకటేష్ ఆచూకీ కోసం గాలించారు. క్వారీలో నీరు సుమారు 30అడుగుల లోతు ఉండడంతో మూడు గంటలపాటు గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో సున్నపురాయి క్వారీ లోతుగా ఉండడంతోపాటు దానికి రక్షణ ఏర్పాటు చేయకపోవడం వలన తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి తండ్రి కొండలు, బంధువులు స్థానిక భీమా సిమెంట్ గేటు వద్ద ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ.నరేష్ సంఘటనా స్థలాకి చేరుకుని పరిశీలించారు. -
నాపరాతి పరిశ్రమ: రూ.600 కోట్ల వరకు నష్టాలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తాండూరు నాపరాతి పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అన్‌లాక్ ప్రక్రియతో కాస్త ఊరట లభిస్తున్న తరుణంలో భారీ వర్షాలతో పరిస్థితి మొదటికొచ్చింది. క్వారీల్లో చేరిన నీటితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్వారీ నుంచి ముడి సరుకు బయటకు రాకపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు సైతం దిక్కులు చూస్తున్నాయి. ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో క్వారీల యజమానులు డోలాయమానంలో పడ్డారు.ఇక పరిశ్రమపై ఆధారపడ్డ 25వేల మంది కార్మికులకు పూటగడవడమే కష్టమైంది. ‘ఉపాధి’ని ముంచేసిన వానలు వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో దాదాపు 300 నాపరాతి క్వారీలున్నాయి. వీటికి అనుబంధంగా 1,250 పాలిషింగ్ యూనిట్లు, ఇతర మార్కెటింగ్ స్టోర్లు కొనసాగుతున్నాయి. వీటిల్లో పనిచేసే వారిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు సైతం వలస వచ్చి పనిచేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాపరాతి పరిశ్రమ మూతపడటంతో 95 శాతం కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు చివరి నుంచి క్రమంగా యూనిట్లను తెరిచేందుకు యాజమాన్యాలు ఉపక్రమించగా.. సెప్టెంబర్ నెలాఖరు నుంచి కార్మికులు, కూలీలు తిరిగి వచ్చారు. పనులు మొదలవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కాగ్నా నది ఉప్పొంగడంతో క్వారీలన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికీ క్వారీల్లోకి నీళ్లు వస్తున్నాయి. తొలుత కురిసిన వానలు కాస్త తెరపివ్వడంతో భారీ ఖర్చుతో క్వారీ యజమానులు పెద్ద మోటార్లను బిగించి నీటిని బయటకు తోడారు. అంతలోనే మళ్లీ వానల తీవ్రత పెరగడంతో క్వారీలు నిండా మునిగాయి. భూమిలోతులోకి క్వారీలు ఉండడంతో ఇప్పటికీ పలుచోట్ల ఊటగా నీరు వస్తోంది. ఈ నీటిని తోడాలంటే లక్షల్లో వెచ్చించాల్సి రావడంతో క్వారీల యజమానులు ఆ పనులను విరమించారు. దీంతో ఇప్పటికే నెలల తరబడి మూతబడ్డ క్వారీలు.. ఇప్పట్లో గాడినపడేలా లేవు. మరోవైపు క్వారీల నుంచి రాయి ఉత్పత్తి లేకపోవడంతో పాలిషింగ్ యూనిట్లకూ పనిలేకుండా పోయింది. తక్కువ విస్తీర్ణంలో ఉన్న మినీ క్వారీలను ఇప్పుడిప్పుడే తెరుస్తున్నా.. ఆశించిన స్థాయిలో పనిలేదు. ముడిసరుకు సిద్ధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లలో ఒకరిద్దరికే పని దొరుకుతోంది. దిక్కుతోచని స్థితిలో కార్మికులు క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులకు ఇప్పుడు దిక్కుతోచట్లేదు. లాక్డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్తే అక్కడ తగిన ఉపాధి దొరకలేదు. అన్‌లాక్ సమయంలో గంపెడాశతో తిరిగొస్తే.. క్వారీలను వానలు నిండా ముంచేశాయి. రోజువారీ కూలీపై ఆధారపడ్డ వారందరికీ ప్రస్తుతం బతుకు గగనమైంది. చేతిలో డబ్బుల్లేక, అప్పు దొరక్క పస్తులుంటున్నారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు యాజమాన్యాలతో చర్చించినా ఫలితం లేదు. అడ్వాన్స్ రూపంలో కొంత మేర డబ్బులు తీసుకున్నప్పటికీ నెలల తరబడి పనిలేకపోవడంతో ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు కావడంతో మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. తాండూరు, షాబాద్ బండలంటే దక్షిణ భారతమంతా పేరు దక్షిణ భారతదేశంలో తాండూరు నాపరాతికి మంచి పేరుంది. క్వారీల నుంచి రాయిని బయటకు తీయడం.. దానిని పాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం ఇక్కడ ప్రధానంగా జరిగే పని. నాపరాతిని నిర్ణీత రూపంలో కటింగ్ చేసిన తర్వాత నేరుగా వాడుకోవచ్చు. పాలిష్ చేసిన రాక్షీట్లకైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో తాండూర్ బండలు, షాబాద్ బండల పేరుతో వీటిని విక్రయిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఇక్కడి నుంచి భారీగా ఎగుమతులు చేస్తారు. నాపరాతి పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో ఏటా రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇక్కడ ఏటా దాదాపు రూ.2,500 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. లాక్‌డౌన్‌తో పాటు, ఇటీవలి వర్షాల కారణంగా నాపరాతి పరిశ్రమ దాదాపు రూ.600 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. ఈ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో వివిధ కేటగిరీల్లో పనిచేసే కార్మికులు, కూలీలు 25 వేలకు పైమాటే. నెల వరకు కష్టమే.. క్వారీల్లో భారీగా చేరిన నీటిని తోడాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాలి. పెద్ద మోటార్లతో రోజుల తరబడి పంపింగ్ చేయాలి. మోటార్లకు కిరాయి భారీ మొత్తంలోనే ఉంటుంది. ప్రస్తుతం తాండూరు పరిధిలోని 70 శాతం క్వారీలు నీటితో నిండిపోయాయి. వీటన్నింటి నుంచి నీళ్లు తొలగించి మళ్లీ గాడిన పడటానికి కనీసం నెల పట్టొచ్చు. మమ్మల్ని నమ్ముకున్న కూలీలు, కార్మికులకు కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చి పోషిస్తున్నాం. – వెంకటరామిరెడ్డి, క్వారీ యజమాని, తాండూరు 2 నెలలుగా పనిలేదు క్వారీలో పనిచేస్తే రోజుకు రూ.500 కూలి వచ్చేది. ప్రస్తుతం రెండు నెలలుగా పని లేదు. నా దగ్గరున్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో భార్య, పిల్లల పోషణ కష్టంగా మారింది. గతనెల అప్పుచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఇప్పుడిక వేరే పని దొరికినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. – వడ్డే నగేశ్, కార్మికుడు -
ఫొటో సరదాకు ముగ్గురి బలి
శంషాబాద్: ఫొటో సరదా ముగ్గురు విద్యార్థులను బలిగొంది. క్వారీ గుంతల వద్ద ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు అందులోపడి దుర్మరణం పాలయ్యారు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన విషాదకర సంఘటన ఆదివారం ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్వాల్‌గూడ క్వారీ గుంతల వద్ద చోటు చేసుకుంది. సీఐ గంగాధర్, బాధితుల కుటుంబీకుల కథనం ప్రకారం.. నగరంలోని బోరబండ మోతీనగర్‌కు చెందిన విఘ్నేశ్వర్రావు కుమారులు సూర్య(22), చంద్ర(19)తో పాటు అదే ప్రాంతానికి చెందిన నరేందర్ కుమారుడు భార్గవ్‌సాయి(19) మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఫొటోలు దిగడానికి ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్‌గూడ క్వారీ గుంతల వద్దకు వచ్చారు. మిగతా స్నేహితులు ఫొటోలు తీసుకుంటుండగా సూర్య నీళ్లలోకి దిగాడు. క్వారీ గుంతల్లో సూర్య ప్రమాదవశాత్తు మునిగిపోతుండగా అతడి సోదరుడు చంద్ర పైకి లాగేందుకు ప్రయత్నించి అతడూ అందులో పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న భార్గవ్‌సాయి కూడా వారిని పైకి లాగే ప్రయత్నంలో గుంతలో పడి మునిగిపోయాడు. ముగ్గురు స్నేహితులు నీళ్లలో మునిగిపోవడంతో పక్కనే గట్టుపైన ఉన్న మరో ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి సమీపంలో ఉన్న క్రషర్ల వద్ద పనిచేస్తున్న కార్మికుల వద్దకు పరుగు పెట్టారు. జరిగిన విషయం వారికి చెప్పారు. కార్మికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలించినా యువకుల జాడ దొరకకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్జీఐఏ సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ముగ్గురి యువకుల మృతదేహాలను వెలికితీశారు. బోరున విలపించిన తల్లిదండ్రులు విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విఘేశ్వర్‌రావు ఇద్దరు కుమారు సూర్య ఆర్కిటెక్చర్ చదువుతుండగా చంద్ర ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఇద్దరు కుమారులు దుర్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. భార్గవ్‌సాయి మృతిచెందడంతో అతడి తల్లిదండ్రులు గుండలవిసేలా రోదించారు. ముగ్గురి యువకులు మృతి వార్త తెలుసుకున్న బోరబండ బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాళ్లకు ఏదైనా సాధ్యమే!
షాంఘై: మనసుంటే మార్గముంటుందనే దానికి నిదర్శనమిది. ఏదో కొత్తగా చేయాలనే తపన, గట్టి సంకల్పం ముందు అన్ని ఆటంకాలు బలాదూర్ అయ్యాయి. సాదారణంగా మనం ఏదైనా మూలనపడ్డ క్వారీని చూసి, దీనిని ఏం చేయలేం ఇక దీని పని అంతే అని చూసి వెళతాం. ఆ క్వారీని నిరుపయోగం వదిలేస్తాం. కానీ మనం క్వారీనే వదిలేయటం లేదు. ఎంతో విలువైన స్థలాన్ని వృదాగా వదిలేస్తున్నాం. అది కొంత మంది ఇంజనీర్లకు నచ్చలేదు. అందుకే కళ్లు చెదిరే రీతిలో భవంతిని నిర్మించించి లోకానికి చూపించారు. మార్గ నిర్దేశం చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి తొలి కట్టడంగా పేరు గడించేలా చేశారు. అద్భుత కట్టడాలకు నిలయమైన చైనా మరో నమ్మశక్యం కాని భవంతిని నిర్మించి ఔరా అనిపించింది. సెంట్రల్ షాంఘైకు అతి దగ్గరలో మూలనపడ్డ క్వారీలో హోటల్‌ను నిర్మించి అందరి చూపు అటువైపు తిప్పేలా చేశారు చైనా ఇంజనీర్లు. మూలనపడ్డ పెద్ద క్వారీలో ఏకంగా 17 అంతస్థుల హోటల్‌ను నిర్మించింది. 290 అడుగుల లోతు గల క్వారీలో నీరు చేరకుండా చీఫ్ ఇంజనీర్లు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 336 గదులతో భవనాన్ని నిర్మించారు. అందులోనూ ఈ హోటల్‌ను సాదాసీదాగా నిర్మించలేదు. రిలాక్స్ కావడానికి పార్క్, స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్ వంటి అన్ని వసతులను కల్పించారు. దీంతో ఇలాంటి ప్రాజెక్ట్‌కు సరితూగే నిర్మాణమే ప్రపంచంలో లేదని చైనా తేల్చిచెప్పేసింది. ఇక దీని కోసం చైనా ప్రభుత్వం 288 మిలియన్ డాలర్లను ఖర్చుచేసింది. 2013లో దీని నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ ఏడాదే భారీ వర్షాల కారణంగా సమీపంలోని నది ఉప్పొంగి ఈ క్వారీలోకి నీళ్లు చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. నీటి మట్టం తగ్గిన తర్వాత మరలా నిర్మాణానికి పూనుకున్నారు. ఇక భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ఇంజనీర్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక క్వారీలో నీటి మట్టం ఎప్పుడూ ఒకేలా ఉంచేందుకు ప్రత్యేకంగా పంప్ హౌజ్‌ను ఏర్పాటుచేశారు. సెంట్రల్ షాంఘై నుంచి గంట ప్రయాణం చేస్తు ఈ హోటల్‌కు చేరుకోవచ్చు. ఇక ఇన్ని జాగ్రత్తలతో, అన్ని హంగులతో నిర్మితమైన ఈ హోటల్లో ఓ గది బుక్ చేసుకోవాలంటే రోజుకు 490 డాలర్ల ఖర్చవుతుంది. -
ఆ క్వారీ వెనుక టీడీపీ పెద్దల హస్తం?
విశాఖ సిటీ: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు కారణమైన గూడ నల్లరాయి క్వారీ నిర్వహణ వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వారీ కిడారి సమీప బంధువుకు కేటాయించుకొని తవ్వకాలు జరపడాన్ని కొన్నాళ్లుగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మావోలు పలుమార్లు హెచ్చరించినా.. ఇంతటి వ్యతిరేకతలోనూ కిడారి ఈ క్వారీ నడపడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు ముందు మావోయిస్టులు జరిపిన చర్చల్లో ప్రధానమైన అంశం క్వారీ. గిరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. క్వారీ ఎందుకు కొనసాగిస్తున్నావంటూ మావోలు గద్దించి మరీ కిడారిని నిలదీశారు. పలుమార్లు హెచ్చరించినా.. క్వారీ కొనసాగించడాన్ని జీర్ణించుకోలేకపోయిన మావోలు.. సర్వేశ్వరరావుని ఇదే కారణంతో దారుణంగా హత్య చేశారు. అయితే.. నియోజకవర్గంలో ఇంతగా వ్యతిరేకత వస్తున్నా.. మావోయిస్టుల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నా.. ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముందని తెలిసినా.. క్వారీని ఆపేందుకు కిడారి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు.? ఎవరి ప్రోద్బలంతో గూడ క్వారీని కొనసాగించి.. ఇప్పుడు విగత జీవులయ్యారు.? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కిడారి సర్వేశ్వరరావు క్వారీ జోలికి పోలేదు. ప్రజలతో మమేకమవుతూ.. మైనింగ్ జోలికి వెళ్లలేదు. అయితే.. అధికార పార్టీలోకి వెళ్లిన తర్వాత రెండున్నరేళ్ల నుంచి క్వారీ నడపడం ప్రారంభించారు. హుకుంపేట మండలం జోగులపుట్టు, గూడ గ్రామాల సరిహద్దులోని నల్లరాయి (బ్లాక్‌స్టోన్స్) క్వారీలో మైనింగ్ వ్యవహారాలు జరిపేవారు. దీనిపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అయినా.. కిడారి చలించలేదు. మావోయిస్టులు పలుమార్లు గూడ క్వారీలో తవ్వకాలు నిలిపెయ్యాలనీ, ప్రజా ఉద్యమాలకు విలువ ఇవ్వాలంటూ హెచ్చరించారు. అయినా.. కిడారి వినకపోవడానికి కారణం టీడీపీని తమ సొంతమనుకొనే బెజవాడకు చెందిన కొందరు పార్టీ నేతలే కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఈక్వారీ వల్ల చెడ్డ పేరు వస్తోందని పలుమార్లు వారితో కిడారి చెప్పినా.. సదరు బెజవాడ నేతలు చెవికెక్కించుకోలేదు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన కిడారి.. తప్పనిసరి పరిస్థితిలో గూడ క్వారీని కొనసాగించారు. మావోలు హెచ్చరించినా.. టీడీపీ పెద్దల మాట కాదనలేక యథేచ్ఛగా క్వారీ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. దీంతో.. తాము చెప్పినా వినిపించుకోలేదనీ, ప్రజలు ప్రత్యక్ష ఉద్యమాలు చేపడుతున్నా.. చెవికెక్కించుకోలేదనే కారణాలు... ఇవన్నీ కలిసి.. కిడారిని మావోల తూటాలకు బలిచేశాయి. తెరవెనుక ఉండి టీడీపీ నాయకులు గూడ క్వారీ నుంచి లబ్ధి పొందితే.. శిక్ష మాత్రం కిడారి సర్వేశ్వరరావే పొందాల్సిన పరిస్థితి ఎదురైంది. నాన్న.. క్వారీని ఆపేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ.. విజయవాడకు చెందిన టీడీపీ నేతలు కొందరు కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అందువల్లనే క్వారీ నడిపించారు. దానివల్లే.. ఇవాళ నాన్న మా మధ్య లేకుండా పోయారంటూ సన్నిహితుల వద్ద కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కన్నీటిపర్యంతమయ్యారని తెలుస్తోంది. -
కేప్ వైరు పేలి చిన్నారికి తీవ్ర గాయాలు
ప్రమాదం జరిగితే తప్ప కళ్లు తెరవని అధికారులు.. ప్రాణాలు పోతే తప్ప మేల్కొనని ప్రభుత్వం.. కర్నూలులో క్వారీ పేలుడు ఘటన నేపథ్యంలోనూ ఇక్కడి అధికారుల్లో చలనం లేకపోయింది. ఈ నిర్లక్ష్యమే ఓ చిన్నారికి శాపంగా మారింది. రాయదుర్గం ప్రాంతంలో అనుమతి లేని క్వారీల నిర్వాహకులు పడేసిన కేప్ వైరుతో ఆడుకుంటుండగా పేలిన ఘటనలో నేమకల్లు గ్రామానికి చెందిన విలాజ్(7) తీవ్రంగా గాయపడ్డాడు. బొమ్మనహాళ్: క్వారీలో ఉపయోగించే బ్లాస్టింగ్ వైరు(కేప్) పేలడంతో మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన రైతు ఫిరోజ్ కుమారుడు విలాజ్ (7)కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న క్వారీ ప్రమాదం నేపథ్యంలో అధికారులు జిల్లాలో తనిఖీలు చేపట్టారు. విషయం ముందుగానే తెలుసుకున్న క్వారీల నిర్వాహకులు తమ వద్ద నిల్వ చేసుకున్న బ్లాస్టింగ్ సామగ్రిని ఎక్కడిపడితే అక్కడ పడేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విలాజ్ సోమవారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఇంటికి వెళ్తూ దారిలో దొరికిన బ్లాస్టింగ్ వైరును తీసుకెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో ఆడుకుంటూ వైరుపై రాయితో బలంగా కొట్టడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో విలాజ్ చేయి, ఇతర శరీర భాగాలతోపాటు మర్మాంగానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం ప్రాంతంలో అనుమతి లేకుండా లెక్కకు మించి క్వారీలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సెంట్రల్ ట్రిబ్యునల్ టీమ్ కూడా క్వారీలను, కంకర మిషన్లను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహించేవాళ్లు ఎక్కడ పడితే అక్కడ బ్లాస్టింగ్ వైరును పడేసినట్టు సమాచారం. క్వారీల సమీపంలోని పొలాల్లోనూ బ్లాస్టింగ్ వైర్లు పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. -
క్వారీ ప్రమాద ఘటన కేసు..
-
క్వారీలో పేలుడు.. ఇవి సర్కారీ హత్యలే
-
భారీ పేలుడు..ఘటనా స్థలంలో బీభత్స దృశ్యాలు
-
కర్నూలు: క్వారీలో భారీ పేలుడు
-
క్వారీలో భారీ పేలుడు
ఎటు చూసినా ముక్కలు ముక్కలైన శరీర భాగాలు..ఏ భాగం ఎవరిదో గుర్తు పట్టలేని పరిస్థితి.. కాలువలా ప్రవహించిన రక్తం.. ఇదీ శుక్రవారం కర్నూలు జిల్లాలోఓ క్వారీలో చోటు చేసుకున్న భారీ పేలుడు తర్వాత కనిపించిన భీతావహ దృశ్యం. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ధనదాహం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి 12 మంది అమాయక కూలీలు బలైపోయారు. గనుల్లో అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవలే ఆదేశించినా ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం రాలేదు. ఫలితంగా 12 పేద ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆలూరు/కర్నూలు వైఎస్సార్ సర్కిల్: కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద కొండపైనున్న కంకర క్వారీలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. 10 మంది గల్లంతయ్యారని సమాచారం. గాయపడిన వారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులంతా ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ క్వారీని తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్ చౌదరి, అతడి సోదరుడు సువాస్ చౌదరి నిర్వహిస్తున్నారు. సంఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. భారీ పేలుడు ధాటికి మృతుల శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఏ శరీర భాగం ఎవరిదో గుర్తు పట్టలేనంతగా మారాయి. గాయపడిన వారు అపస్మారకస్థితిలో వెళ్లారు. షాక్‌కు గురై ఏమీ చెప్పలేకపోతున్నారు. పైగా వారి భాష కూడా ఇక్కడెవరికీ అర్థం కావడం లేదు. దీంతో పేలుడు ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. క్షతగాత్రులను ఆలూరు, కర్నూలు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పేలుడు తీవ్రతకు మూడు ట్రాక్టర్లు, ఒక లారీ మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి. పేలినవి ఎలక్ట్రికల్ డిటోనేటర్లు! క్వారీలో భారీఎత్తున పేలుడు సామగ్రిని నిల్వ ఉంచినట్లు సమాచారం. 300కు పైగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, కిలోల కొద్దీ గన్‌పౌడర్, స్లర్రీ ఎక్స్‌ప్లోజివ్స్, జల్, జిలెటిన్ స్టిక్స్ లాంటి మందుగుండు అక్కడ ఉందని స్థానికులు చెబుతున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం... ఈ క్వారీలో కొద్ది రోజుల క్రితమే గుంతలు తవ్వి పేలుళ్లు జరిపారు. కొన్ని గుంతల్లో నింపిన మందుగుండు పేలలేదు. శుక్రవారం రాత్రి ముందుగా అక్కడున్న గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. అవి డిటోనేటర్ల వైర్లకు వ్యాపించాయి. దీంతో ప్రస్తుతం జరిపే పేలుళ్లతో కలిసి పేలని గుంతల్లో ఉన్న డిటోనేటర్లు కూడా ఒకేసారి పేలడంతో పెద్దఎత్తున విస్ఫోటనం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. అవి అక్కడున్న షెడ్లకు వ్యాపించడంతో అందులో నిల్వ ఉంచిన 300 డిటోనేటర్లు, గన్‌పౌడర్, జిలెటిన్ స్టిక్స్, జల్ లాంటి పదార్థాలు కూడా పేలిపోయాయి. గ్రామ శివార్ల వరకూ మంటలు వ్యాపించాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డిటోనేటర్లను ఎక్కువ లోతులో అమర్చడం వల్లే భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సాధారణంగా వాటిని నాలుగు అడుగుల లోతులో అమర్చాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా అంతకుమించిన లోతులో అమర్చినట్లు మైనింగ్ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం క్వారీలో 50 మంది దాకా కూలీలు పని చేస్తుంటారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అక్కడే టెంట్లు వేసుకుని కుటుంబాలతో సహా ఉంటున్నారు. భారీ పేలుడు నేపథ్యంలో వీరిలో చాలామంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సంఘటన స్థలంలోకి వెళ్లడానికి అధికారులు అర్ధరాత్రి దాటినా సాహసం చేయలేకపోయారు. అక్కడ మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారంతో ఎవరూ Ðవెళ్లలేకపోయారు. ఆరు గ్రామాల్లో కంపించిన భూమి పేలుడు తీవ్రతకు హత్తిబెళగల్ గ్రామంలోని 25 మట్టి మిద్దెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అవి కూలిపోయి మీద పడతాయన్న భయంతో ఇళ్ల నుంచి గ్రామస్తులంతా పరుగులు తీశారు. హత్తిబెళగల్తోపాటు తుమ్మలబీడు, ఆలూరు, అరికెర, కురువెళ్లి, హులేబీడు, పెద్దహోతూరు తదితర గ్రామాల్లో సైతం భూమి కంపించినంత శబ్ధం రావడంతో తీవ్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మా ప్రాణాలు పోతున్నా పట్టదా? హత్తిబెళగల్ గ్రామస్తులు ఆలూరు పోలీసుస్టేషన్‌కు చేరుకొని అక్కడే బైఠాయించారు. గనుల తవ్వకాల వల్ల తమ ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా పట్టించుకోవడం లేదని పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులపై మండిపడ్డారు. నాలుగైదేళ్ల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. క్వారీలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారంటూ ఆదోని ఆర్డీఓ, తహసీల్దార్ నాగరాజు, వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజు గోరంత.. తవ్వేది కొండంత హత్తిబెళగల్ సమీపంలోని కొండ దాదాపు 50 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ కొండలో రోడ్మెటల్తోపాటు క్వారŠజ్ట్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గనికి సంబంధించి ఆలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి, సువాస్ చౌదరి సర్వే నంబరు 669లోని కేవలం 10 ఎకరాలకే లీజు పొందినట్లు సమాచారం. లీజుకు తీసుకున్న ప్రాంతంతోపాటు మరికొంత విస్తీర్ణాన్ని ఆక్రమించి అక్రమంగా కంకర తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా కూలీల భద్రతకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం తలకు హెల్మెట్ కూడా సమకూర్చలేదు. కన్పించని ఫోర్టబుల్ మ్యాగజైన్ మైనింగ్ ప్రాంతాల్లో పేలుడు సామగ్రిని భద్రపరిచేందుకు ఫోర్టబుల్ మ్యాగజైన్ రక్షణ కవచంగా ఉంటుంది. అందులో ఉంచితే పిడుగులు పడినా షార్ట్ సర్క్యూట్ కాదు. ఇనుప పెట్టెలోని చెక్కపెట్టెలాగా ఉండే ఫోర్టబుల్ మ్యాగజైన్‌ను క్వారీ వద్ద ఉంచకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండానే పేలుళ్లు వాస్తవానికి క్వారీలో భారీఎత్తున పేలుళ్లు జరపాలంటే స్థానిక పోలీసులతోపాటు రెవెన్యూ, మైనింగ్, మైన్‌సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సమీప గ్రామాల ప్రజలకు ముందుగానే తెలియజేయాలి. అయితే, అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి రాత్రి, పగలు తేడాలేకుండా ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారుల ఉదాసీనతతోపాటు అధికార పార్టీ అండతో మైనింగ్ వ్యాపారులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మైనింగ్ ప్రాంతంలో ప్రతి ఏడు అడుగులకు ఒక బెంచ్ నిర్మాణం(ర్యాంపు) చేపట్టాలి. అయితే మీటర్ల కొద్దీ బెంచ్‌లను ఏర్పాటు చేయకపోవడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బెంచ్‌ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ ఏడాది మార్చి 29న వెల్దుర్తి మండలం సిద్దనగట్టు గ్రామంలోని సుద్దక్వారీలో జేసీబీ బోల్తా పడి నాగరాజు, హరి అనే కూలీలు మృతి చెందారు. అదే విధంగా ఇసుక డంప్ వద్ద నిబంధనలు పాటించకపోవడంతో జూలై 15న మల్లేపల్లె గ్రామం వద్ద లక్ష్మిదేవి అనే మహిళ ఇసుక దిబ్బలు పడి మృతి చెందింది. రెండేళ్ల క్రితం ప్యాపిలి మండలం చండ్రపల్లె గ్రామంలో క్వారీలోని మట్టి దొర్లి నలుగురు చనిపోయారు. జూలై 21న సి.బెళగళ్ మండలం పలుకుదొడ్డి గ్రామంలోని కంకర క్వారీలో పేలుళ్లకు ఉపయోగించే క్రమంలో ట్రాక్టర్ మీద పడి బోయచంద్రశేఖర్, ముల్లామస్తాన్ వలీ అక్కడికక్కడే మృతి చెందారు. టీడీపీ నేతలకు ఉసురు తగలక తప్పదు ‘‘అధికార టీడీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారికి ఉసురు తప్పకుండా తగులుతుంది. క్వారీ యజమానిపై గ్రామస్తులు పలుమార్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. లీజుదారులకు ఇచ్చిన దానికంటే ఎక్కువ భాగాన్ని డిటోనేటర్లతో పేల్చడం దారుణం. ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్నా అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి’’ – గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే, ఆలూరు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..
-
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి, కర్నూలు: ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి పైగా మృత్యువాత పడగా, మరికొంతమంది తీవ్రగాయాలపాలయ్యారు. పేలుళ్ల కారణంగా బండరాళ్లు మీద పడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బండరాళ్ల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పేలుళ్లతో క్వారీలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి మూడు ట్రాక్టర్లు, లారీ, రెండు షెడ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. షెడ్లలో మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కార్మికులుగా అధికారులు గుర్తించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోయారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
కుడియా తెల్లరాయి క్వారీ సీజ్
దేవరాపల్లి(మాడుగుల): అనంతగిరి మండలం పరిధిలో గల కుడియా తెల్ల రాతి క్వారీని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ శాఖ సెక్షన్‌లోని తట్టపూ డి బీట్ పరిధిలో గల రిజర్వడ్ ఫారెస్టులో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నట్టు నిర్ధారించుకుని సీజ్ చేశామని చోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీజర్ రామనరేష్ బిర్లంగి, తెనుగుపూడి సెక్షన్ అటవీశాఖ అధికారి ఎం. రమేష్‌కుమార్ గురువారం తెలిపా రు. అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న దొమ్మంగి పెంటం నాయుడు, మహేంద్ర వీరకుమార్, సందీప్ కార్తీకేయ అనే ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు క్వారీ ప్రాంగణంలో ఉన్న జేసీబీ, డ్రిల్లింగ్ మిషన్ కూడా సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించి రామనరేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా తెనుగుపూడి అటవీ సెక్షన్ ఆఫీసర్ ఎం.రమేష్ కుమార్, తట్టపూడి బీట్ ఆఫీసర్ పి. శంకరాచారి కలిసి అటవీ ప్రాంత పరిశీలనకు వెళ్లారు. పక్కనే ఉన్న కుడియాలోని సర్వే నంబర్ 4 లో గల క్వారీని కూడా గత ఏడాది ఏప్రిల్ 10న పరిశీలించారు. క్వారీ ఏర్పాటు చేసిన స్థలంపై సందేహం కలిగిన అటవీశాఖ స్థానిక అధికారులు జీపీఎస్(గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) పాయింట్ ద్వారా పరిశీలించి, రిజర్వ ఫారెస్టులో ఉన్నట్టు గుర్తించారు. ఆ క్వారీకి 2002 నుంచి 2022 వరకు రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలాజికల్ అనుమతులున్నాయి. అటవీ శాఖ నుంచి ఎటువంటి అనమతులు లేనందున క్వారీని నిలిపి వేయడంతో పాటు క్వారీలో ఉన్న జేసీబీ డ్రిల్లింగ్ మిషన్ల గత ఏడాది ఏప్రిల్ 19న స్వాధీనం చేసుకున్నామన్నారు. క్వారీ నిర్వహించే ప్రాంతం ఫారెస్టు శాఖది కాదని, రెవెన్యూకు సంబంధించినదంటూ కలెక్టర్‌తో పాటు జిల్లా అటవీశాఖ అధికారులకు అప్పట్లో క్వారీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఏడాది తరువాత దీనిపై విచారణ జరిపేందుకు విశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ దర్యాప్తు అధికారిగా నియమించారు. ఆ క్వారీ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని నిర్ధారిస్తూ అటవీ, రెవెన్యూశాఖ అధికారులు సంయుక్తంగా ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ఈ నెల 25న మేరకు క్వారీ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు జేసీబీ, డ్రిల్లింగ్ మిషన్లను సీజ్ చేసినట్టు చెప్పారు. -
పెద్దపల్లిలో పేలుడు పదార్థాలు స్వాధీనం
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. జిల్లాలోని బసంత నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవునిపల్లి శివారులోని క్వారీలో గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన 321 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 170 కేజీల అమ్మెనియా, 50 లీటర్ల కిరోసిన్, కాంప్రెషర్ ట్రాక్టర్‌ను పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్వారీ యజమానులు రాయిశెట్టి శ్రీనివాస్, చిట్యాల అశోక్, కాంప్రెషర్ యజమాని సంచులు సధాకర్, డ్రైవర్ దేవేందర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురిని బలిగొన్న క్వారీ లారీ
దేవరపల్లి : క్వారీ లారీ ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను బలిగొంది. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెన వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నల్ల్లజర్లకు చెందిన ఉప్పాటి సురేష్ (38), భార్య లక్ష్మీదుర్గ (34), కుమారుడు ఉప్పాటి ప్రేమసాగర్ (2), సురేష్ మేనకోడలు లిఖిత మోటార్ బైక్‌పై రాజమండ్రి వెళుతుండగా అనంతపల్లి వద్ద ఎర్రకాలువ సమీపంలో ఎదురుగా వస్తున్న క్వారీలారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మీదుర్గ, ప్రేమసాగర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా కొనఊపిరితో ఉన్న సురేష్, తీవ్రంగా గాయపడిన లిఖితను చికిత్స కోసం 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సురేష్ మృతి చెందాడు. లిఖిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. నల్లజర్లకు చెందిన సురేష్ కుటుంబం ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు నల్లజర్ల వచ్చి కుటుంబ సభ్యులను కలిసి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నల్లజర్ల వచ్చి వెళుతుండగా క్వారీలారీ రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో లక్ష్మీదుర్గ, ప్రేమసాగర్ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జయ్యాయి. నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ ప్రమాదస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
క్వారీ గుంతలో ఈత...తల్లులకు గుండెకోత!
యాచారం: క్వారీలో ఈత కొడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా.. యువత ఆసక్తితో రావడం, అధికారులకు సమాచారం ఉన్న పట్టించుకోకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లితండ్రులు భయాందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారి సమీపంలో, యాచారం పోలీస్ స్టేషన్ వెనకాల వ్యాపారులు గ్రానెట్ రాళ్ల కోసం క్వారీ తవ్వారు. దాదాపు 20 అడుగుల లోతున్న ఈ క్వారీలో మూడు, నాలుగు అడుగుల లోతు నీళ్లు.. పెద్దపెద్ద బండరాళ్లు గునుపాల మాదిరిగా ఉన్నాయి. వేసవి కాలం కావడంతో ఉపశమనం కోసం యాచారం మండలంలోని పలు గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది యువత, చిన్నారులు ఈతకు తరలివస్తున్నారు. ఈత సరదాలో కొద్దిపాటి నీటిలో పది అడుగుల ఎత్తు నుంచి దూకుతున్నారు. క్వారీ అడుగు భాగంలో గునుపం లాంటి రాళ్లు ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. నాలుగేళ్ల చిన్నారులు సైతం ఈతకు... క్వారీలో ఈతకు వివిధ గ్రామాల నుంచి నాలుగేళ్ల చిన్నారులు సైతం తరలివస్తున్నారు. 25 ఏళ్లు పైబడిన యువత మద్యం వెంట తెచ్చుకొని ఈత సరదా మధ్యలో వాటిని సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మద్యం మత్తులో నీవు ఎంత ఎత్తులోంచి దూకుతావు.. అంటూ బెట్టింగులు కడుతూ ఘర్షణలకు సైతం దిగుతున్నారు. ఇలా సరదా కోసం యువత ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. మైనింగ్ శాఖ నింబంధనల ప్రకారం లీజుకు తీసుకుని గ్రానెట్ తీసిన వ్యాపారులు అనంతరం క్వారీని పూర్తిగా పూడ్చేయాలి. కానీ యాచారం పోలీస్‌స్టేషన్ వెనకాల ఉన్న క్వారీని పూడ్చకుండా అలానే వదిలేశారు. అధికారులకు తెలిసిన పట్టించుకోకపోవడం లేదు. దీంతో నేడు యాచారం క్వారీ యువత ప్రాణాలకు శాపంగా మారింది. ప్రమాదకరంగా ఉన్న క్వారీని వెంటనే పూడ్చడం, లేదా ఈతకు యువత రాకుండా కట్టడి చర్యలు తీసుకోకపోతే చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం తప్పదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విదేశీ విద్యార్థి అనుమానాస్పద మృతి
మౌలాలి: క్వారీ గుంతలో పడి విదేశీ విద్యార్ధి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుడాన్ దేశానికి చెందిన సాలిహ్ అబ్డీన్ సాలీహ్ అలియస్ కోహా(28) నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసి చదువుతుతూ ఓయూ టీచర్స్ కాలనీలోని రాఘవేంద్రహిల్స్ ఎమ్మార్ రెసిడెన్సీలో ఉంటున్నాడు. శనివారం రాత్రి తన స్నేహితులు సబ్రా, కెల్విన్, సండ్రా, హ్యాపి, రేమాండ్, గాడ్విల్లతో కలిసి ప్లాట్‌లో విందు చేసుకున్నారు. స్నేహితులు వెళ్లిపోవడంతో ప్లాట్‌లో ఒక్కడే ఉన్నాడు. ఉదయం స్నేహితులు వచ్చి చూసేసరికి అతను క్వారీ గుంతలో మృతి చెంది ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్వారీలో ప్రమాదం..ఇద్దరి మృతి
విజయనగరం : బొబ్బిలి మండలం బంకురువలస మాంగనీస్ క్వారీలో మంగళవారం ప్రమాదం జరిగింది. క్వారీలో బండరాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్వారీలో బ్లాస్టింగ్: భారీగా ప్రాణ నష్టం
-
రాళ్లు మీద పడి ఇద్దరు కూలీల మృతి
మార్కాపురం (ప్రకాశం జిల్లా) : మార్కాపురం మండలం రాయవరంలో ఉన్న ఓ క్వారీలో రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు తుర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన గోగు బాలగురవయ్య(25), ఈర్ల గురవయ్య(26)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి బాలుడు మృత్యువాత
నల్లగొండ జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు చనిపోయాడు. సూర్యాపేట పట్టణానికి చెందిన కొందరు బాలురు మంగళవారం ఉదయం చివ్వెంల సమీపంలోని క్వారీల వద్దకు వచ్చారు. ఇటీవలి వర్షానికి క్వారీ గుంతలో నిలిచిన నీటిలో ఈత కొట్టేందుకు దిగారు. కటికం బన్ను(12) మాత్రం ఈత సరిగా రాక నీటిలో మునిగి చనిపోయాడు. తోటి వారు విషయం గమనించి స్థానికులకు తెలపటంతో వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.