
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పేపర్ మ్యాంగో సాగుకు ఊపు
అధిక ధరలు రావడంతో రైతుల మొగ్గు
గత ఏడాది పేపర్ కట్టిన నీలం టన్ను లక్ష దాటిన వైనం
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేరుశెనగ తర్వాత ఎక్కువ మంది రైతులకు ఆదాయం వచ్చే పంట మామిడే. మామిడి తోటల్లో కాయలకు కవర్లను కట్టే విధానం గత రెండు మూడేళ్లుగా కొందరు రైతులు అవలంభిస్తున్నారు. దీంతోపాటు కొందరు కర్ణాటకకు చెందిన రైతులు ఇక్కడి రైతుల మామిడి తోపులను లీజుకు తీసుకొని క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ విధానాలతో తోటలను సస్యరక్షణ చేసి నిమ్మకాయ సైజులో మామిడి కాయలున్న దశలోనే వాటికి పేపర్‌ను కట్టడం ద్వారా కాయల దిగుబడిలో నాణ్యతను పెంచుతున్నారు.
ఈ పేపర్ మ్యాంగోకు మార్కెట్‌లో ఎక్కువ ధర పలికి మంచి లాభాలను గడిస్తున్నారు. దీన్ని గమనించిన ఇక్కడి మామిడి రైతులు సైతం తోటల్లోని కాయలకు పేపర్‌ను చుట్టడాన్ని విస్తృత స్థాయిలో చేపడుతున్నారు.
కవర్లతో కాయలకు రక్షణ
సా«ధారణంగా మామిడి కాయలు కోతకొచ్చే ముందు కాయలు నిమ్మసైజులోకి రాగానే కవర్లను కట్టుకో వాల్సి ఉంటుంది. దీంతో కాయలపై సూర్యరశ్మి పడ కుండా, ఎలాంటి క్రిమికీటకాలు సోకకుండా కాయలు నాణ్యంగా ఉంటాయి. దీంతోపాటు కాయల సైజు పరిమాణం పెద్దదిగా ఉంటుంది.
ముఖ్యంగా కాయ రంగు, షైనింగ్ వస్తుంది. పురుగులు, క్రిమికీటకాలు, తెగుళ్ళు, బంకపేను లాంటివి కాయపై కనిపించవు. దీంతో వీటిని ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులు సైతం అధిక ధరలకు కొనేందుకు అవకాశం ఉంటుంది. వీటికి మార్కెట్‌లోనూ మంచి ధర పలుకుతోంది.
హెక్టారుకు పది వేల కవర్లు
ఉద్యానవనశాఖ అంచనా ప్రకారం హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. కవర్ ధర రూ.2గా ఉంది. హార్టికల్చర్ శాఖ కవర్‌కు రూపాయి రాయితీ ఇస్తోంది. అంటే హెక్టారుకు పదివేల కవ ర్లకు రూ. 20వేలు అయితే రైతులు సంబంధిత రైతు సేవాకేంద్రంలో రూ.10వేలను చెల్లించి రిజిస్టర్ చేయించుకొంటే దానికి ప్రభుత్వం రూ.10వేలను కలిపి హెక్టారుకు పదివేల కవర్లను ఆ రైతుకు అందిస్తుంది.
ప్రస్తుతం కవర్లకోసం ఆర్‌ఎస్‌కేల్లో రిజిస్ట్రేషన్లు మొదలైయ్యాయి. రైతులు ప్రైవేటుగా కావాలనుకుంటే ఇండియామార్ట్, అమెజాన్‌లాంటి ఆన్‌లైన్‌లోనూ పొందవచ్చు. వీటిని మ్యాంగో ప్రొటెక్షన్ గ్రోత్ పేపర్ కవర్లుగా పిలుస్తారు.
కవర్లు కట్టిన రైతులకు పండగే.
మామిడి సీజన్ ముగుస్తున్న దశలో మార్కెట్‌కు వచ్చే నీలం మామిడికి ఏటా ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. జిల్లాలోని మొత్తం మామిడి సాగులో 20 శాతం మాత్రమే నీలం మామిడి సాగవుతోంది. ఇది మామిడిలో ఆఖరు సీజన్ ఫ్రూట్‌గా పేరుంది.
ఇక్కడి రైతులు సహజ పద్ధతులతో మామిడిని సాగుచేయడమే కాకుండా కాయలకు కవర్లను కట్టడంతో సరుకు నాణ్యంగా ఉంటోంది. దీంతో వ్యాపారులు పోటీపడి మరీ అధిక ధరకు మామిడిని కొంటుండడంతో ధరలు ఆశాజనంగా మారాయి. గతేడాది నీలం రకానికి కవర్లు కట్టినందున టన్ను ధర రూ.లక్షను దాటింది.
ఇక్కడి తోపులు లీజుకు పెట్టుకొని..
కవర్లు్ల కట్టడం ద్వారా నాణ్యమైన సరుకును పొందే విధానంపై ఎక్కువ అవగాహన కలిగిన కర్ణాటక వ్యాపారులు, రైతులు ఇక్కడి మామిడి తోపులకు లీజుపెట్టుకుంటున్నారు. ఆపై వీరే తోపుల సస్యరక్షణ చేసి కాయలకు పేపర్లు కట్టి ఎక్కువ ధర దక్కేలా బయటి దేశాలకు నేరుగా ఎగుమతి చేస్తున్నారు. దీన్ని గమనించిన ఉమ్మడి జిల్లా రైతులు సైతం ఈ విధానాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళుతున్నారు.
కొమ్మఅంటు (టాప్‌వర్కింగ్) కూడా..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తోతాపురి రకం మామిడిì కాయలు పల్ఫ్‌కోసం కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తూ... గ్యారెంటీ మార్కెటింగ్ ప్రయోజనం పొందుతున్నారు. మరికొందరు రైతులు మార్కెట్‌లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్ వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు.
ఏటా టాప్‌వర్కింగ్ జూలై, ఆగస్టునెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాత తోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్దతులు ప్రత్యామ్నాయంగా మారాయి.

రైతులను ప్రోత్సహిస్తున్నాం
జిల్లాలోని మామిడి రైతులకు కవర్లను కట్టడంపై అవగాహన కల్పిస్తున్నాం. మామిడి సాగు చేస్తున్న రైతులకు ఏటా సమావేశాలను నిర్వహించి కవర్లను కట్టడం ద్వారా కలిగే మేలును వివరిస్తున్నాం. హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం రైతు రూ.10వేలను చెల్లిస్తే మా శాఖ రూ.10వేలను కలిపి కవర్లను అందిస్తున్నాం. అవసరమైన రైతులు ఆర్‌ఎస్‌కేల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. – మధుసూదన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ అధికారి
కాయ నాణ్యత బాగుంటుంది
గిట్టుబాటు ధర లభించాలంటే మామిడి రైతులు కాయలకు పేపర్ బ్యాగులను అమర్చాలి. దీంతో కాయల నాణ్యత పెరిగి మార్కెట్‌లో మంచి ధర వస్తుంది. – నయాజ్, మామిడి వ్యాపారి, పలమనేరు
టాప్‌వర్కింగ్‌తో భారీ లాభాలు...
టాప్‌వర్కింగ్‌తో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఉన్న తోటల్లో కాయలకు కవర్లను కట్టడం ద్వారా సరుకు నాణ్యత పెరిగి మంచి ధరలు వస్తాయి. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం
Comments
Please login to add a commentAdd a comment