జిల్లాలో ఇదీ పరిస్థితి
నెల్లూరు(అర్బన్): వేడిగాలులతో జిల్లా ఉడికి పోతోంది. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటనలో తెలియజేశారు. లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శనివారం జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత వేడి సాధారణంగా మే నెలలో నమోదవుతుంటుంది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే 41 డిగ్రీలకు ఎండలు చేరడంతో మే నెల వస్తే ఇంకెంత సెగ తగులుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. మండే ఎండలకు ప్రజలు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. ఉదయం 11 గంటలకే రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. వైద్యశాఖాధికారులు, జిల్లా అధికారులు కూడా ఉదయం ప్రజలు తమ పనులు చూసుకుని 11 గంటలలోపు ఇళ్లకు చేరాలని సూచిస్తున్నారు. సాయంకాలం 4 గంటల తర్వాతనే బయటకు రావాలని పేర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితే ప్రజలు గొడుగులు వేసుకుని బయటకు రావాలని పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల మరిన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా మంచినీరు, నిమ్మరసం, పండ్లరసాలు, పలుచటి మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు. శీతల పానీయాల జోలికి వెళ్లవద్దంటున్నారు.
తేదీ ఉష్ణోగ్రత
7 38.0
8 36.6
9 36.1
10 38.4
11 37.8
12 41.0
13 38.9
సుర్రుమంటున్న సూరీడు
మే నెల రాకముందే తీవ్ర ఎండలు
వేడిగాలులు, ఉక్కపోత
బయటకు రావాలంటే
జంకుతున్న జనం
జిల్లాలో ఇదీ పరిస్థితి


