నెల్లూరు(బారకాసు): ఆనం రామనారాయణరెడ్డి రాజకీయం ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఆయన చరిత్రను ముగించేస్తానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకునే దమ్ము ఆనం రామనారాయణరెడ్డికి ఉందా అని అన్నారు. ఒకవేళ ఆనం టికెట్ తెచ్చుకుంటే.. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఇద్దరం పోటీ చేద్దామని, తాను ఓడిపోతే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఎమ్మెల్యే అనిల్ తెలిపారు.
ఆనం రాజకీయ చరిత్ర ముగిసిపోతున్న తరుణంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారని, లేకుంటే ఆయనకు రాజకీయ చరిత్ర ఎక్కడుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో గెలుపొందిన ఆనం.. పార్టీకి రాజీనామా చేయకుండా.. ప్రతిపక్ష పార్టీతో కలిసి నడవడంసరికాదన్నారు. తాను ఆనం కుటుంబానికి వ్యతిరేకం కాదని, ఏసీ సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, సంజీవరెడ్డి.. వీరంతా జిల్లాకు ఎంతోకొంత మంచి చేసిన వారు కాబట్టే వారికి మంచిపేరుందని తాను రాజకీయాల్లోకి రాకముందు పెద్దలు చెబుతుంటే విన్నానన్నారు.
అదే కుటుంబానికి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత అవకాశాలిచ్చినందుకు జగనన్నతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఆనం కుటుంబంలో రామనారాయణరెడ్డి తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని విమర్శించారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉంటే తన మీద పోటీ చేసి గెలవాలన్నారు.
బీద రవిచంద్రకు కౌంటర్
ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని బీద రవిచంద్ర తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. బీద రవిచంద్ర టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీని నాశనం చేశారన్నారు. దగదర్తి మండలంలో మాయమైన భూరికార్డులకు సంబంధించి సమగ్ర చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, బీద రవిచంద్ర చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ హయాంలో ఎంత ఖర్చు చేశారో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చి తాము ఖర్చు చేశామో ప్రజలకు తెలుసునని, దీనిపై చర్చకు సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment