
సమస్యల పరిష్కారం కోసం పోరాటం
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఆప్కాస్ ఉద్యోగులు, కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించారు. తెల్లవారు జామున 5.30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్లకార్డులు, సీఐటీయూ జెండాలు చేతపట్టి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. పోలీసుల జోక్యంతో అడిషనల్ కమిషనర్ నందన్ కార్యాలయానికి చేరుకుని యూనియన్ నాయకులు, కార్మికులతో చర్చించారు. అనంతరం కమిషనర్ సూర్యతేజతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించేందుకు నెలరోజులు గడువు ఇవ్వాలని అధికారులు కోరారు. దీంతో నాయకులు, కార్మికులకు ఆందోళనను విరమించారు.
● ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షుడు, సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పలు దఫాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 60 సంవత్సరాల వయసు నిండిందంటూ 93 మంది కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఏ రకమైన సమాచారం లేకుండా పనిలో నుంచి ఆపేయడం సరైన చర్య కాదన్నారు. చనిపోయిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. దుస్తులు, సబ్బులు నూనె, చెప్పులు కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు పూడికలు తీయడం, ట్రాక్టర్లకు ఎక్కించడం లాంటి పనులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ వర్తించని కార్మికులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికై నా చర్యలు తీసుకోకపోతే నిరవధిక ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, సీఐటీయూ నెల్లూరు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, రూరల్ కార్యదర్శి కె.పెంచలనరసయ్య, రాష్ట్ర నాయకులు పి.సూర్యనారాయణ, మాలకొండయ్య, సుధాకర్, మహిళా సంఘం నాయకులు షేక్ మస్తాన్‌బీ, కత్తి పద్మ, షేక్ షంషాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అశోక్, మట్టిపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
విధులు బహిష్కరించిన ఉద్యోగులు, కార్మికులు
ఎన్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా
కమిషనర్ హామీతో విరమణ