
టీవీ మెకానిక్ కుమారుడికి అత్యధిక మార్కులు
పొదలకూరు: పొదలకూరు పట్టణానికి చెందిన టీవీ మెకానిక్ కొడుకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మంచి మార్కులు సాధించాడు. పట్టణంలోని బుడేసాహెబ్ వీధిలో నివసిస్తున్న యజ్ధానీబాషా టీవీలను రిపేర్లు చేస్తుంటారు. ఈయనకు ఇద్దరు కుమారులు. వారిలో తన్వీర్ బాషా ఎంపీసీ గ్రూపులో 1000కు 992 మార్కులు సాధించాడు. తన్వీర్ బాషా నెల్లూరు నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌లో విజేతగా నిలిచి పేదల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపాడు.
పెండింగ్ బకాయిల కోసం
పోరుబాట
నెల్లూరు(అర్బన్): అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను జేఏసీ ఆధ్వర్యంలో సాధించుకునేందుకు పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఎన్‌జీఓ అసోసియేషన్ భవన్‌నందు ఆ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన చంద్రశేఖర్ మాట్లాడుతూ పని భారాన్ని తగ్గించేందుకు ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంఘం నాయకులు, ఉద్యోగులు జేఏసీ నాయకులతో కలిసి సమన్వయం చేసుకుంటూ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ మన్నేపల్లి పెంచలరావు మాట్లాడారు. జిల్లా కార్యదర్శి గాదిరాజు రామకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడు నందిమండలం ఆంజనేయవర్మ, నగర అధ్యక్షుడు చిలకా రామకృష్ణారెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు సందీప్ చక్రవర్తి, సాగర్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీఎస్ సాయిరాం, ప్రధాన కార్యదర్శి సుబ్బనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీచ్ వాలీబాల్ పోటీల్లో
జిల్లా జట్టుకు 3వ స్థానం
నెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలలో నెల్లూరు జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి 3వ స్థానం సాధించింది. దీంతో జట్టుకు కప్పు, రూ.5వేలు నగదు బహుమతిని అందజేశారు. ఈ పోటీలలో మొత్తం 13 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. అనంతపురం జిల్లా మొదటిస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా రెండవ స్థానం గెలుచుకున్నాయి. విజేతలకు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు చేతుల మీదుగా ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.
నేటి పీజీఆర్‌ఎస్ రద్దు
నెల్లూరు(క్రైమ్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉమేష్‌చంద్ర కాన్ఫెరెన్స్ హాలులో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
ఈదురు గాలులతో వర్షం
దుత్తలూరు: దుత్తలూరు మండలంలోని పలు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు వీచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఏలూరు, కావలి, ఆత్మకూరు డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడిన ప్రజలకు ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరులో పలు చోట్ల గాలులకు హోర్డింగులు ఊడిపడ్డాయి.

టీవీ మెకానిక్ కుమారుడికి అత్యధిక మార్కులు

టీవీ మెకానిక్ కుమారుడికి అత్యధిక మార్కులు