
‘చాలా సంతోషంగా ఉంది’
నెల్లూరు(లీగల్): ‘ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కేసుల పరిష్కారంలో సహకారం అందించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు’ అని బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని, ఆరో అదనపు జిల్లా (ఫ్యామిలీ) కోర్టు న్యాయమూర్తి వెంకట నాగపవన్ తెలిపారు. మంగళవారం వారు జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయన్ని సందర్శించారు. న్యాయవాదులతో మాట్లాడారు. కార్యక్రమంలో పలు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఉమ మహేశ్వర్‌రెడ్డి, సుందరయ్య యాదవ్, జాయింట్ సెక్రటరీ వరప్రసాద్‌రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జనావాసాల్లోకి జింక
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలో మంగళవారం జింక ప్రత్యక్షమైంది. వేసవి నేపథ్యంలో దాహార్తి తీర్చుకునేందుకు జనవాసాల్లోకి వచ్చింది. ఓ థియేటర్‌లోకి వెళ్లగా అక్కడి సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బీట్ ఆఫీసర్ పెంచలయ్య జింకను పట్టుకున్నారు. దానిని అడవిలో వదిలి పెడతామని ఆయన వెల్లడించారు.
నేటి నుంచి క్రికెట్ పోటీలు
నెల్లూరు(అర్బన్): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ పురుషుల క్రికెట్ పోటీలు బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు నారాయణ వైద్యసంస్థల ప్రాంగణంలో జరుగుతాయని నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని కళాశాలలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 38 మెడికల్, డెంటల్ కళాశాలలకు చెందిన సుమారు 800 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈనెల 20వ తేదీన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. సమావేశంలో వైద్య విద్యాసంస్థల కో–ఆర్డినేటర్ డాక్టర్ బిజూ రవీంద్రన్, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ స్కంద గోపాలకృష్ణ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెల్వి బాబు తదితరులు పాల్గొన్నారు.

‘చాలా సంతోషంగా ఉంది’

‘చాలా సంతోషంగా ఉంది’