ఇళ్ల పక్కనే షాపుతో ఇబ్బంది పడుతున్న మహిళలు
నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు
బుచ్చిరెడ్డిపాళెం: ఇళ్ల పక్కనే మద్యం షాపు ఏర్పాటు చేయడంతో తామంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని పల్లిపాళెం ప్రజలు శుక్రవారం పెద్ద ఎత్తున దుకా ణం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి షాపును తరలించి మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలంటూ ఎకై ్సజ్ అధికారులకు, తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. గుడి, బడి, ఆస్పత్రులు ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదనే నిబంధనలను విస్మరించి ఓ టీడీపీ నేత అండతో మద్యం వ్యాపారి జాతీయ రహదారి పక్కనే షాపు ఏర్పాటు చేశారంటూ మండిపడ్డారు.
మద్యం దుకాణానికి సమీపంలోనే నారాయణ స్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, పుత్తూరు కట్టు కట్టే వైద్యశాల ఉన్నాయన్నారు. తమ పిల్లలను స్కూల్, ట్యూషన్లకు వదిలి పెట్టి తీసుకు వచ్చేందుకు తల్లులు ఇదే దారిలో వెళ్లాల్సి ఉందన్నారు. మద్యం షాపు పక్కనే తాగి, తూగి మందుబాబులు చేస్తున్న వీరంగంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉండి.. మహిళలుగా తాము పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రం ఇస్తే చూస్తామంటూ చెప్పడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అధికారులకు, రాజకీయ పార్టీల నేతలకు కొంచెం కూడా సంస్కారం ఉందా? అని నిలదీశారు.
ఈ షాపుతో పాటు మరో షాపును కూడా జనావాసాల మధ్య ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా.. శాసన సభ్యురాలు మౌనం దాల్చుతున్నారన్నారు. స్థానిక ప్రజలు తిరగబడడంతో ఒక షాపును మాత్రం మూసి వేశారని, ఇక్కడ మాత్రం షాపును కొనసాగించేందుకే ఆ టీడీపీ నేత ఎమ్మెల్యేపై, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారంటూ మండిపడ్డారు. షాపును ఇక్కడి నుంచి తరలించే వరకు ఊరుకోమని హెచ్చరించారు. స్థానికులు దుకాణం ఎదుట నిరసన వ్యక్తం చేస్తుంటే.. మరో వైపు అక్కడే ఫుల్లుగా తాగి ఓ వ్యక్తి పడిపోవడం, మరో వైపు ఇంకో వ్యక్తి తాగుతుండడం చూసి స్థానికులు ఇలాంటి పరిస్థితులు జనావాసాలు మధ్య జరుగుతున్నాయంటూ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment