నాణ్యతలేక నిలువునా చీలింది | - | Sakshi
Sakshi News home page

నాణ్యతలేక నిలువునా చీలింది

Apr 14 2025 12:25 AM | Updated on Apr 14 2025 12:25 AM

నాణ్య

నాణ్యతలేక నిలువునా చీలింది

రోడ్డుపై రోడ్డేశారు

ఉదయగిరి: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. సొంత పార్టీ నేతల కడుపు నింపేందుకు కూటమి ప్రభుత్వం పచ్చ బాటేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను తమ్ముళ్లకు పంచడమే లక్ష్యంగా పల్లెల్లో సీసీరోడ్లు వేసేందుకు కోట్లాది రూపాయల నిధులు కట్టబెట్టింది. ఇదే అదనుగా వారు అధికారుల అండతో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి పనులను తూతూమంత్రంగా చేపడుతూ నిధులను స్వాహా చేస్తున్నారు.

దోపిడీ ఇలా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీరోడ్ల నిర్మాణం పేరుతో ఉపాధి నిధులు కొల్లగొట్టేందుకు టీడీపీ నేతలు వ్యూహం రచించారు. పల్లె పండగ పేరుతో గతేడాది అగస్టులో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి తెలుగు తమ్ముళ్లకు పనులు కట్టబెట్టారు. అక్టోబరులో పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం నాణ్యతకు నీళ్లొదిలి నామమాత్రంగా పనులు చేపట్టి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచేశారు.

నాణ్యత ప్రశ్నార్థకం

జిల్లాలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద సామగ్రి పనులకు రూ.160 కోట్లు మంజూరయ్యాయి. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గానికి 435 పనులకు గాను రూ.26.57 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 422 పనులను పూర్తిచేసి రూ.25.81 కోట్ల చెల్లింపులు చేశారు. నియోజకవర్గంలో జరిగిన సీసీరోడ్డు పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించింది. పెన్నానది ఇసుకను ఉపయోగించి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా స్థానికంగా వాగులు, వంకల్లోని మట్టితో కూడిన ఇసుకను వాడారు. సిమెంట్‌ను ప్రమాణాల మేరకు ఉపయోగించలేదు. క్యూరింగ్‌ను సైతం సక్రమంగా చేపట్టలేదు. పనులపైన ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేదు. దీంతో నాణ్యత లోపంతో ముణ్నాళ్లకే రోడ్లపై పగుళ్లు రావడం కనిపించింది.

ఇష్టారాజ్యంగా పనులు

సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, వింజమూరు మండలాలకు సంబంధించి వింజమూరు పంచాయతీరాజ్‌ ఏఈ తిరుమలయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మండలాల్లో జరిగిన సీసీరోడ్ల పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ మండలాల్లో పనులు ఒకచోట మంజూరు చేయగా మరోచోట పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ లేఅవుట్లు, జనావాసాలు లేని ప్రాంతాల్లో రోడ్లు వేయడం, గతంలో వేసిన సీసీరోడ్ల పైనే మళ్లీ వేయడం వంటి ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఏఈ పర్యవేక్షణ లేకుండా పనులు జరిగినా, ఎంబుక్‌ చేసేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. ఆ సమయంలో అక్రమాలు బయటపడతాయి. సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించినా ఎంబుక్‌ చేసి నిధులు స్వాహా చేయడం వెనుక ఇంజనీరింగ్‌ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ కాంట్రోల్‌ అధికారులు నమూనాలు తీసి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వక ముందే బిల్లులు పెట్టారనే ఆరోపణలు కూడా ఏఈ తిరుమలయ్యపై ఉన్నాయి. ఈ పనులను స్వయంగా చూసి చెక్‌ మెజర్‌ చేయాల్సిన డీఈ గుడ్డిగా బిల్లులు ఎలా పాస్‌ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. జలదంకి, కొండాపురం మండలాల పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వాణి పేరుకే ఇంజనీర్‌ అయినప్పటికి, ఆమె భర్త అన్నీ తానై వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.

విజిలెన్స్‌ విచారణతో వాస్తవాలు

ఉదయగిరి నియోజకవర్గంలో సీసీరోడ్లు పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే విజిలెన్స్‌ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. అప్పడే రోడ్ల నిర్మాణంలో డొల్లతనం బయటపడుతుంది. కోట్లాది రూపాయల ఉపాధి నిధులతో చేపట్టే పనుల్లోని అక్రమాలను కొంతమేర అరికట్టవచ్చు.

సిమెంట్‌ రోడ్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు

నాణ్యతకు తిలోదకాలు

టీడీపీ నేతల జేబుల్లోకి ప్రజాధనం

అధికారుల అండదండలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న సీసీరోడ్డును జలదంకి మండలం కొత్తపాళెం గ్రామంలో రైసుమిల్లు నుంచి బోడగుడిపాడు వరకు రూ.10 లక్షల అంచనా వ్యయంతో 260 మీటర్ల మేర నిర్మించారు. ఫిబ్రవరిలో రోడ్డును నిర్మించగా రెండు నెలలు కూడా పూర్తికాక ముందే నాణ్యత లోపంతో సుమారు 30 మీటర్ల మేర మధ్యలో నిట్టనిలువుగా పగిలిపోయింది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డును దుత్తలూరు మండలం నర్రవాడ పొలాల్లోకి వెళ్లే మార్గంలో నిర్మించారు. ఉపాధి నిధులు సుమారు రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. నిబంధనల ప్రకారం జనావాసాలు ఉన్న చోట రోడ్డు వేయాలి. కానీ అందుకు భిన్నంగా పొలాల్లోకి వెళ్లే మార్గంలో గ్రామదేవత గుడి వరకు తూతూ మంత్రంగా రోడ్డును నిర్మించారు. ఏదైనా గ్రామంలో సీసీరోడ్లు వేసేందుకు అవకాశం లేకపోతే ప్రజలకు ఉపయోగపడే వేరే పనులు చేపట్టే అవకాశం ఉంది. కానీ ఊరు బయట ఎలా రోడ్డు వేసినా అడిగేవారు ఉండరనే ఉద్దేశంతో నాసిరకంగా నిర్మించి నిధులు స్వాహా చేశారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న సీసీరోడ్డు దుత్తలూరు మండలం నందిపాడు బీసీ కాలనీలోనిది. గత ప్రభుత్వ హయాంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో 125 మీటర్ల మేర రోడ్డును నిర్మించారు. ఇటీవల దానిపైనే టీడీపీ నాయకులు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో మళ్లీ రోడ్డు వేశారు. గతంలో రోడ్డు వేసి కనీసం నాలుగేళ్లు కూడా పూర్తి కాలేదు. రోడ్డు ఎక్కడా కూడా దెబ్బతినలేదు. అదే రోడ్డుపై రూ.5 లక్షల వ్యయం చేసి మళ్లీ తూతూ మంత్రంగా రోడ్డు వేసి నిధులు కాజేశారు.

విచారణ చేపట్టి చర్యలు

నియోజకవర్గంలో జరిగిన సీసీ రోడ్లు పనులకు సంబంధిచి అవినీతి అక్రమాలు జరిగి ఉంటే విచారణ చేసి సంబంధిత అఽధికారులపై చర్యలు తీసుకుంటాం. ఉదయగిరిలో ఏఈలు కొరత ఉన్నందున ఎక్కువ మండలాలకు ఒకే ఏఈకి అదనపు బాధ్యతలు ఇవ్వాల్సి వచ్చింది. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగినా తగిన చర్యలు తీసుకుంటాం. – పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ

నాణ్యతలేక నిలువునా చీలింది 
1
1/6

నాణ్యతలేక నిలువునా చీలింది

నాణ్యతలేక నిలువునా చీలింది 
2
2/6

నాణ్యతలేక నిలువునా చీలింది

నాణ్యతలేక నిలువునా చీలింది 
3
3/6

నాణ్యతలేక నిలువునా చీలింది

నాణ్యతలేక నిలువునా చీలింది 
4
4/6

నాణ్యతలేక నిలువునా చీలింది

నాణ్యతలేక నిలువునా చీలింది 
5
5/6

నాణ్యతలేక నిలువునా చీలింది

నాణ్యతలేక నిలువునా చీలింది 
6
6/6

నాణ్యతలేక నిలువునా చీలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement