
నాగేంద్ర ఇన్‌ఫ్రాకు రెండు ఇసుక రీచ్‌లు
నెల్లూరు రూరల్: జిల్లాలోని విరువూరు, మినగల్లు ఇసుక రీచ్‌లను నాగేంద్ర ఇన్‌ఫ్రా దక్కించుకుంది. ఈ రెండు రీచ్‌లకు సంబంధించి టెండర్లు ఆహ్వానించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జేసీ కె.కార్తీక్ సమక్షంలో టెండర్లు ఓపెన్ చేశారు. విరువూరు ఇసుక రీచ్‌కు సంబంధించి రాఘవ ప్రాజెక్ట్స్, మిలీనియం సిల్ట్స్, నాగేంద్ర ఇన్‌ఫ్రా బిడ్స్ దాఖలు చేశాయి. రాఘవ ప్రాజెక్ట్స్ అర్హతలకు సంబంధించి సరైన పత్రాలు సమర్పించకపోవడంతో డిస్ క్వాలిఫై అయింది. ఇక మిలీనియం సిల్ట్స్, నాగేంద్ర ఇన్‌ఫ్రా క్యూబిక్ మీటర్‌కు రూ.25 వంతునే దాఖలు చేశాయి. అయితే ఈ టెండర్ నుంచి మిలీనియం సిల్ట్స్ తప్పుకోవడంతో నాగేంద్ర ఇన్‌ఫ్రా బిడ్‌ను ఖరారు చేశారు.
● మినగల్లు రీచ్‌కు సంబంధించి రాఘవ ప్రాజెక్ట్స్, రాజేశ్వరి శాండ్, ఎం.శ్రీహరి, నాగేంద్ర ఇన్‌ఫ్రా తరఫున నాలుగు టెండర్లు దాఖలు అయ్యాయి. అయితే రాఘవ ప్రాజెక్ట్స్, రాజేశ్వరి శాండ్ బిడ్స్ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పాయి. ఎం.శ్రీహరి క్యూబిక్ మీటర్‌కు రూ.12.75లకు బిడ్ దాఖలు చేయగా, నాగేంద్ర ఇన్‌ఫ్రా రూ.25లకు బిడ్ వేసింది. కానీ ఎం. శ్రీహరి కూడా టెండర్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ రీచ్ కూడా నాగేంద్ర ఇన్‌ఫ్రాకే ఖరారైంది.
అంతా సిండికేట్ మాయ
విరువూరు, మినగల్లు రీచ్‌ల్లో ఇసుక తవ్వకానికి సంబంధించి టెండర్లు దాఖలు చేయడం, మధ్య లో అర్ధాంతరంగా తప్పుకోవడం చూస్తే ఇదంతా సిండికేట్ మాయగా కనిపిస్తోంది. ఒక సంస్థకే ప్రాజెక్ట్ కట్టబెడితే ఆరోపణలు వచ్చే అవకాశం ఉండడంతో డమ్మీ టెండర్లు దాఖలు చేయించడం, చివరకు టెండర్ ప్రక్రియ నుంచి తప్పుకోవడంతో బిడ్స్ పాల్గొన్న సంస్థకే కట్టబెట్టడం అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.