టీడీపీలో టికెట్ల ఆట మొదలైంది. నేతలు ఆయా నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులమంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారని, తనని కాదని మరొకరికి ఇవ్వరని చెబుతుండడం గమనార్హం. నేతల సంగతి అటుంచితే కేడర్ మాత్రం టికెట్ ఎవరికిస్తారో అర్థంకాక అయోమయ స్థితిలో ఉన్నారు. ఏ నాయకుడి వద్దకు వెళితే మిగిలిన వారు ఏమనుకుంటారోనని అందరికీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానున్న నేపథ్యంలో టీడీపీ ఇంకా తమ అభ్యర్థులపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే టికెట్లు ఆశిస్తున్న వారు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గెలుపు ధీమా లేకపోయినప్పటికీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈ దఫా దండిగా పార్టీ ఫండ్‌తోపాటు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసే వారికే టికెట్ ఇస్తామంటోందని సమాచారం. పైకం తూకంతోనే టికెట్ల కేటాయింపులు ఉంటాయన్న సంకేతంతో ఉదయగిరి టీడీపీలో అలజడి రేగుతోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు సాయపడుతున్న తనకే టికెట్ ఖాయం అంటూ ధీమాగా చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాగా నాలుగైదు రోజులుగా ఉదయగిరి టికెట్ ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కే ఓకే అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాను ఇప్పటికే లోకేశ్‌కు డబ్బు సంచులు అందించానని, టికెట్ తనకే అంటూ ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్ బాహాటంగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇందులో నిజం ఉంటుందని పార్టీ కేడర్ కూడా బలంగా విశ్వసిస్తోంది. మరి ఆ ఇద్దరి పరిస్థితి అలా ఉంటే వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకే టికెట్ అని చెబుతుందగా, బీసీ సామాజికవర్గం నుంచి ఈ దఫా తనకే టికెట్ వస్తుందంటూ బీసీ నేత చెంచలబాబు కూడా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
డబ్బుకే ప్రాధాన్యమా..
రానున్న ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కే అవకాశం ఉంటుందని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కాకర్లకు లోకేశ్‌తో సన్నిహిత సంబంధాలతోపాటు ఆశీస్సులు కూడా ఉన్నట్లు సమాచారం. కాకర్ల విదేశాల్లో తనకున్న పరిచయాలతో పార్టీ ఫండ్ కోసం భారీగా వసూలు చేసి ఇచ్చాడనే ప్రచారం ఉంది. ఇప్పటికే లోకేశ్ వద్ద హామీ కూడా పొందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. లోకేశ్ హామీతోనే సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నానంటూ కాకర్ల బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా అధిష్టానం తనకే టికెట్ ఓకే చేసిందంటూ ప్రచారం ప్రారంభించడంతోపాటు చినబాబు లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా వింజమూరు ప్రాంతంలో భారీగా కార్యకర్తలను పోగేసి విందు ఇచ్చారని తెలుస్తోంది. టికెట్ నాదేనంటూ సందేశమిచ్చి తనకు సాయం చేయాలని కోరడంతో ఇప్పుడు ఉదయగిరి టీడీపీలో టికెట్ల లొల్లి కాక పుట్టిస్తోంది.
కాకర్లది కాకమ్మ కబుర్లేనా..
టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాత్రం సీటు తనదేనంటూ స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు కేసుల విషయంలో తాను ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి సాయం చేశానని చెబుతుండడం గమనార్హం. లోకేశ్‌ను తన పలుకుబడితోనే బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లానని, తన సత్తా ఏంటో చినబాబుకు తెలుసునని చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బుల మూటలతో వస్తే కాకర్లకు సీటు ఇస్తారా అంటూ బొల్లినేని బహిరంగంగానే చెబుతున్నారు. కాకర్లదంతా కాకమ్మ కబుర్లేనంటూ బహిరంగ సమావేశంలోనే చెప్పడం గమనార్హం. గతంలో లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా ఉదయగిరి దరిదాపుల్లో కూడా కాకర్లను రానివ్వకుండా చేశానని చెబుతున్నట్లు తెలుస్తోంది. తనను కాదని కాకర్లకు సీటు ఇచ్చే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేరని బొల్లినేని చెబుతున్నట్లు సమాచారం.
అయోమయంలో కేడర్
ఉదయగిరి టీడీపీలో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. దీంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓవైపు బొల్లినేని, కాకర్ల ఉదయగిరి టికెట్ తమదేనంటూ ప్రచారం చేసుకొంటుండగా, మరోవైపు వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకు హామీ ఇవ్వడంతోనే పార్టీలోకి వచ్చానని చెబుతున్నారు. చివరకు తనకే టికెట్ ఇస్తారని, ప్రత్యర్థిగా తన సోదరుడే ఉంటారని, అందుకోసమైనా టికెట్ తనకే కేటాయిస్తారంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పి.చెంచలబాబుయాదవ్ ఈ ప్రాంతంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారని, బీసీ కేటగిరీలో తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. టీడీపీ కేడర్ ఆ నలుగురు నేతల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయోమయంలో ఉన్న కేడర్ ప్రస్తుతం ఎవరి వద్దకు వెళితే ఎవరు ఏమనుకుంటారోనని నేతలకు దూర దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment