ముస్లింల ద్రోహి చంద్రబాబు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘వక్ఫ్ సవరణ చట్టం విషయంలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సీఎం చంద్రబాబు ముస్లింలను నిలువునా ముంచారు. ఆయన ముస్లింల ద్రోహి’ అని వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్‌ఖాన్ అన్నారు. మంగళవారం నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమీర్‌ఖాన్ మాట్లాడుతూ అబద్ధపు హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ముస్లింలను వెన్నుపోటు పొడిచాడన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ముస్లింలందరూ గమనిస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్‌తోపాటు ఏ ఒక్క నాయకుడు కూడా ముస్లింలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడం దురదృష్టకరమన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని అజీజ్ ముస్లింల అండతో తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప వారి కోసం పాటుపడిన దాఖలాల్లేవన్నారు. ముస్లిం నాయకులు నిజాయితీగా రాజీనామాలు చేసి ఉంటే చంద్రబాబు వెనక్కి తగ్గేవాడని తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. అందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు జగనన్నకు రుణపడి ఉన్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ముస్లిం, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హంజా హుస్సేనీ మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు వేసిన ప్రజలకు అన్యాయం చేయడం దురదృష్టకరమన్నారు. ముస్లిం ఆస్తులను దోచే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆపగల శక్తి ఉన్నా చంద్రబాబు అలా చేయలేదన్నారు. ఆయన్ను ముస్లిం సమాజం క్షమించదన్నారు. సమావేశంలో జిల్లా ముస్లిం, మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ సిద్ధిఖ్, కార్పొరేటర్ సత్తార్, షాకీర్‌బాబా, రజాక్ తదితరులు పాల్గొన్నారు.


