
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంగంలో బుధవారం చీప్ పాలిటిక్స్ చేసి నవ్వుల పాలయ్యారు.
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంగంలో బుధవారం చీప్ పాలిటిక్స్ చేసి నవ్వుల పాలయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంగంలో స్థానిక వలంటీర్లతో సమావేశాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనల మేరకు ఏర్పాటు చేశారు. సచివాలయాల పరిధిలో సమస్యల గుర్తింపు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, తదితర అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇలా రెండు రోజులుగా సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సంగంలోని సొసైటీ కార్యాలయంలో వలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక మండలాధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వలంటీర్లతో సొసైటీ కార్యాలయంలో సమావేశాన్ని పెట్టడమే తప్పనే రీతిలో అక్కడికి వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డి నానా హంగామా చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు.
వాస్తవానికి కలెక్టర్ హరినారాయణన్ సంగం మండలంలో ఇటీవల పర్యటించి ఓట్ల తొలగింపు, చేర్పుల విషయాన్ని పరిశీలించారు. ఎక్కడా అవకతవకలు జరగలేదని ఆయన ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇవేవీ తెలుసుకోకుండా ఆనం రామనారాయణరెడ్డి హడావుడి చేయడంపై పలువురు మండిపడుతున్నారు.