
జీవితాలను అర్ధాంతరంగా ముగించి..
ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరో యువతి ఎన్నో ఆశలతో వివాహం చేసుకుని సొంతూరిని విడిచి భర్తతో నెల్లూరుకు వచ్చింది. అయితే వివిధ కారణాలతో ఇద్దరూ జీవితాలను అర్ధాంతరంగా ముగించారు. కులం తక్కువదానివంటూ అత్తింటి వారు అవమానించడంతో ఒకరు, భర్తతో విభేదాల నేపథ్యంలో
మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
● అత్తింటి అవమానాలు తట్టుకోలేక..
నెల్లూరు సిటీ: వారిద్దరి మతాలు వేరు. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కులం తక్కువంటూ అత్తింటి వారు యువతిని అవమానించసాగారు. దీంతో వివాహమై ఏడునెలలు గడవకముందే మనస్తాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముదివర్తిపాళేనికి చెందిన ఎం.స్మైలీ (23) అనే దళిత యువతి నెల్లూరులోని ఓ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఇందుకూరుపేటకు చెందిన నాగూర్‌బాబు, స్మైలీ ప్రేమించుకున్నారు. మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడో మైల్లో ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా నాగూర్‌బాబు కుటుంబ సభ్యులు తక్కువ కులానికి చెందినదంటూ స్మైలీని అవమానిస్తూ వచ్చారు. ఆమె భరిస్తూ వచ్చింది. అయితే వేధింపులు అధికం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్మైలీ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటికి సమీపంలోని వారు తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూశారు. స్మైలీ ఉరేసుకుని కనిపించగా నాగూర్‌బాబుకు సమాచారమిచ్చారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రూరల్ తహసీల్దార్ లాజరస్, రూరల్ సీఐ వేణు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్మైలీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.