కావలి ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరిపై యుద్ధం చేస్తా
కావ్య వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం
చంద్రబాబు, లోకేశ్‌కు టీడీపీ రాష్ట్ర
ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు విజ్ఞప్తి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఏకపక్ష వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై ఇకనుంచి ప్రత్యక్ష యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను. టీడీపీ నీది కాదని నన్ను అనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. టీడీపీ కోసం పని చేస్తే నాపై 16 కేసులు పెట్టించారు. ఇప్పుడు కొత్తగా నాపై వంద కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడను. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను.
ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట తప్పి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఘోరాలపై పార్టీ అధిష్టానం విచారణ కమిటీ నియమించి నిజాలను గుర్తించాలి’ అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తన నివాసంలో కార్యకర్తలతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అవలంబిస్తున్న వివాదాస్పదమైన, ఘర్షణ పూరిత విధానాలపై ధ్వజమెత్తారు.
చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వీధుల్లో టాపాసులు కాల్చి సంబరాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు టీడీపీలో పెత్తనం చేస్తున్నారని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడినే అడుగుతున్నా.. అసలు టీడీపీ ఎటు పోతోంది? ఏమి జరుగుతుంది? కడుపు రగిలిపోతుంది. పార్టీ ఏమవుతోందో అర్థం కావడం లేదన్నారు. నీతి నిజాయతీతో రాజకీయాలు చేయాలే కాని, లాలూచీ రాజకీయాలు చేస్తే ఊరుకోను. కావలిలో టీడీపీకి ఏమీ లేదు అనే రోజుల్లో పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేశానన్నారు. టీడీపీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానన్నారు.
పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు నుంచి చంద్రబాబు సభలు, లోకేశ్ యువగళం ఆరు రోజుల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించడంలో తాను ఎంతో కష్టపడ్డానన్నారు. దుగ్గిరాల కరుణాకర్ అనే యువకుడు చనిపోతే రూ.20 లక్షలు టీడీపీ తరఫున అతని కుటుంబ సభ్యులకు తాను సహాయం అందజేశానన్నారు. నోరుందని నిందలు వేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం కాదని, నిరూపించాలని సవాల్ విసిరారు. టీడీపీలోకి రకరకాల వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ తాను మాత్రం టీడీపీనే అన్నారు. ఇక నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండేందుకు క్రియాశీలకంగా ఉంటానన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బుచ్చిరెడ్డిపాళెం– దగదర్తి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు మళ్లీ రెండోసారి శంకుస్థాపన అంటూ హడావుడిగా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment