టీడీపీ కావలి సీటు విషయంలో ఆ పార్టీ అధిష్టానం చివరకు క్యాష్ వైపే మొగ్గు చూపింది. కావ్య కృష్ణారెడ్డికే జై కొట్టి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచి డబ్బుసంచుల వైపు చూడడంతో దీనిని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. దశాబ్దాల నుంచి కావలిలో టీడీపీని కాపు కాసిన బీద రవిచంద్ర మాట కూడా చెల్లుబాటు కాలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడికి సైతం మొండిచేయి చూపడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ ఇన్‌చార్జిగా కావ్య కృష్ణారెడ్డి (దగుమాటి వెంకట కృష్ణారెడ్డి)ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అభ్యర్థి ప్రకటన చేయడంపై క్యాడర్ మండిపడుతోంది. బీద రవిచంద్ర దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆ కుటుంబానికే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో వారే అన్నీ తామై నడిపించేవారు. కానీ ఈ దఫా బీద రవించంద్ర, ఆయన సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగినా స్థానికంగా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తన ప్రధాన అనుచరుడిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడిని ఇన్‌చార్జిగా నియామకం చేయించారు. కష్టకాలంలో మాలేపాటి పార్టీ కోసం నిలబడ్డారు. గత టీడీపీ హయాంలో అడ్డగోలుగా దోపిడీ చేసిన సొమ్ములో కాస్త కరిగించేలా చేశారు. చివరకు ఎన్నికల సమయంలో మాలేపాటికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో బీద మాట చెల్లుబాటు కాకపోవడంతో మిన్నకుండిపోవాల్సివచ్చింది.
కావ్య వర్సెస్ బీద
కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకముందే బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. డబ్బు సంచులతో పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని టికెట్ ఖరారు చేయించుకుని వచ్చిన కావ్య కావలిలో హడావుడి చేశారు. బీదకు వ్యతిరేక వర్గాన్ని కూడదీయడంతోపాటు ఇకపై బీద మాట వినాల్సిన అవసరం లేదని, అంతా తన కనుసన్నల్లోనే జరుగుతుందనే సంకేతాలను కూడా ఆ పార్టీ కార్యకర్తల్లోకి పంపారు. కావ్య కృష్ణారెడ్డి ముందుగానే పార్టీ ఫండ్ పేరుతో రూ.కోటి విరాళం ఇచ్చారు. అంతేకాక ఏకంగా రూ.20 కోట్లు పార్టీ ఫండ్ కింద జమ చేసి మరో రూ.50 కోట్లు ఇచ్చే దానికై నా సిద్ధంగా ఉన్నానని సంకేతం పంపి లోకేశ్ వద్ద మార్కులు కొట్టేసి టికెట్ ఖరారు చేయించుకున్నారని తెలుస్తోంది.
అడ్డదారులు తొక్కుతూ..
సుమారు పాతికేళ్ల క్రితం కామర్స్ అధ్యాపకుడిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి తాను నివాసం ఉండే ఇంటికి అద్దె చెల్లించలేని స్థితి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రూ.వేల కోట్లకు అధిపతి అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే మైనింగ్ డాన్‌గా ఎదిగారు. అడ్డగోలుగా ఎదిగిన కావ్య కృష్ణారెడ్డి అందించిన డబ్బు సంచులకు సాగిలపడిన టీడీపీ ఆయనకు కావలి సీటు ఖరారు చేయడంపై ఆ పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
పదవి పేరుతో ముంచేసి..
మండలస్థాయి నేతగా ఉన్న తనను కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి పేరుతో ముంచేశారని మాలేపాటి సుబ్బానాయుడు తన అంతరంగీకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన మాలేపాటిని కావలి సీటు పేరుతో బీద ఊరించి అతని చేత ఖర్చు పెట్టించారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అతనిని నట్టేట ముంచారని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment