సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికిని కోల్పోయింది. ఒకటి.. రెండు నియోజకవర్గాల్లో మాజీలే పెత్తనం చేస్తున్నా.. చివరికి వారికి సైతం టికెట్ ఇస్తారనే ఆశలు సన్నగిల్లాయి. మిగతా నియోజకవర్గాల్లో అయితే మండలస్థాయిలో కూడా పలుకుబడి లేని నేతలే ఇన్‌చార్జిలుగా చెలామణి అవుతున్న పరిస్థితి ఉంది. మంగళవారం నుంచి జిల్లాలో లోకేష్ యువగళం యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అండగా నిలిచేందుకు ఏ నియోజకవర్గం నేత కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అధికారపార్టీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలను రంగంలోకి దించి, వారినే ముందుంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆ ముగ్గురు లోకేష్ యాత్రను విజయవంతం చేస్తామంటూ మీడియా ముందుకువచ్చి ఆర్భాటం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ ముగ్గురే దిక్కా
టీడీపీ పరిస్థితి చూస్తే జిల్లాలో వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలే వారికి దిక్కుగా కనిపిస్తోంది. టీడీపీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పదవులు అనుభవించిన అగ్ర నాయకులు ఉన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నుంచి మాజీ మంత్రి నారాయణ, బీద రవిచంద్ర వంటి కీలక నాయకులు ఉన్నప్పటికీ రెండు రోజుల్లో ప్రారంభం కానున్న లోకేష్ యాత్రకు సంబంధించిన బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకునేందుకు వారి నుంచి చొరవ కనిపించలేదు. యాత్రకు సంబంధించి ముందస్తు ప్రణాళికల హడావుడి కూడా లేదు. లోకేష్ యాత్రను విజయవంతం చేసే బాధ్యతను ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించేందుకు టీడీపీ జిల్లా నేతలందరూ ఆయన ఇంటికి వెళ్లడం చూస్తే పార్టీకి ఉన్న ఆదరణ అర్థమవుతోంది.
ఎమ్మెల్యే అభ్యర్థిని అనిపించుకునేందుకు..
రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి సీనియర్లు ఎవరూ సిద్ధంగా లేరని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో టీడీపీకి ప్రజాదరణ లేకపోవడంతో గెలుస్తామనే ధీమా లేక తమ వారసులను రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తుండగా, మరికొన్ని నియోజకవర్గాల్లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థినని అనిపించుకునేందుకు కొందరు తహతహలాడుతున్నట్లు సమాచారం. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా ఓటమిపాలైన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సోమిరెడ్డికే టికెట్ కన్ఫర్మేషన్ లేదు. ఈ దఫా ఆయన తన కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్నా.. టీడీపీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సోమిరెడ్డి సైతం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది.
ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి హడావుడి చేయిస్తున్నట్లు సమాచారం. కోవూరులోనూ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కూడా టికెట్ రావడం కష్టమేనని సూచనలు ఉండడంతో ఆయన కుమారుడిని రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే కోవూరు టికెట్‌పై స్పష్టత లేకపోవడంతో వీరు సైతం లోకేష్ యాత్రపై చొరవ చూపించడం లేదు. ఇప్పటికే కోవూరు నుంచి టీడీపీ సీనియర్ నేతలు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కావలి నియోజకవర్గానికి సంబంధించి పంచాయతీ స్థాయి నాయకుడిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంచారు. ఆయనకు పోటీగా కావ్య కృష్ణారెడ్డి తెరపైకి రావడంతో పార్టీకి, యువగళం యాత్ర కోసం రూ.కోట్లు ధారపోసిన మాలేపాటి సుబ్బానాయుడు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఉదయగిరి నియోజకవర్గంలో ఉనికి లేని టీడీపీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ముందుగానే చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో కాకర్ల సురేష్ తనకే టికెట్ వస్తుందని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అతనికి పోటీ అయ్యారు. లోకేష్ యాత్రకు సంబంధించి హడావుడి చేస్తున్నారు. ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డి ఎంట్రీతో కన్నబాబుకు మళ్లీ చుక్కెదురవుతోంది. తనకే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న కన్నబాబు స్థానంలో ఆనంను తీసుకురావడంతో ఆయన చిన్నబోయినట్లు సమాచారం. ఆదివారం ఆత్మకూరులో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి సైతం కన్నబాబు దూరంగా ఉన్నారు.
ఇక నెల్లూరు రూరల్ పరిస్థితి చూస్తే అధికారపార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి అవుతారని ఖాయం కావడంతో తానే రూరల్ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిని అనుకున్న అబ్దుల్ అజీజ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెల్లూరు సిటీ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడి నుంచి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఈ దఫా తనకే టికెట్ కావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ ద్వారా రాయభారం చేయిస్తున్నా.. ఆయనకు టికెట్ కన్ఫర్మేషన్ లేదని సమాచారం. దీనిని బట్టి చూస్తే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ అర్థమవుతుంది.
జిల్లాలో ఉనికి కోల్పోయిన టీడీపీ తన బలాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు పార్టీకి నమ్మకస్తులుగా పనిచేసిన వారిని అవసరమైన మేర వినియోగించుకున్న టీడీపీ పెద్దలు.. ప్రస్తుతం అధికారపార్టీ సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలకు తాయిలాలతోపాటు టికెట్లు ఇస్తామని తమ పార్టీలోకి ఆహ్వానించి పట్టం కడుతున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయాలని భావిస్తుండగా, ఎమ్మెల్యే అభ్యర్థిని అనిపించుకోవాలని తహతహలాడుతున్న ఆశావహుల్లో నైరాశ్యం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment