పెన్నాను కుళ్లబొడుస్తూ..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుకను భారీ యంత్రాలతో తోడేస్తుండటంతో పెన్నానది ఓపెన్ కాస్ట్ మైన్లను తలపిస్తోంది. ఎక్కడికక్కడ సుమారు 20 అడుగుల మేర లోతులో తవ్వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు సోమశిల జలాశయానికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ, జలసంరక్షకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగురాయపురం, రాజుపాళెం రీచ్‌ల నుంచి నిత్యం 200కుపైగా వాహనాల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోందని తెలుస్తోంది. దీన్ని తమిళనాడు, బెంగళూరుతో పాటు ప్రకాశం జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
దుర్భరంగా రహదారులు
తెలుగురాయపురం అనధికార రీచ్ నుంచి భారీ వాహనాలతో ఇసుకను అక్రమార్కులు తరలిస్తుండటంతో ఆ ప్రాంత రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఒక్కో టిప్పర్ సామర్థ్యం 40 టన్నులైతే.. దాదాపు 60 టన్నుల మేర తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రహదారులన్నీ సింగిల్ రోడ్లు కావడంతో భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్నాయి.
కూలిన వంతెన
తాజాగా తెలుగురాయపురం నుంచి కలువాయి మీదుగా లోడ్‌తో వెళ్లే వాహన ధాటికి నూకనపల్లి వద్ద వంతెన కూలిపోయింది. మొత్తం 57 టన్నుల బరువు గల వాహనం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా తెలుగురాయపురం, నూకనపల్లి, కొలవపల్లి, ఇస్కపల్లి గ్రామాల మధ్య సుమారు ఆరు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో ప్రైవేట్ స్కూల్‌కు విద్యార్థులు శనివారం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాహనం నిలిచిపోవడంతో ఎండలోనే కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లారు. స్థానికులే వంతెనకు ఇసుక వేసి తాత్కాలికంగా రాకపోకలకు మార్గం చేసుకున్నారు.
అధికారుల పరిశీలన
నూకనపల్లి వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో సంబంధిత ఆర్ అండ్ బీ ఈఈ మురళి, జేఈ జ్ఞానేశ్‌తో పాటు మైనింగ్ ఆర్‌ఐ స్వాతి, ఎస్సై సుమన్ పరిశీలించారు. భారీ వాహనాల రాకపోకలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ప్రమేయంతో ఇసుకాసురులు బరితెగించి అక్రమ రవాణా చేస్తున్నా, పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహంతో రగలిపోయారు. అప్పటికే అధికారులపై రాజకీయ ఒత్తిడి రావడంతో అక్కడి నుంచి జారుకున్నారు. వంతెన కూలిన విషయమై ఆర్ అండ్ బీ ఈఈ మాట్లాడుతూ.. నూతన రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు.
కలువాయి మండలంలోని రాజుపాళెం, తెలుగురాయపురంలో ఇసుక తోడేళ్లు.. పెన్నానదిని చెరపట్టి తోడేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అక్రమార్కులు రాత్రీ పగలనే తేడా లేకుండా పర్యావరణానికి తూట్లు పొడుస్తూ యంత్రాలతో తీరాన్ని కుళ్లబొడుస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు ఛిద్రమవుతున్నాయి. పరిసర గ్రామాల ప్రజలకు ఈ రహదారుల్లో ప్రయాణం నరకాన్ని చూపిస్తోంది.
విధ్వంసం సృష్టిస్తున్న ఇసుక తోడేళ్లు
మైన్లను తలపిస్తున్న నదీ తీరం
నూకనపల్లి వద్ద వాహనాల
తాకిడితో కూలిన బ్రిడ్జి
ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న మాఫియా
రాజుపాళెం, తెలుగురాయపురంలో తమ్ముళ్ల బరితెగింపు
పెన్నాను కుళ్లబొడుస్తూ..


