కావలి టీడీపీ ఆది నుంచి చుక్కాని లేని నావలా ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కావలిలో గెలిచింది. జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి మాత్రమే అత్తెసరు ఓట్లతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పార్టీని నడిపించేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాకు తెర తీశారు. నాలుగేళ్లుగా పార్టీని నడిపించేందుకు మాలేపాటిని వాడుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి పార్టీకి ఫండ్ ఇప్పించి కావ్యను ఊరించారు. చివరికి రవిచంద్ర భార్య జ్యోతిని ఎంట్రీ చేయించి ట్విస్ట్ ఇచ్చాడు. తాజా పరిణామాలు ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. నేటి లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణపై అయోమయం నెలకొంది.
నెల్లూరు: ఉనికి కోల్పోయిన టీడీపీని బతికించాలని లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రతో కావలిలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో బీద సోదరులు రాజకీయంగా లైమ్‌లైట్లోకి వచ్చారు. టీడీపీలో బీద మస్తాన్‌రావు అండతో ఆయన సోదరుడు బీద రవిచంద్ర రాజకీయంగా ఎదిగాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ విజయాలను తన విజయాలుగా భ్రమింపచేశారు. 2009లో బీద మస్తాన్‌రావు ఎమ్మెల్యే అయినప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై ఉండడంతో బీద రవిచంద్ర కావలిలో షాడో ఎమ్మెల్యేగా హడావుడి చేశాడు.
ఆ సమయంలోనే రవిచంద్ర నియోజకవర్గంలో తన కోటరీని సృష్టించుకున్నాడు. కావలి టికెట్‌పై ఆశలు పెంచుకుని 2014 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే టికెట్ తన సోదరుడు బీద మస్తాన్‌రావుకే ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు. ఆ ఎన్నికల్లో బీద మస్తాన్‌రావు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా తన సతీమణిని బరిలోకి దింపాలని తెరవెనుక రాజకీయం నెరిపినా.. చివరికి మస్తాన్‌రావు తన పలుకుబడి ఉపయోగించి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బరిలోకి దింపడంతో రవిచంద్ర ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత బీద మస్తాన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో కావలి బాధ్యతలను రవిచంద్రకు అప్పగించారు.
2019లో ఓటమి తర్వాత..
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడం, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దశలో పార్టీని నడిపించేందుకు మాలేపాటిని కావలి నియోజవకర్గ ఇన్‌చార్జిగా నియమించి రాబోయే ఎన్నికల్లో టికెట్ నీదేనంటూ నాలుగేళ్లుగా వాడుకున్నాడు. అయినప్పటికీ పెత్తనమంతా బీద తన చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నాడు.
కావ్యకు టికెట్ ఆశలు
తన జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కాకపోయినా.. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని అనిపించుకోవాలని తహతహలాడుతున్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ( కావ్య కృష్ణారెడ్డి) ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా అన్ని పార్టీల్లో ప్రయత్నించారు. ఇతను అయితే పార్టీకి ఉపయోగపడుతాడు.. చివరి వరకు వాడుకోవచ్చునని పార్టీ పెద్దలతో మాట్లాడించి అతనికి టికెట్ ఆశలు రేపాడు. దీంతో కావ్య కృష్ణారెడ్డి చేత పార్టీకి మహానాడులో ఫండ్ ఇప్పించాడు. కావలి టికెట్ తనకే అంటూ ఇటు మాలేపాటి, అటు కావ్య ఇద్దరూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నా.. అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత లేదు.
యువగళంలో బీద సతీమణి ఎంట్రీ ట్విస్ట్
కావలిలో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడానికి రవిచంద్ర పెట్టిన సమావేశంలో మాలేపాటి సుబ్బానాయుడు అంతా భారం తనపైనే వేయాలని, ఏ ఒక్కరిని భాగస్వామ్యం చేయొద్దని ఖరాఖండిగా చెప్పారు. లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లు, ఖర్చు అంతా కూడా మాలేపాటి చూసుకుంటారు, ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకోవద్దని నాయకులకు చెప్పేశాడు. దీంతో వీరిద్దరూ సైలెంట్ అయిపోయారు. లోకేశ్ యాత్ర కావలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే సమయానికి కాలు బాధతో రెస్ట్‌లో ఉన్న బీద తన సతీమణి జ్యోతిని ఎంట్రీ చేయించారు. లోకేశ్ యాత్రలో ఆమె అంతా తానై వ్యవహరిస్తుండడంతో అంతా అయోమయం నెలకొంది.
గతంలోనే తన సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని చూశారు. కావ్య, పసుపులేటి కేవలం టికెట్ ఇస్తేనే ఉంటారు.. లేదంటే బయటకు పోతారు. కానీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రవిచంద్రను కాదని మరెవరికి టికెట్‌వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తన సతీమణిని రంగంలోకి దింపడానికే యువగళంలో బీద జ్యోతిని ఎంట్రీ ఇప్పించాడని ప్రచారం. అయితే సోమవారం కావలిలో లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణకు ఉత్సాహంగా ఉన్న నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. నేటి లోకేశ్ సభ పరిస్థితిపై అయోమయం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment