
చేపల వేటకు విరామం
● రేపట్నుంచి 61 రోజుల పాటు అమల్లో
● మత్స్యకార భృతిపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
● వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో
ఆపన్నహస్తం
కావలి: సముద్రంలో చేపల వేటకు 61 రోజుల విరామాన్ని పాటించనున్నారు. మంగళవారం నుంచి జూన్ 14 వరకు వేట నిషేధిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధన మేరకు సముద్ర జలాల్లో మెకనైజ్డ్, మోటార్ బోట్ల ద్వారా వేటను సాగించరాదు. వీటిని ఉల్లంఘిస్తే బోట్ల యజమానులు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం – 1994, సెక్షన్ (4) మేరకు శిక్షార్హులు కానున్నారు. వారి బోట్లు, అందులో ఉన్న మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని జరిమానా విధించనున్నారు.
ఒడ్డుకు చేరిన బోట్లు
వాస్తవానికి ఏడాదిగా సముద్రంలో చేపలు పడక మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు చేపల వేటపై నిషేధంతో జిల్లాలోని ఉలవపాడు, గుడ్లూరు, కావలి రూరల్, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూగూరు, ముత్తుకూరు మండలాల్లోని తీర గ్రామాల్లో ఉన్న బోట్లు ఒడ్డుకు చేరాయి. దీంతో తీర ప్రాంతాలు ప్రస్తుతం బోసిపోయాయి.
నిషేధం ఎందుకంటే..?
తొలుత నెల రోజులే ఉండే ఈ నిషేధాన్ని క్రమంగా పెంచారు. ఏపీ మైరెన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ – 1995 మేరకు సముద్రంలో చేపల వేటకు సంబంధించి పలు ఆదేశాలున్నాయి. ఈ చట్టం 1997 నుంచి ఆచరణలోకి రాగా, 2007 నుంచి అమలవుతోంది. వేసవిలో గుడ్లు పెట్టే దశలో వేట కారణంగా పునరుత్పత్తి పడిపోతుంది. దీంతో అరుదైన మత్స్య జాతులు కనుమరుగవుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటపై నిషేధాన్ని విధించడం ద్వారా, సముద్రజీవులు గుడ్లు పెట్టే సమయంలో ఎలాంటి ఆటంకం ఉండదు. తొలుత రాష్ట్రంలో మొదలైన దీన్ని తీర ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
మత్స్యకార భరోసాతో ఖుషీఖుషీ
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక వీరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని సంకల్పించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎగ్గొట్టిన బకాయిల చెల్లింపుతో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఆ సంవత్సరం మొదలుకొని 2023 వరకు దీన్ని దిగ్విజయంగా అమలు చేసి, మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు.
హామీ.. గాలి మూటేనా
గత ఎన్నికలకు ముందు హామీల వర్షాన్ని టీడీపీ కురిపించింది. మత్స్యకారులకు రూ.20 వేలను ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 12,444 మందికి రూ.20 వేల చొప్పున రూ.24.89 కోట్లను ఇవ్వాల్సి ఉంది. అయితే దీనిపై నేటికీ స్పష్టత లేదు. సాధారణంగా మత్స్యకార మహిళలు సముద్రం నుంచి వచ్చిన చేపలను మార్కెట్ చేసుకుంటూ పొట్ట నింపుకొంటారు. రెండు నెలల పాటు వేట లేకపోవడంతో వీరి ఉపాధికి గండిపడనుంది. హామీ మేరకు భృతిని మంజూరు చేసి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
సముద్రతీరం
110 కిలోమీటర్లు
మత్స్యకార కుటుంబాలు 1.5 లక్షలు
సముద్రంపై
ఆధారపడిన వారు
53,541 మంది
మెకనైజ్డ్ బోట్లు
2,950
మోటరైజ్డ్ బోట్లు
3,704
దీన స్థితిని పట్టించుకోవాలి
చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారుల దీన స్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలి. వేట విరామం జీవనోపాధికి పెద్ద సమస్యగా మారుతుంది. మేలో చేపలు బాగా పడతాయి. వర్షాలు ప్రారంభమయ్యాక పెద్దగా దొరకవు. వేట లేకపోవడం, మరో పనిరాకపోవడంతో రెండు నెలల పాటు ఖాళీగా గడపాల్సి ఉంటుంది.
– తిరుపతి, మత్స్యకారుడు, ఇస్కపల్లి, అల్లూరు మండలం
కుటుంబపోషణకు అవస్థ పడాలి
వేట జరిగితే ఎంతో కొంత దొరికిన చేపలను అమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటాం. ఆ సమయంలో మాకు చేతినిండా పని ఉంటుంది. వేటకు విరామ సమయంలో మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబ పోషణకు అవస్థలు తప్పవు.
– రత్నమ్మ, మత్స్యకార మహిళ,
తుమ్మలపెంట,
కావలి రూరల్ మండలం
భృతి మాటేమిటీ..!
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా అందించడంలేదు. 2014 – 19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తూతూమంత్రపు చర్యలు చేపట్టింది. ఆ సమయంలో తొలి రెండేళ్లు రూ.రెండు వేల చొప్పున, మూడు, నాలుగో సంవత్సరాల్లో రూ.నాలుగు వేలను ఇచ్చి చివర్లో విస్మరించింది.
జిల్లాలో ఇలా..

చేపల వేటకు విరామం