తాజాగా టీడీపీ చేయించిన సర్వేలు ఆ పార్టీని నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. టీడీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదని సర్వేలు చెబుతున్నాయి. సర్వే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాకపోగా అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా రావడంతో టీడీపీ నేతలు మరింత షాక్‌కు గురయ్యారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి జిల్లాలో విజయదుందుభి మోగిస్తుందని సర్వే ఫలితాలు చెబుతుండడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతోందని ఆ పార్టీ చేయిస్తున్న తాజా సర్వేలే చెబుతున్నాయి. ఇటీవల జిల్లాలో టీడీపీ పరిస్థితిపై ప్రైవేట్ సంస్థల ద్వారా ఆ పార్టీ నేతలు సర్వే చేయించారు. దాదాపు 25 రోజులపాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో రెండు విడతలుగా సర్వే చేయించుకోగా, ఆ ఫలితాలను చూసి టీడీపీ నేతలకు దిమ్మతిరిగినట్లు తెలుస్తోంది. పదింటిలో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం దాదాపు ఖరారైనట్లు తాజా సర్వేల్లో తేటతెల్లం కావడంతో టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఎన్నికలకు అతికొద్ది సమయమే ఉండడంతో పార్టీ గ్రాఫ్ ఎలా పెంచాలో పార్టీ అధిష్టానానికి అర్థంకావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదేమో అని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయోమయంలో టీడీపీ అధిష్టానం
ఉమ్మడి జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ రెండు ప్రైవేటు సంస్థల ద్వారా తాజాగా సర్వేలు చేయించుకుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 12వ తేదీ వరకు టీడీపీ ఈ సర్వేలు చేయించింది. ఆయా సర్వేల్లో ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 1,500 మందికి తగ్గకుండా అన్నివర్గాల వారి అభిప్రాయాలను సేకరించారు. దాదాపు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 6 నుంచి 7 శాతం మంది అదనంగా వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారని సమాచారం. దీంతో అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నట్లుగా ఆయా సర్వేల ద్వారా తేలింది.
అధికార పార్టీకి మరింత ఆదరణ
2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని ఓటర్లు నిరూపించారు. గడిచిన నాలుగన్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్‌సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్సార్‌సీపీకి అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన గురించి సామాన్యులు బేరీజు వేసుకుంటున్నారు. దీంతో ఎటుచూసినా టీడీపీ గ్రాఫ్ పెరగలేదని సర్వేల్లో స్పష్టమైంది.
బహిష్కృత ఎమ్మెల్యేలను ఆహ్వానించినా..
జిల్లా టీడీపీలో నాయకత్వ లోపం కన్పిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చెదిరిపోయారు. దీంతో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలు కరువయ్యారు. టీడీపీలో సీనియర్లుగా ఉన్న నేతలు సైతం వసూళ్ల కోసం అర్రులు చాచిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అధికార పక్షంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో కూడా వసూళ్లు చేసుకున్న ఘనత టీడీపీ సీనియర్ నేతలకే దక్కుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ముఖం చాటేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో ఉత్సాహం కరువైంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలను టీడీపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కండువా కప్పుకోకుండానే జెండాను ఎత్తుకున్నారు. మరో ఎమ్మెల్యే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ముగ్గురు వెళ్లినా టీడీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదని సర్వేలు చెబుతున్నాయి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంతో స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేతలు అలకబూనారు. నమ్మి జెండా మోసిన మాకే టీడీపీ అధినేత చంద్రబాబు ద్రోహం చేశారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒకవేళ ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్థానిక టీడీపీ నేతలు తెగేసి చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment