Huge Fine To Mining Trader Kavya Krishna Reddy - Sakshi
Sakshi News home page

మైనింగ్‌ డాన్ కావ్య కృష్ణారెడ్డికి ముకుతాడు

Published Tue, Jun 27 2023 12:19 PM | Last Updated on Tue, Jun 27 2023 12:44 PM

Mining Don TDP Kavya Krishna Reddy - Sakshi

పాతికేళ్ల క్రితం అతనో కామర్స్‌ అధ్యాపకుడు. తాను ఉండే ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. జలదంకి ఎంపీపీగా ఎన్నికై మైనింగ్‌ డాన్‌గా ఎదిగాడు. రియల్‌ ఎస్టేట్‌ నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్‌ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయనే గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్‌ కావ్య కృష్ణారెడ్డి. ఇన్నాళ్లు తెరచాటుగా సాగిస్తున్న అతని అవినీతి బాగోతం ఇటీవల సమాచారహక్కు చట్టంతో బయటపడింది. ‘స్పందన’ ఫిర్యాదుతో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం అతని అక్రమాలపై విచారణ జరిపి రూ.140 కోట్ల జరిమానా విధించి ఆ మైనింగ్‌ డాన్‌ దురాగతాలకు ముకుతాడు వేసింది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జలదంకి మండలానికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్‌ కావ్య కృష్ణారెడ్డి 2008లో రోడ్డు మెటల్‌ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలే అడ్డాగా సమీపంలోని అనధికార భూముల్లో మెటల్‌ తవ్వేసి వందల కోట్ల రూపాయల దోపిడీకి తెరతీశాడు. పదేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకుని గడువు ముగిసి ఐదేళ్లు దాటిపోయినా యథేచ్ఛగా మైనింగ్‌ చేస్తున్నాడు. క్వారీ మైనింగ్‌ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్‌ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్‌ బంకుల వంటివి ఏర్పాటు చేశాడు.  

అక్రమాలను తరచి చూస్తే.. 
గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ పేరు మీద డీవీ కృష్ణారెడ్డి, డి.కవిత పేరుతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వేనంబర్‌ 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్‌ తవ్వకానికి పదేళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్‌ లీజు హక్కులు పొందాడు. అదే మండలం అన్నవరంలో సర్వేనంబర్‌ 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో రోడ్డు మెటల్‌ తవ్వకానికి 10 ఏళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్‌ లీజు హక్కులు పొందాడు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్‌ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్‌ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు.

 అయితే ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్‌శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరుల భూములు, ప్రభుత్వ భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు ఇటీవల మైనింగ్‌శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను కూడా మైనింగ్‌ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతోపాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్‌ చేపట్టి 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను తవ్వేసినట్లు వెలుగుచూసింది. 

ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ గత ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పరి్మట్‌తోనే విచ్చలవిడిగా మైనింగ్‌ చేపట్టాడు. మొత్తంగా 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవి్వనట్లు మైనింగ్‌ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్‌ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్‌ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు ‘స్పందన’లో ఫిర్యాదు చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది. 

కరెంట్‌ బిల్లు ఆధారంగా.. 
గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్, రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్‌ జరగలేదని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. క్రషర్లకు వినియోగించిన కరెంట్‌ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగించినట్లు తేలింది. టన్ను మెటల్‌ ప్రాసెస్‌ చేయడానికి 2.5 యూనిట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. 

చితికిన ప్రాణాలు 
అక్రమ మైనింగ్‌ వాహనాల కింద పడి పదేళ్ల కాలంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. నిత్యం వందలాది వాహనాల్లో రోడ్‌మెటల్‌ నుంచి పెద్ద బండరాళ్లు, కంకర, మట్టి లాంటి సహజ వనరులను లూటీ చేశారు. ఈ అక్రమ రవాణా వాహనాల కిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి కేసులు లేకుండా భయపెట్టి రాజీచేసి పంపించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనధికార బ్లాస్టింగ్‌లు చేస్తూ ఊరినే వణికిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

అధికారులను ప్రలోభపెట్టి.. 
అక్రమ మైనింగ్‌కు స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌శాఖల సహకారం ఉన్నట్లు ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని అక్రమ మైనింగ్‌పై ఎన్నోమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ అక్రమాల గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడంతోపాటు ఇళ్లకు వెళ్లి బెదిరించేవారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా మధ్యస్తం చేసి పంపేవారని స్థానికులు పేర్కొంటున్నారు. 

గురు రాఘవేంద్ర కాంక్రీట్‌ మిక్సర్‌ ప్లాంట్లతో.. 
డీవీ కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీతీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్‌ మిక్సర్‌ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌కు కంకర, సిమెంట్‌ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్‌ మిక్సింగ్‌ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండడంతో రూపాయి ఖర్చు లేకుండా నదీతీరాలను తవ్వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అమలు చేసి ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్‌ మిక్సర్‌ ప్లాంట్లలో ఈ నాలుగేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను పరిశీలిస్తే అందులోని అక్రమాలు కూడా బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు క్రషర్ల వద్ద కరెంట్‌ వినియోగాన్ని లెక్కిస్తే మరికొన్ని నిజాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. 

అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం 
గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్‌ యజమాని డీవీ కృష్ణారెడ్డి ఎన్నో ఏళ్లుగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. అక్రమ మైనింగ్‌ ద్వారా వేల కోట్లు సంపాదించాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి సీనరేజ్‌ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నా. అక్రమాలను ప్రశ్నించినందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మద్దతుగా నిలిచింది. విచారణ జరిపి జరిమానా విధించడం ద్వారా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టపడింది. 
– గుమ్మలపాటి సుబ్బారావు, ఉప సర్పంచ్, గట్టుపల్లి 
 
ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం 

గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ ద్వారా గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతు లు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మైనింగ్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. 
– దివి నరేంద్రచౌదరి, 
గట్టుపల్లి, జలదంకి మండలం  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement