
కక్ష సాధింపులను సహించం
● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
వెంకటగిరి (సైదాపురం): వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, సైదాపురం, రాపూరు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు కల్యాణి, వహీదా, సుకన్య, ఆరంబాకం శ్రీనివాసులు, ఆరి శంకరయ్య, బాలాయపల్లి, డక్కిలి, సైదాపురం మండల కన్వీనర్లు వెందోటి మధుసూదన్‌రెడ్డి, మన్నారపు రవికుమార్‌యాదవ్, చింతల శ్రీనివాసులరెడ్డి, నేతలు పూజారి శ్రీనివాసులు, మల్లిరెడ్డి, పేచిరాజ్, అల్లంసాయి, యస్దానీబాషా పాల్గొన్నారు.
నేడు వెల్లంపల్లి బోర్డుకు వైవీ సుబ్బారెడ్డి
మద్దిపాడు: గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి వెల్లంపల్లి పొగాకు బోర్డును బుధవారం సందర్శించనున్నారు. ఆయనతోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పలువురు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు హాజరు కానున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
రాపూరు: ఆర్టీసీలో ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాపూరు డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి రమణయ్య డిమాండ్ చేశారు. రెండో రోజు మంగళవారం ఆర్టీసీ డిపో ఎదుట ఆ యూనియన్ కార్మికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, గ్యారేజ్ కార్యదర్శి సుధాకర్, వెల్డర్ శ్రీధర్, కార్మికులు శాంసన్, పెంచలయ్య, రమణయ్య, మొసే పాల్గొన్నారు.

కక్ష సాధింపులను సహించం