టీడీపీ కండువా కప్పుకోకుండానే యువగళం యాత్రలో హడావుడి చేసిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం మౌనం దాల్చడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పునర్జన్మనిచ్చిన వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచిన ఆనంకు టీడీపీ రాచబాట వేసినా కాలం కలిసి రావడం లేదు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఒకప్పుడు ఆనం రామనారాయణరెడ్డి ఓ వెలుగు వెలిగినా మారిన రాజకీయ పరిస్థితులతో ఆయనకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఆనం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు. అప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ ఆనంను టేకెటీజీగా తీసుకుంది. పార్టీలో చేరే ముందు ఇచ్చిన ఒక్కహామీని నెరవేర్చలేదు. సీనియర్ నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఆత్మకూరులో పార్టీ ఇన్‌చార్జిగా కూడా నియమించలేదు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆనంను అక్కున చేర్చుకుని వెంకటగిరి ఎమ్మెల్యేగా హోదా ఇచ్చింది. అక్కున చేర్చుకున్న పార్టీకే వెన్నుపోటు పొడిచి ఆనం మళ్లీ టీడీపీలోకి వెళ్లడంతో ఆయనకున్న ఇమేజ్ సొంత క్యాడర్‌లోనే దెబ్బతింది.
అయోమయంలో ఆనం
ఆత్మకూరుపై మోజు పెట్టుకున్న ఆనంకు అన్నింటా అపశకునాలే ఎదురవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఆత్మకూరులోకి ఆయన రీఎంట్రీ ఇచ్చినా యాత్రను విజయవంతం చేయడంలో విఫలమయ్యారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన సీనియర్ నేత గూటూరు కన్నబాబును పాదయాత్రలోకి ఎంట్రీ ఇవ్వకుండా చేయించారు. అదే రీతిలో మరో సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును ఘోరంగా అవమానించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఆనం ప్రవేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్నప్పటికీ ఆనం కోసం పనిచేసేది లేదని తెగేసి చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కి వచ్చి క్యాడర్‌ను ముప్పుతిప్పలు పెట్టి వెళ్లిపోయిన వ్యక్తికి మరోసారి ప్రవేశానికి ఎలా గ్రీన్‌సిగ్నల్ ఇస్తారంటూ కన్నబాబు తన అనుచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం ఉంది.
సొంత సర్వేల్లోనూ నిరాశే
ఆనం టీడీపీ పక్షం వహించాక రెండు టీములతో సొంత సర్వే చేయిస్తున్నారని సమాచారం. తనతో పాటు తన కుమార్తె కై వల్యారెడ్డి ఏదోక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు ఎలా ఉంటుందన్న అంశంపై సర్వే చేయిస్తుండగా, అధికారం కోసం పార్టీలు మారుతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె కై వల్యారెడ్డి అభ్యర్థిత్వంపై నిర్వహించిన సర్వేలోనూ ఎలాంటి సానుకూల పరిస్థితులు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో ఆనం చూపు వెంకటగిరి వైపు ఉన్నట్లు కూడా రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో వైపు కుటుంబం కూడా ఆనంతో కలిసిరావడం లేదు. దీంతో పాటు ఆనంను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఆత్మకూరులో పార్టీని నడిపించేందుకు, ఎన్నికల ఖర్చును పార్టీయే పెట్టుకుంటుందని చెప్పిన వారే ప్రస్తుతం ముఖం చాటేస్తుండడంతో ఆయన అయోమయంలో పడ్డారు.
టీడీపీ కార్యక్రమాలపై నిరాసక్తి
టీడీపీ నిర్ణయం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో మహిళలతో మహాశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఆత్మకూరు నియోజకవర్గంలో మాత్రం చేపట్టడం లేదు. ఇటీవల మహాశక్తి కార్యక్రమ నిర్వహణపై నిర్వాహకులు ఆనంను కలిసినా తాను ఇప్పట్లో సహకరించలేనని నిరాకరించారనే ప్రచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment