నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలైంది. పాత, కొత్త నాయకులందరూ దీనిని విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే అలా జరగకపోవడంతో ఆదిలోనే పార్టీ వర్గాలు డీలా పడిపోయాయి. ముందు నుంచి ఉన్న వారిని కాదని వలస వచ్చిన నాయకుడికి బాధ్యతలు అప్పగించారంటూ సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘నియోజకవర్గంలో టీడీపీ నేల విడిచి సాము చేస్తోంది. పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా మోసిన వారిని కాదని, వలస నేతలకు రెడ్ కార్పెట్ వేసింది. నిన్నటి వరకు అధికారం అనుభవించి ఎన్నికలు సమీపిస్తుండగా కండువా మార్చిన వారికి నేడు ప్రాధాన్యమిస్తూ నమ్మిన వారిని నట్టేట ముంచడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని మరోసారి నిరూపితమైంది’. ఇదీ ఆత్మకూరు టీడీపీలో ప్రస్తుతం నడుస్తున్న అంతర్గత చర్చ. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా పార్టీకి దిక్కే లేదన్నట్లుగా వలస నేత ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా పార్టీ నాయకత్వం ఆహ్వానించి బాధ్యతలు అప్పగించడంపై అనేకమంది రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జెండా మోసిన నేతలు పాదయాత్రకు ముఖం చాటేశారు. మరికొందరు గత్యంతరం లేక అలా కనిపించి తప్పుకున్నారు.
ఎన్నికల వేళ తప్ప..
2014 ఎన్నికల సమయంలో పార్టీకి అభ్యర్థి కూడా దొరక్కపోవడంతో స్థానికంగా ఉన్న కన్నబాబే దిక్కయ్యాడు. ఓటమి తప్పదని భావించినా రంగంలోకి దిగి నష్టపోయాడు. 2019లో మరోసారి టికెట్ వస్తుందని భావించిన కన్నబాబుకు చుక్కెదురైంది. గతంలో కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లినేని కృష్ణయ్యను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన పారిశ్రామికవేత్త. ఎన్నికల వేళ తప్ప ఎప్పుడూ నియోజకవర్గంలో కనిపించడు. ఏనాడు పార్టీ కార్యకర్తలకు చేరువ కాలేదు. కన్నబాబును కాదని అధిష్టానం కృష్ణయ్యకు టికెట్ ఇచ్చింది. అందరూ అనుకున్నట్లుగానే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కనిపించలేదు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆనంకు ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు.
పర్యటన పేరుతో డుమ్మా
ఆనంను తెచ్చి కన్నబాబుకు ఈసారి కూడా మొండిచేయి చూపారు. కష్టపడిన వారిని పట్టించుకోవడంలేదనే భావనలో ఉన్న ఆయన లోకేశ్ పాదయాత్రకు ముఖం చాటేశాడు. విదేశీ పర్యటన పేరుతో డుమ్మా కొట్టాడు. అలాగే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు పరిస్థితి మరోలా ఉంది. గత నాలుగేళ్లుగా పార్టీ ఇన్‌చార్జిగా నియమించే సాహసం కూడా అధిష్టానం చేయలేకపోయింది. కన్నబాబు, కొమ్మి, బొల్లినేని, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి ఇన్‌చార్జి మీరేంటే మీరంటూ ఊరించారు. ఇప్పుడు ఆనంకు బాధ్యతలు అప్పగించడంతో ఆ నేతలకు చుక్కెదురైంది. టీడీపీలో నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారని ముందుగానే పసిగట్టిన బొమ్మిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేశారు. మిగిలిన ఆ ముగ్గురికి తమ పరిస్థితి ఏమిటో అర్థం కాక అయోమయంలో ఉన్నారు.
ఆత్మకూరులో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. మళ్లీ పచ్చజెండా రెపరెపలాడిన సందర్భం లేదు. బలమైన నాయకత్వం కరువైంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వలస నేతలు లేదా పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపడం.. వారిని ఓటమి వరించడం.. ఆపై మళ్లీ ఎన్నికలొచ్చే వరకు వారు ముఖం చాటేస్తున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుండడంతో స్థానికంగా పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతూనే ఉందని కార్యకర్తల భావన. ఇక్కడ బలమైన నేతలున్నా వారిని ఎన్నికల సమయంలో కరివేపాకుల్లా వాడుకుంటుండడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment