
కొంపముంచిన చీడపీడలు
భారీగా తగ్గనున్న దిగుబడి
లబోదిబోమంటున్న కౌలు రైతులు
కాపాడుకునేందుకు కవర్లు కడుతున్న పరిస్థితి
ప్రతి సీజన్‌లో ఉలవపాడు మామిడి కోసం జనం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రధానంగా ఇక్కడి బంగినపల్లి రకాన్ని రుచి చూడాలని పరితపిస్తుంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి గణనీయంగా తగ్గనుంది. వాతావరణ పరిస్థితులు, చీడపీడల వల్ల మామిడి రైతులు విలవిల్లాడుతున్నారు. పూత నిలబడలేదు. పిందెలు రాలిపోతున్నాయి. పెద్దకాయలకు బొక్కలు పడి రాలుతున్న పరిస్థితులు ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలోని తోటల్లో నెలకొంది.
ఉలవపాడు: నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో ఏడు వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇక ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో చూస్తే 10 వేల ఎకరాల్లో తోటలు విస్తరించి ఉన్నాయి. డిసెంబర్‌లో వచ్చిన కొద్దిపాటి పూత మాత్రం పిందెలు, కాయలుగా మారాయి. ఫిబ్రవరి, మార్చిలో వచ్చిన పూత మొత్తం పిందెలు కాకుండానే రాలిపోయింది.
ఈ పూత కాయలుగా మారి దిగుబడి బాగుటుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. చీడపీడల తాకిడి ఉందని వాటిని కాపాడుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. రైతులు మందులు కూడా పిచికారీ చేశారు. కానీ ఎలాంటి మార్పులు జరగలేదు.
రైతుల విలవిల
ఈ ఏడాది తేనెమంచు, నల్లతామర పురుగుల వల్ల మామిడి రైతులు భారీగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కొన్నిచోట్ల పిందెలు కాయలుగా మారాయి. వాటిలో కూడా కొన్ని కాయలకు పురుగు పట్టి బొక్కలు పడటం, నల్లగా మారి రాలిపోతున్నాయి. చాలామంది కౌలు రైతులు మామిడి తోటలు కొన్నారు.
తర్వాత మందులు పిచికారీ కూడా చేయించారు. కానీ నేడు నెలకొన్న పరిస్థితులతో వారు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎకరాను రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరి స్థితి కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
భారీగా తగ్గనున్న దిగుబడి
అధికారుల అంచనా ప్రకారం ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గనుంది. దాదాపు 30 శాతం కాపు మాత్రమే మిగిలింది. సాధారణంగా ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది కేవలం 2 టన్నులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని తోటల్లో అయితే పూర్తిగా పూత, పిందెలు రాలిపోయాయి. దీంతో 20 వేల టన్నుల్లోపే వ్యాపారం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఫ్రూట్ కవర్లకు డిమాండ్
ప్రస్తుతం ఉన్న మామిడి కాయలను కాపాడుకోవడానికి రైతులు ప్రూట్ కవర్లు వినియోగిస్తున్నారు. ఈ కవర్లకు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. ఒక్కో దానికి సుమారు రూ.2.50 పడుతుంది. ఈ కవర్ కడితే కాయలను కాపాడుకోవచ్చని రైతులు అంటున్నారు. ప్రస్తుతం మామిడి తోటల్లో కవర్లు కడుతున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది మామిడి దిగుబడి భారీ స్థాయిలో తగ్గి నష్టాలు వస్తున్నట్లు రైతులు తెలిపారు.
కౌలు రైతుకు నష్టాలే..
ఈ ఏడాది 8 ఎకరాల్లో మామిడి తోటల్ని మిత్రుడితో కలిసి కొన్నా. రూ.3.20 లక్షలకు తోటలు తీసుకున్నాం. ప్రస్తుతం రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పరిస్థితులు అనుకూలించక కాపు రాలేదు.– సంకూరి మాచెర్ల, కౌలు రైతు, ఉలవపాడు
దిగుబడి తగ్గనుంది
ఈ ఏడాది మామిడిలో దిగుబడి తగ్గనుంది. వాతావరణ పరిస్థితులు, చీడపీడల తాకిడి వల్ల ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఉన్న కాయలు నాణ్యంగా ఉండటానికి మా సంస్థ ద్వారా రైతుల కోసం ప్రూట్ కవర్లు తెప్పిస్తున్నాం. – యరజొన్న బాలచందర్, రైతు స్ఫూర్తి సంస్థ, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ, ఉలవపాడు