ulavapadu
-
పునారస్ మామిడికి మంచి గిరాకీ.. వేసవి సీజన్ తర్వాత...
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం జిల్లా): పునారస్ మామిడికి ప్రస్తుతం గిరాకీ వచ్చింది. మామిడి వేసవి సీజన్ పూర్తయిన తరువాత వచ్చే మామిడికాయల రకం ఈ పునారస్.. గతంలో కొద్దిగా వచ్చే ఈ కాయలకు గిరాకీ ఉండడంతో ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఈ చెట్లను అధికంగా నాటారు. దీని కారణంగా ప్రస్తుతం ఈ సీజన్లో పునారస్ మామిడి కాయలు అధికంగా వచ్చాయి. ఉలవపాడు మార్కెట్ నుంచి ఈ కాయలు ప్రస్తుతం భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఉలవపాడు కేంద్రంగా వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఉన్న దళారులు రైతుల నుంచి కాయలను కొనుగోలు చేసి మార్కెట్లో తూకం వేసి బస్తాలు, ట్రేలలో లారీలు, మినీ ట్రక్కులు, ఆటోల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తారు. ఈ ఏడాది మార్కెట్లో దాదాపు 10 కేంద్రాల నుంచి కాయల ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళకు ఈ మామిడికాయలు తరలివెళ్తాయి. పచ్చళ్లకు అధికంగా ఈ కాయలను వినియోగిస్తారు. ఈ ఏడాది రేటు కూడా కాస్త అధికంగానే ఉంది. ఈ వేసవిలో మామిడి కాయలకు పండు ఈగ సోకి కాయల్లో పురుగులు రావడంతో రైతులు నష్టపోయారు. ఈ సమయంలో పునారస్ చెట్లు ఉన్న రైతులు ఈ ఏడాది రేటు అధికంగా ఉండడంతో ఊరట ఇచ్చినట్టయింది. పెరిగిన ఎగుమతులు గత నాలుగేళ్ల క్రితం నుంచి పోలిస్తే ఈ ఏడాది పునారస్ మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగాయి. రైతులు సీజన్ కాని సమయంలో వస్తున్న కాయలు కావడంతో ఇటీవల కాలంలో ఎక్కువగా సాగు చేశారు. ఉలవపాడు ప్రాంతంలో దాదాపు 4000 ఎకరాలకు పైగా ఈ తోటలు ఉన్నాయి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 వేక ఎకరాల్లో పునారస్ తోటలు ఉన్నట్లు సమాచారం. కానీ ప్రతి ఏడాదికి వీటి సాగు శాతం పెరుగుతుంది. ఈ ఏడాది గత నెల నుంచి రోజుకు సుమారు 50 నుంచి 80 టన్నుల కాయలు ఎగుమతులు చేస్తున్నారు. కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు ఈ ఏడాది కేజీ 40 నుంచి రూ.50 వరకు పునారస్ మామిడి రేటు పలుకుతుంది. గతంలో 25 నుంచి చిన్నగా పెరుగుతూ చివరి దశలో రూ.50కు చేరుకునేది. ఈ సారిమాత్రం రూ.40 నుంచి రూ.50 మధ్యనే ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మామిడికాయలు చెన్నై, తిరువనంతపురం, కోయంబేడు, కోయంబత్తూరుకు తరలివెళుతున్నాయి. రోజుకు సుమారు 30 నుంచి 50 లక్షల మధ్య ఉలవపాడు మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది. కేరళ ఓనం పండుగకు ఉలవపాడు పునారస్... కేరళలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వచ్చే నెల 8 వరకు జరిగే ఓనమ్ పండుగకు ఉలవపాడు పునారస్ కాయలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అక్కడ పెట్టే పచ్చడికి దీనిని ఉపయోగిస్తారు. ఈ సమయంలో అంటే సెప్టెంబరులో ఇంకా భారీగా రేట్లు పెరుగుతాయి. ఇక్కడ నుంచి ఓనమ్ పండుగకు ప్రత్యేకంగా గ్రేడ్ చేసిన కాయలను తరలిస్తారు. ఈ ఏడాది రేట్లు బాగున్నాయి గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రేట్లు బాగున్నాయి. కాయలు కూడా నాణ్యత బాగుంది. గతంలో కేజీ రూ.25 నుంచి రూ.35 లోపు ధర ఉండేది. ఈ ఏడాది మాత్రం రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. – ఆర్ కోటేశ్వరరావు, ఉలవపాడు అధికంగా దిగుబడులు ఈ ఏడాది కాయలు అధికంగా కాశాయి. అయినా రేటు తగ్గలేదు. రైతులు ఎక్కువ మంది పునారస్ మామిడి సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. – వింజమూరి సురేష్ బాబు, రైతు ఉలవపాడు మంచి రేటుకే కొంటున్నాము మా ప్రాంతంలో ఈ కాయలకు డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి లారీల్లో తీసుకుని వెళుతున్నాం. కాయకు మంచి రేటు ఇస్తున్నాము. – రఫీ, కొనుగోలుదారుడు, కోయంబత్తూరు -
ఇప్పటికే 2 నెలలు ఆలస్యం.. మామిడి ప్రియులకు చేదు వార్త
మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి.. వరుస సీజన్లో రైతులకు చేదు అనుభావాలను మిగిల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యంగా కాయలు వస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడి రైతులు తీవ్రనష్టాలు చవిచూసే ప్రమాదం ఏర్పడింది. సాక్షి, నెల్లూరు : జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు, కలిగిరి, సైదాపురం వంటి ప్రాంతాల్లో దాదాపు 12,800 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో ఒక్క ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 7,500 హెక్టార్ల వరకు సాగు ఉంది. ఈ ప్రాంతంలో పండే బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసాలు, బెంగళూరు కాయలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ప్రతి ఏడాది వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. దాదాపు రెండు, మూడు నెలలపాటు సీజన్ జోరుగా సాగుతుంది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సరైన ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపుతోందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగా కాయలు వచ్చిన మామిడిచెట్టు ప్రతికూల వాతావరణంతోనే.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల పూతరావడం దాదాపు నెల రోజుల ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా సక్రమంగా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30 శాతం పిందె మాత్రమే తోటల్లో వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని తోటల్లో పిందెలు రాని దుస్థితి నెలకొంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా అనుకూలిస్తే ఒక ఎకరా తోటలో నాలుగు టన్నుల వరకు కాయలు వచ్చే అవకాశం ఉంది. కాని ఈ ఏడాది ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల కాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బాగా దిగుబడి వచ్చిందనుకుంటే రెండు టన్నులు మించి రాదని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడిని రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ధరలు ఫర్వాలేదు... రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఈ మేరకు ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి రకం మామిడి టన్ను రూ.70 వేలు మార్కెట్లో పలుకుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్లు కాయలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రెండు టన్నుల లెక్కన రైతుకు దిగుబడి తగ్గినా ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు రూ.1.40 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధిక వర్షాలతో పూత సరిగ్గా రాలేదు అధిక వర్షాల వల్ల ఈ ఏడాది మామిడిపూతపై తీవ్ర ప్రభావం పడింది. పూత సరిగ్గా రాలేదు. వచ్చిన పూతలో కూడా కేవలం 30 శాతం మాత్రమే పిందె వచ్చింది. దీని వల్ల దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఒక ఎకరా తోటలో ఒక టన్ను నుంచి టన్నునర కాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రఖ్యాతిగాంచి ఉలవపాడు మామిడి రైతులకు ఇది నష్ట కలిగించే అంశమే. – బ్రహ్మసాయి, ఉద్యానవనశాఖ అధికారి ఎగుమతులపై ప్రభావం కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాల్లో పండే మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. దాదాపు మూడు నెలలపాటు ఉలవపాడు కేంద్రంగా మామిడి వ్యాపారం జోరుగా సాగుతోంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఈ వ్యాపారానికి చాలా కీలకం. కాని ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్లోకి కాయలు రాని పరిస్థితి ఉంది. ఇది ఉలవపాడు నుంచి జరిగే మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది విదేశాలకు దాదాపుగా ఎగుమతులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉదే పరిస్థితి ఉంది. కరోనా ఆంక్షల వల్ల స్లాట్లు దొరక్క విదేశాలకు ఎగుమతులు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం కాయలు లేకపోవడంతో దేశీయంగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది 40 నుంచి 50 వేల టన్నుల వరకు మామిడి దిగుబడి ప్రాంతం నుంచి వస్తే, వీటిలో 10 వేల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతులు ఉండేవని అధికారులు వెల్లడిస్తున్నారు. -
ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి....
ఉలవపాడుః ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడ బంగినపలి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. 16 వ నెంబరు జాతీయరహదారి పై ఒంగోలు –కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో షుమారు 15 వేల ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరిమామిడి, పునారస్, హిమామ్‌పసంద్ రకాలు సాగు చేస్తారు. ప్రతి ఏడాది మార్చి నుండి జులై వరకు సీజన్సాగుతుంది. ఎకరమునకు 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బంగినపల్లి రకం అత్యధికంగా టన్ను 30 నుంచి 45 వేల వరకు పలుకుతుంది. మిగిలిన రకాలు తక్కువ రేటు ఉంటుంది. ఏడాదికి సుమారు 90 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుంది. బంగినపల్లి రకం షిప్పులు, విమానాలలో అమెరికా, ఇంగ్లాండ్‌లకు పంపిస్తారు. బెంగుళూరు రకం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. ఫల రాజుగా పేరొందిన మామిడి కాయలకు ఉలవపాడు ప్రాంతం ఫేమస్ గా చెప్పుకోవచ్చు. -
కట్టుబాటుతో కరోనా కట్టడి
ఉలవపాడు: ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కరోనా వేళ ప్రజల క్షేమమే లక్ష్యంగా.. ఆ గ్రామ పెద్దలు కష్టమైనా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను గ్రామస్తులంతా ఇష్టంగానే ఆచరిస్తున్నారు. అందరూ ఒక్కటై కట్టుబాటుతో కరోనా వైరస్‌ను కట్టడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పెదపట్టపు పాలెం విజయగాథ ఇది. మత్స్యకార గ్రామమైన పెదపట్టపు పాలెంలో 4,329 జనాభా ఉండగా.. వారిలో పురుషులు 2,147 మంది, మహిళలు 2,098 ఉన్నారు. గత నెలలో ఆ గ్రామంలో రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వెంటనే గ్రామ కాపులు (మత్స్యకార పెద్దలు) అప్రమత్తమయ్యారు. ఇకపై గ్రామంలో ఒక్క కేసు కూడా రాకుండా చేయాలనే లక్ష్యంతో కఠిన నిర్ణయాలు తీసుకుని.. సంపూర్ణ లాక్డౌన్ అమలుకు తీర్మానం చేశారు. దురాయి (చాటింపు) వేయించి.. ప్రజలు ఎవరైనా నిబంధనలను వ్యతిరేకిస్తే జరిమానా తప్పదని తెలియజేశారు. నిర్ణయాలివీ.. ► ఇంట్లోంచి బయటకొచ్చి తిరగకూడదు. ► గ్రామంలోకి బయట వాళ్లు ఎవరూ రాకూడదు. గ్రామంలోని వారెవరూ బయటకు వెళ్లకూడదు. ► బైక్ బయటకు తీయకూడదు. నడపకూడదు. బైక్ నడిపితే రూ.5,000 జరిమానా. ► మద్యం, కల్లు దుకాణాల వద్దకు వెళ్లకూడదు, సేవించకూడదు. పేకాట ఆడకూడదు. ► మాస్క్ విధిగా ధరించాలి. మాస్క్ పెట్టుకోకపోతే రూ.100 జరిమానా. ► గ్రామం మీదుగా వెళ్లేవారిని ఆపి మాట్లాడకూడదు. వారి బైక్ కూడా ఎక్కకూడదు. ► గ్రామంలో కూరగాయలు, సరుకులు విక్రయించకూడదు, కొనకూడదు. ► పై నిర్ణయాలను ఎవరైనా అతిక్రమిస్తున్నట్టు గుర్తించి సమాచారం ఇచ్చిన వారికి రూ.2,500 బహుమతి. మేలు చేసిన నిర్ణయాలు ఈ నిర్ణయాల ఫలితంగా గత నెలలో వచ్చిన రెండు కేసులు తప్ప కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారిద్దరూ హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందారు. ఈ నెల 21వ తేదీ వరకు ఇలా సెల్ఫ్ లాక్డౌన్ కొనసాగుతుంది. ఆ తరువాత ఒక రోజు గ్రామస్తులు సరుకులు కొనుక్కునేందుకు అవకాశం కలి్పస్తారు. ఆ రోజు గ్రామంలోని దుకాణదారులు బయటకు వెళ్లి అవసరమైన అన్ని సరుకులు తెచ్చి గ్రామస్తులకు విక్రయిస్తారు. ఆ తరువాత మరో 14 రోజులపాటు తిరిగి కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయి. కరోనా ఉధృతి తగ్గే వరకు ఈ నిర్ణయాలను కచ్చితంగా అమలు చేయాలని గ్రామ కాపులు తీర్మానం చేశారు. అత్యవసరమైతే.. గ్రామంలో ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినా.. ఆరోగ్యం బాగోలేకపోయినా ముందుగా గ్రామ కాపులను సంప్రదిస్తే వారు తగిన జాగ్రత్తలతో వారిని పంపిస్తారు. -
అంతర్జాతీయ మార్కెట్‌కు ఉలవపాడు మామిడి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. ఉలవపాడు మామిడి తోటల అభివృద్ధికి ప్రత్యేకించి జాతీయ హార్టీకల్చర్ బోర్డు కూడా తన వంతు సహకారం అందించనుంది. ప్రధాన క్లస్టర్‌గా ఉలవపాడు ఉలవపాడు మామిడికాయ దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దీని రుచి అమోఘం. ఈ కాయ బరువు కేజీ కేజీన్నర కూడా ఉంటుంది. నాణ్యతతో పాటు తీయదనానికి ఇది మారు పేరు. దీనిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది దానిని ఆచరణలో పెడుతున్నారు. దీనిలో భాగంగా ఉలవపాడును ఒక ప్రధాన క్లస్టర్‌గా అభివృద్ధి చేసి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం జాతీయ హార్టీకల్చర్ బోర్డు సహకారం తీసుకోవడంతో పాటు, ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగించుకోనున్నారు. 8 వేల హెక్టార్లలో ఇక్కడ మామిడి తోటలున్నాయి. సేంద్రీయ విధానాన్ని అవలంభించేలా ప్రభుత్వం ఇక్కడి రైతులను ప్రోత్సహిస్తోంది. ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిపై క్షేత్ర స్థాయిలో ఇక్కడి రైతులకు పూర్తి అవగాహన కలిగించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉలవపాడు ఉన్నందున నీటి వసతికి అంతగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ నీటి కుంటల ఏర్పాటుతో పాటు, ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని రైతులకు ఉద్యాన శాఖ సూచించింది. ఇప్పటికే మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. పండ్లను నిల్వ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, ప్రయోగశాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతున్నాయి. కాయల్ని ఎలా ప్యాక్ చేయాలో శిక్షణ ఇస్తున్నాం.. ఉలవపాడు మామిడి కాయల నాణ్యతకు ఎటువంటి ఢోకా లేకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆ ప్రాంత రైతులకు ప్రస్తుతం వైఎస్సార్ తోటబడి కార్యక్రమం కింద శిక్షణ ఇస్తున్నాం. చీడపీడల నివారణపై వారిని చైతన్య పరుస్తున్నాం. ముదురు తోటల్ని పునరుజ్జీవింపజేసేందుకు హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాం. ఎగుమతిదారులు, కమీషన్ ఏజెంట్లకు కూడా శిక్షణ ఇచ్చి.. కాయల్ని ఎలా ప్యాకింగ్ చేయాలో, విదేశాలలో నిబంధనలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాం. – రవీంద్రబాబు, వ్యవసాయశాఖ డీడీ, ప్రకాశం జిల్లా -
మూగమనసులు ఒక్కటయ్యాయి..!
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వారిద్దరు మాట్లాడలేరు. వినలేరు.. కానీ వారి మనస్సులు మాట్లాడుకున్నాయి. సైగలతోనే జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించడంతో మూగమనసులు ఒక్కటయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడు గ్రామానికి చెందిన కంబోతుశ్రీనివాసులు, శ్రీలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ దివ్యాంగులే... వినపడదు, మాట్లాడలేరు. వీరిలో భార్గవి ఒంగోలులోని బధిరుల పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. అక్కడే ఉలవపాడు మండలం అలగాయపాలెంకు చెందిన పాదాల సత్యనారాయణ, ఈశ్వరమ్మల కుమారుడు పవన్‌కుమార్ కూడా చదివాడు. అతనికి కూడా వినపడదు, మాట్లాడలేడు. అక్కడ వారికి పరిచయం ఏర్పడింది. తరువాత తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బధిరుల పాఠశాలలో ఐటీఐ చదివారు. అక్కడ వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరయినా ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు, తోటి మిత్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా సమ్మతి తెలపడంతో గురువారం శింగరాయకొండలోని లక్ష్మీనరశింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. అనంతరం ఉలవపాడు సాయిబాబా గుడికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బధిరులు ఈ వివాహానికి వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకుని 50 మంది హాజరయ్యారు. -
సేంద్రియ ‘స్వాహా’యం!
సాక్షి, ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఉలవపాడు ప్రాంతం మామిడికి పేరెన్నిక గన్నది. దీనిని అవకాశంగా చేసుకున్న కొందరు ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి కేరళకు చెందిన జిజో జోసెఫ్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా మరో 7 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ద రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ జిజో జోసెఫ్కుగ్రిక ఇంటర్నేషనల్ కాంపెటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అల్చర్ (ఇకోవా) అనే సంస్థ ఉంది. దీని పేరుతో టీడీపీ హయాంలో ఉలవపాడు మామిడిలో సేంద్రియ వ్యవసాయం చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించటం, వారిని ప్రోత్సహించటంలాంటివి చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2016 సంవత్సరం మే నెలలో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయూ)ను ప్రభుత్వంతో ఇకోవా సంస్థ కుదుర్చుకుంది. అప్పటి నుంచి మామిడి రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు. అంతా కాగితాలపైన, రికార్డుల్లోనే చూపించి రైతులను నిలువునా మోసం చేయటంతో పాటు లక్షలాది రూపాయలు దిగమింగారు. రూ. 50 లక్షలకు పైగా నిలువు దోపిడీ ఉలవపాడు సేంద్రియ వ్యవసాయ సంఘం పేరుతో ఇకోవా సంస్థ చేపట్టిన సేంద్రియ సాగు పేరిట దాదాపు రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మామిడి రైతులను సేంద్రియ సాగు వైపు మరలించటానికిగాను ఇకోవా ఉలవపాడు మండలంలోని 7 గ్రామాలను ఎంపిక చేసుకుంది. ఉలవపాడుతో పాటు బద్దిపూడి, చాకిచర్ల, వీరేపల్లి, భీమవరం, ఆత్మకూరు, కరేడు గ్రామాల్లో కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ. కోటికి పైగా నిధులు రాబట్టుకుంది. అందుకుగాను ఈ ఏడు గ్రామాల్లోని 442 మంది రైతులకు సంబంధించి 500 హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టేందుకు పూనుకున్నారు. మూడేళ్ల పాటు రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కో హెక్టారుకు శిక్షణ తరగతులకు, అవగాహన సదస్సులకు రూ. 10 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ మూడేళ్లలో రెండు మూడు అవగాహన సదస్సులు మినహా పెట్టింది లేదు. అంటే 500 హెక్టార్లకు ఒక్కో హెక్టారుకు రూ. 10 వేలు చొప్పున రూ. 50 లక్షలు అవుతుంది. ఇంకెంత మోతాదులో దోచుకున్నారో ఇంకా లోతుకు వెళ్లి విచారిస్తే తప్ప పూర్తి దోపిడీ బయట పడదన్న విషయాలు అర్థమవుతున్నాయి. నోరు మెదపని ఉద్యానవన శాఖాధికారులు సేంద్రియ వ్యవసాయం పేరుతో భారీ దోపిడీ చోటుచేసుకున్నా జిల్లాలోని ఉద్యానవన శాఖ అధికారులు నోరు మెదపటంలేదు. ఎందుకంటే అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ పాత్ర దీని వెనుక ఉండటంతో జిల్లా స్థాయి అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇంకా జిల్లాలో ఇలాంటి సంస్థలు సేంద్రియ వ్యవసాయం పేరుతో ఎన్ని రూ. కోట్లు దోపిడీ చేశాయో అన్నది లోతుల్లోకి వెళ్లి చూస్తేకాని వెలుగుచూడవు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కార్యాలయమే లేని సంస్థ సేంద్రియ వ్యవసాయం పేరుతో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన ఇకోవా సంస్థకు ఉలవపాడులో అసలు కార్యాలయమే లేదు. అవసరమైన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, సిబ్బంది ఉండాల్సి ఉంటే ఇద్దరు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. నామమాత్రంగా కొందరు రైతులకు కషాయాలు కలుపుకోవటానికి డ్రమ్ములు మాత్రం ఇచ్చారు. ఇకపోతే సేంద్రియ ఎరువులు, మందులు పేరుతో తూ.. తూ మంత్రమే చేశారు. వర్మీ కంపోస్ట్ పేరుతో తెనాలి నుంచి మట్టి సంచులు కొందరు రైతులకు పంపిణీ చేశారు. -
తహసీల్దార్ సేవలో..టీ బాయ్‌గా, కారు తుడుస్తూ!
సాక్షి, ఉలవపాడు(ఒంగోలు) : ప్రజలకు సేవలు చేయాల్సిన రెవెన్యూ సిబ్బంది తమ ఉన్నతాధికారుల సేవలో నిమగ్నమైపోతున్నారు. బానిసత్వ వ్యవస్థను ఎప్పుడో రద్దు చేసినా నేటికీ పలుచోట్ల అధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పలు పనులు చేయించుకుంటూ గతంలో పోలీసు శాఖలోని ఆర్డర్లీ వ్యవస్థను జ్ఞప్తికి తెస్తున్నారు. ఉలవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఈ పరిస్థితి నెలకొంది. ఉలవపాడు వీఆర్వోగా పనిచేస్తున్న రామాంజనేయులు తహసీల్దార్ నగేష్ వచ్చిన వెంటనే బస్టాండ్‌కు వెళ్లి ఫ్లాస్క్‌లో టీ తీసుకు రావాలి. వీఆర్వోగా ప్రజలకు సేవ పనిచేయాల్సిన అధికారి టీ బాయ్‌గా అవతారమెత్తడం గమనార్హం. ఇక తహసీల్దార్ విధులకు కారులో వస్తారు. ఆ కారును కరేడు వీఆర్ఏ రామకోటేశ్వరి భర్త శ్రీను రోజూ శుభ్రం చేయాలి. రామకోటేశ్వరి బదులు విధులకు ఆమె భర్త శ్రీను హాజరై తహసీల్దార్ వ్యక్తిగత సేవలో తరలిస్తూ ఉంటాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వీఆర్ఏ భర్త కారును శుభ్రం చేస్తూ.. వీఆర్వో టీఫ్లాస్క్ తెస్తూ కనిపించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డర్లీ వ్యవస్థపై ఇటీవల స్థానికంగా పెద్ద చర్చే నడుస్తోంది. బయట చెబితే రెవెన్యూ ఉన్నతాధికారులు ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని ఫొటోలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటం గమనార్హం. అటెండర్లతో టీ తెప్పించుకోవచ్చని, అలా కాకుండా ఒక అధికారితో తహసీల్దార్ టీ తెప్పించుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సొంత కారును కార్యాలయంలో కడిగించడం ఎంతవరకు సమంజసమని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. -
చెప్పులు, చొక్కా లేకుండా ప్రచారం
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): చంద్రబాబు నాయుడు బీసీలకు చేసిన మోసాలకు నిరసనగా కాళ్లకు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా, గుండు గీయించుకుని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు. బీసీలపై జగన్‌కున్న ప్రేమ, బీసీ డిక్లరేషన్‌లో ఆయన ప్రకటించిన నిర్ణయాలు నచ్చి జగన్‌కు అండగా నిలుస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు, ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన మిరియం శ్రీనివాసులు జిల్లా అంతటా వినూత్నంగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. బీసీలను చంద్రబాబు వంచించారని, జిల్లాలో ఒక్క ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి జగన్ సీఎం అయ్యేంత వరకు జిల్లా అంతటా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగడుతూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అన్ని గ్రామాలు తిరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి బీసీ ఇంటికి వెళ్లి జగన్ బీసీ కోసం చేస్తున్న కార్యక్రమాలు, అన్ని పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం, బీసీ నిధులకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. -
ఇంతకీ డ్రైవరా... డాక్టరా..?
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఏదైనా వైద్యశాలకు వెళ్లాలంటే అక్కడ ఎలా వైద్యం చేస్తారని కనుక్కుని వెళతాం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సీహెచ్‌సీలో కారు డ్రైవర్ ఇంజక్షన్లు, సెలైన్లు వేస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ వైద్యశాల అంటే ఎక్కువగా పేదలే వస్తుంటారు. వారి వైద్యం అంటే ప్రభుత్వానికి ఆటగా మారింది. ఉలవపాడు వైద్యశాలలో కంటి వైద్య నిపుణురాలుకి కారు ఉంది. ఆమె కావలి నుంచి ప్రతిరోజూ కారులో వస్తుంది. ఆమె కారు డ్రైవరే ఇప్పుడు వైద్యశాలలో వైద్యం చేస్తున్నాడు. ఉలవపాడు వైద్యశాలలో ఆరుగురు వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్టు, పిల్లల వైద్యనిపుణులు, పంటి వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, జనరల్ వైద్యులతో పాటు వైద్యాధికారిణి కూడా ఉన్నారు. వీరు ఓపీ చూసిన తరువాత ఇంజక్షన్లు లేదా, సెలైన్లు రాస్తారు. ఈ సెలైన్లను కారు డ్రైవర్ పెడతున్న పరిస్థితి నెలకొంది. శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులు ఉన్నా డ్రైవర్ పెడుతుండడంతో రోగులు భయాందోళనలు చెందుతున్నారు. భయాందోళనలో రోగులు.. రోగులు కారు డ్రైవర్ ఇంజక్షన్లు, సెలైన్లు పెడుతుండడంతో భయాందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎలాంటి శిక్షణ లేని వారు, వైద్యశాలకు సంబంధం లేని వారు వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వారి డ్రైవర్లు ఇలా చేస్తే ఎలా అని అడుగుతున్నారు. సిబ్బంది సైతం కారు డ్రైవర్లతో బాగుంటూ వారు చెప్పిన విధంగా చేస్తున్నారు. లేకుంటే వైద్యులకు చెప్పితమను ఇబ్బంది పెడతారేమో అని భయం సిబ్బందిలో ఉంది. దీంతో వారు వైద్యం చేస్తున్నా ప్రశ్నించడం లేదు. ఈ విషయంపై వైద్యాధికారిణి శోభారాణిని వివరణ కోరగాఈ విషయం నా దృష్టికి రాలేదు. ఒక్కరే నర్సు ఉన్న సమయంలో ఆమెకు సాయం చేస్తున్నారు. ఆపేయమంటు ఆపేస్తామని తెలిపారు. ఇలా అయితే ఎలా... ప్రస్తుతం ఉలవపాడు వైద్యశాలను ఎంఎల్‌సీసీ (మెడికో లీగల్ సెంటర్)గా మార్చారు. వివాదాలు, కొట్లాట కేసులు వస్తుంటాయి. వారికి వైద్యం చేసి వెంటనే పోలీసులకు రిపోర్టు అందజేయాలి. దీని పైనే కేసులు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం చేసిన సమయంలో ఏ ఇబ్బందులు జరిగినా దానికి బాధ్యత ఎవరు వహించాలి. లీగల్ కేసులు వస్తున్న పరిస్థితుల్లో శిక్షణ పొందిన వారు వైద్యం చేయాలని కోరుతున్నారు. బయట వ్యక్తులు కేసులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలు పునరావృతంకాకుండా చూడాలని రోగులు కోరుతున్నారు. -
ఆమె జీవిత కాలపు ‘ఎమ్మెల్యే ’
నల్గొండ : మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆలగడప గ్రామ పంచాయతీ పరిధిలోని సుబ్బారెడ్డిగూడెం పేరు చెబితే ఇద్దరు ఎమ్మెల్యేలు గుర్తుకువస్తారు. మూడు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించిన తిప్పన చినకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు తిప్పన విజయసింహారెడ్డి. ఆ గ్రామస్తులకు తెలిసిన జీవితకాలపు ఎమ్మెల్యే ఒకరున్నారు. ఆమే.. ఎమ్మెల్యే. అవునండీ ఆమె పేరే ఎమ్మెల్యే.. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి సీపీఎం అభ్యర్థి అరిబండి లక్ష్మీనారాయణ గెలుపొందారు. లక్ష్మయ్యకు అరిబండిపై ఉన్న అభిమానంతో తన కుమార్తెకు ‘ఎమ్మెల్యే’ అని పేరు పెట్టాడు. స్కూలు రికార్డుల్లోనూ ఎమ్మెల్యేగానే రాశారు. రేషన్‌కార్డులోనూ ఆమె పేరు ‘ఎమ్మెల్యే’ అని ఉంది. తల్లిదండ్రులు పెట్టిన పేరుతో జీవితకాలపు ఎమ్మెల్యే అయింది. ఓటరు పేరు హహహ.. తండ్రి పేరు కబబబ ఉలవపాడు (ప్రకాశం) : ఓటర్ల జాబితాలో చిత్రాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు బూత్ నంబర్ 247 పరిధిలో ఎపిక్ నంబర్ వైడీఆర్ 102370తో ఓ ఓటు ఉంది. ఈ ఓటరు పేరు హహహ దదద కాగా, తండ్రిపేరు కబబబ అని ఉంది. ఇంటి నబరు 23–23 అని ఉంది. ఈ గ్రామంలో కేవలం 16 వార్డులే ఉన్నాయి. ఇంటి నంబరు 23–23 ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఈ ఎపిక్ నంబర్‌ను ఆన్లైన్లో పరిశీలిస్తే ఆంగ్లంలో సుదర్శి కోటేశ్వరరావు తండ్రి నరశింహ అని రాగా, తెలుగులో హహహ దదద అని వస్తోంది. -
హైవేపై ఆయిల్ దొంగలు..!
ప్రకాశం , ఉలవపాడు: జాతీయ రహదారిపై దొంగలు హల్చల్ చేస్తున్నారు. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాల నుంచి ఆయిల్‌ను దొంగిలిస్తున్నారు. ప్రధానంగా మన్నేటికోట అడ్డరోడ్డు, కరేడు ర్యాంపు, చాగల్లు సెంటర్లలో దొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. 15 రోజుల కాలంలో ఈ చోరీలు అధికమయ్యాయి. మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద పది రోజుల క్రితం వరుసగా రెండు రోజులపాటు ఆయిల్ చోరీ చేశారు. ఒక రోజు నిలిపి ఉంచిన లారీ నుంచి 300 లీటర్లు డీజిల్ దొంగతనం చేశారు. మరుసటి రోజే రెండు లారీల నుంచి 200 చొప్పున 400 లీటర్ల ఆయిల్ చోరీ చేశారు. కరేడు ర్యాంపు వద్ద 8 గంటల సమయంలోనే డ్రైవర్ టిఫిన్ చేస్తుండగా డీజిల్ చోరీ జరిగింది. ఈ లోపు డ్రైవర్ క్యాబిన్లో నగదు కూడా తీసుకెళ్లారు. ఈ ఆయిల్ దొంగతనాల గురించి లారీ డ్రైవర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఐదు రోజుల క్రితం మన్నేటికోట రోడ్డు వద్ద పోలీస్ జీప్ వస్తున్న సమయంలో క్యాబిన్లోకి ఎక్కి ఉన్న ఇద్దరు దొంగలు పారిపోయారు. దొంగల భయంతో వాహనాలు నిలపాలంటేనే లారీ డ్రైవర్లు భయపడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న దొంగలు... జాతీయ రహదారిపై ఎక్కువగా ఆయిల్ దొంగతనానికి వస్తున్నవారు ద్విచక్ర వాహనాలపై వస్తున్నారు. ఒకరు వాహనంపై బండిస్టార్ట్ చేసి ఉంటున్నారు. ఈ లోపు మరొకరు క్యాబిన్లోకి ఎక్కి దొంగతనాలు చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం పోలీస్ వాహనం వెంబడించినప్పుడు ఇదే పరిస్థితి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తిప్పకు చెందిన వారు జాతీయ రహదారిపై ఇలా చోరీలకు పాల్పడుతున్నారని లారీ డ్రైవర్లు అంటున్నారు. హైవేపై ఎక్కువగా భోజనం, బిర్యానీ కోసం లారీలు ఆగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో గత నెల కాలంగా చోరీలు అధికమయ్యాయి. గతంలో డీజిల్ దొంగలు ఈ ప్రాంతంలో బొలెరో వాహనంలో వచ్చి చోరీలు చేసేవారు. అప్పట్లో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అలానే ఈ దొంగలను కూడా పట్టుకోవాలని కోరుతున్నారు. హైవే మొబైల్ లేకపోవడంతో అధికమైన చోరీలు: నిత్యం గస్తీ తిరిగే హైవే మొబైల్ వాహనం 45 రోజులుగా లేదు. ఈ వాహనంలో పనిచేసే సిబ్బంది కూడా ద్విచక్ర వాహనాలపై తిరగాల్సి వస్తుంది. రాత్రిపూట వారే రాజుపాలెం జంక్షన్ వద్ద రాత్రి భయపడుతూ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వాహనం ఉంటే కాస్త దొంగలకు భయంగా ఉండేది. కానీ ఇప్పుడు వాహనం లేకపోవడంతో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వాహనం నిలపాలంటే భయపడుతున్న డ్రైవర్లు దొంగలను అరికట్టాలని కోరుతున్నారు. జాతీయ రహదారిపై జరుగుతున్న చోరీలు నిలపాలని, దొంగలను పట్టుకొని వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. -
అంతా మాయ!
♦ కార్పొరేట్ విద్యకు దూరం అయిన పేద విద్యార్థులు ♦ పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించినా ఆదుకోని పథకం ♦ సర్వర్ మొరాయించడంతో పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు ♦ ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తోందనే విమర్శలు ♦ గడువు పొడిగిస్తేనే విద్యార్థుకు న్యాయం ఉలవపాడు:పేదలు కార్పొరేట్ విద్యను అందుకోలేరు. అంత స్థాయిలో ఫీజులు చెల్లించడం అసాధ్యం. అందుకే ప్రభుత్వం ఓ పథకాన్ని ముందుకు తెచ్చింది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా విద్య అందించే అవకాశం కల్పించింది. దానికి గాను ఈనెల 18 నుంచి 27 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదో తరగతిలో 7 జీపీఏ పాయింట్లకంటే పైగా తెచ్చుకున్న విద్యార్థులను అర్హులుగా తేల్చింది. తీవ్ర నిరాశ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసినా.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా సర్వర్ మొరాయించింది. ఇది ప్రభుత్వం కావాలని చేస్తోందా లేక ఇంటర్నెట్ సిగ్నల్‌లో సమస్యా అని ఎవరికీ అంతుబట్టడంలేదు. మూడు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పథకానికి చివరి తేదీ 27 గా ప్రకటించారు. కానీ చివరి మూడు రోజులు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా పేద విద్యార్థులు కార్పొరేట్ ఉచిత విద్యకు అవకాశం కోల్పోయారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తుది గడువు తేదీని పొడిగించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయాలి.. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 7 గ్రేడు లేదా ఆ పైన మార్కులు సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో సంబంధిత సైట్ లో అప్లికేషన్ ఫాంమ్‌ను డౌన్లోడ్ చేసుకుని హాల్‌టికెట్ వివరాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఫొటో వంటి వివరాలు అప్లోడ్ చేయాలి. అనంతరం కావాల్సిన కార్పొరేట్ కళాశాల ను వరుస క్రమంలో తెలియచేయాలి. అన్నీ సమస్యలే.. నెట్లో దరఖాస్తు చేద్దామని వెళితే సంబంధిత వెబ్సైట్ పనిచేయకపోవడంతో అంతా వెనక్కు వస్తున్నారు. కొన్ని సార్లు సైట్ వచ్చినా అందులో 2015–16 విద్యా సంవత్సరం అని కనిపిస్తోంది. అలాగే దరఖాస్తు చేసినా మొబైల్‌కు మెసేజ్ రావడం లేదు. దీంతో అసలు దరఖాస్తు చేశామా లేదా అని ఎవరికీ అర్థం కావడంలేదు. ప్రభుత్వ నిర్వాకం వలన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. -
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..
► గుర్తించి అప్పగించిన చీరాల విద్యార్థులు ఉలవపాడు: మండల పరిధిలోని చాగల్లు గ్రామానికి చెందిన షణ్ముఖసాయి సోమవారం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే చీరాల సెయింట్‌మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల కు చెందిన విద్యార్థులు బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అప్పగించారు. శింగరాయకొండ వివేకానంద స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సాయి తిరుపతి వెళ్లే ప్యాసింజరు రైలు ఎక్కాడు. ఇదే రైలులో ఇంటర్ పరీక్షల ముగించిన విద్యార్థులు తమ అధ్యాపకునితో తిరుపతి దర్శనానికి బయలుదేరారు. బాలుడుని గమనించి తప్పిపోయాడని గుర్తించారు. వారితో పాటు తిరుపతి తీసుకెళ్లారు. అక్కడ దర్శనం అయ్యేవరకు విద్యార్థి తన వివరాలు చెప్పలేదు. తర్వాత అతని తండ్రికి ఫోన్ చేయించారు. బుధవారం హౌరా ఎక్స్‌ప్రెస్‌లో శింగరాయకొండకు తీసుకువచ్చి తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టారు. శ్రీరంగంసాయితేజ, నిమ్మా రమణారావు, గడ్డం శ్రీకాంత్, మీసాల భాస్కరరావు, దారపు అనిల్, కొండమూడ ఉదయకిరణ్, ఎస్. మణికంఠను గ్రామస్తులు అభినందించారు. -
రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
మినీలారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ ముందు లారీని ఢీకొట్టి ఒకరు బస్సు ఢీకొనడంతో మరొకరు ఉలవపాడు : జాతీయ రహదారిపై ఉలవపాడు పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. కొండపి నుంచి నెల్లూరులోని ఓ మిల్లుకు మినీ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. వేగంగా వెళ్తున్న లారీ రాజుపాళెం సమీపంలోని చాముండేశ్వరీదేవి గుడి వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీలారీ క్యాబిన్లో ఉన్న నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్ములపాళెం గ్రామానికి చెందిన జగ్గం ప్రభాకర్ (40) అక్కడికక్కడే మతి చెందాడు. ఈ ప్రమాదంతో రేషన్ బియ్యం అక్రమ తరలింపు కూడా బయటపడింది. లారీపైన ముగ్గురు కూలీలు కూడా ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. మరో ఘటనలో లారీ క్లీనర్.. చాగల్లు వద్ద రోడ్డు దాటుతున్న లారీక్లీనర్ను నెల్లూరు కోమట్ల ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మతి చెందాడు. సూళ్లూరుపేట నుంచి విజయవాడకు లోడుతో వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్ పడుకున్నాడు. విజయవాడ బస్టాండ్ సెంటరుకు చెందిన క్లీనర్ కలగాటి అప్పారావు (49) అక్కడ రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని మృతి చెందాడు. రెండు సంఘటనల్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. -
అధికారులా..మజాకా..!
ఉలవపాడు(ప్రకాశం): అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. సమన్వయ లోపానికి ఇదో మచ్చు తునక. ‘ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్టేయ్’మన్న చందంగా ఇసుక తవ్వకం దందా సాగుతున్నాగానీ, ఇటు మైన్స్ అధికారులుగానీ అటు రెవెన్యూ అధికారులుగానీ అటువైపు చూడకపోవడంతో 50 వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వి తరలించుకు పోయూరు. అసలేం జరిగింది..? ప్రకాశం జిల్లా ఉలవ పాడు మండల పరిధిలో ఉచితంగా ఇసుక తోలుకోవడానికి ఒక రీచ్‌ను కేటాయించారు. ముందుగా రెవెన్యూ, మైనింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేసి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దీన్ని ఉలవపాడు మండలంలోని కొల్లూరుపాడు-రాజుపాలెం మధ్యలో ఉన్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు ఒంగోలు కలెక్టరేట్ నుంచి ఈ రీచ్‌కు అనుమతి వచ్చింది. ఆర్డీఓ, తహసీల్దార్లు విలేకరుల సమావేశంలో ఈ రీచ్ నుంచి 42 క్యూబిక్ మీటర్ల ఇసుక తోలుకోవచ్చని తెలిపారు. దీంతో నెల నుంచి ఇసుకను వివిధ వర్గాలకు చెందినవారు భారీగా తరలించారు. అనుకున్న దాని కన్నా ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నారని కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున, డీఎస్పీ శ్రీనివాసరావులు బుధవారం రీచ్ వద్దకు వచ్చారు. మైనింగ్ శాఖ అధికారులు కూడా రీచ్‌కు చేరుకొని ఇంకా రాలేదేమిటని ఆర్డీవో, తహసీల్దార్లకు ఫోన్ చేయడంతో.. తామంతా రీచ్ దగ్గరే ఉన్నామని వారు తెలిపారు. ఎక్కడున్నారని ఆరా తీసి కొల్లూరుపాడు రీచ్ వద్దకు వచ్చిన మైనింగ్ శాఖ ఏడీ రామచంద్రరావు కంగుతిన్నారు. తాము ఇచ్చిన రీచ్ ఇది కాదని, మరోచోటని ఆర్డీఓకు తెలిపారు. అంటే రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిసిన రీచ్ ఒకటి, మైనింగ్‌శాఖ తెలిపిన రీచ్ మరొకటి. అంటే అధికార యంత్రాగం ఎంత నిద్రపోతోందో ఈ ఘటనతో అర్థమవుతోంది. రీచ్ ఎక్కడో తెలియకుండానే నెల రోజులుగా తవ్వుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పరిసర ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తేలిగ్గా తీసేసిన అధికారులు... ఇంత జరిగినా జరిగిందేదో జరిగిపోరుుందంటూ ఆర్డీఓ తేలికగా తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటి వరకు తెలిసే ఇదంతా చేశారా? ఎన్ని లక్షలు చేతులు మారాయంటూ అక్కడున్నవారు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆత్మకూరుకు చెందిన హనుమంతరావు అనే రైతు మాట్లాడుతూ అధికారులు ఇక్కడ ఉంటే అక్రమాల గుట్టు తెలుస్తుంది.. హెచ్ఆర్ఏ తీసుకుంటూ ఎక్కడో ఉంటున్నారు. వారి పై ఎందుకు చర్యలు తీసుకోరు..? దీనిపై నేను క్యాంపు ఆఫీస్‌లో ఫిర్యాదు చేస్తాను’ అని ఆర్డీఓతో వాగ్వివాదానికి దిగితే ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’ అంటూ నిర్లక్ష్యంగా అక్కడినుంచి వెళ్లిపోయూరు. ఒక్కట్రాక్టర్ తీసుకెళితే కేసులు నమోదు చేయిస్తున్న ప్రభుత్వం కేటారుుంచని రీచ్ నుంచి 50 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం జరిగి ట్రాక్టర్లతో ఇసు క తరలిస్తే చర్యలు తీసుకోరా..? అని రైతులు నిలదీశారు. అనుమతులు ఇచ్చిన రీచ్ చినిగేవారిపాలెం వద్ద ఉంది. మరి దానికి రాజుపాలెం-కొల్లూరుపాడు అని ఎందుకు పేరు పెట్టారని మైన్స్ అధికారులు ప్రశ్నించగా.. ఆ సమయంలో ఇది వద్దనుకుని వెళ్లామని ఆర్ఐ సుందరరామయ్య సమాధానమిచ్చారు. మైనింగ్ అధికారులు జోక్యం చేసుకుని ఈ ప్రాంతానికి కొల్లూరుపాడు అని ఎందుకు చెప్పారని, దీనికి సంబంధించిన సంతకాలు కూడా తహసీల్దార్ పెట్టారని చూపించారు. దీంతో అధికారుల మధ్య సమన్వయలోపం బయటపడింది. -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కల్యాణ్(15) అనే 9వ తరగతి విద్యార్ధి వల్లూరుపాడు వంకలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఐదుగురు స్నేహితులు సరదాగా ఈత కొట్టడానికి వంకకు వెళ్లారు. వంకలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కల్యాణ్ దిగడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు గ్రామస్థులకు సమాచారమివ్వడంతో కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. అతనికి ఈత రాకపోవడం కూడా మృతికి కారణంగా తెలుస్తుంది. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
మంటల్లో ఓల్వో
-
ఆ నూనె.. ప్రాణాంతకం!
రంగు.. రుచి.. చిక్కదనం..! ఈ స్లోగన్ ఓ టీ పొడి కంపెనీదని అందరికీ తెలుసు. అంటే టీ పొడిలో ఆ మూడు గుణాలు ఉంటాయని వినియోగదారులకు సదరు కంపెనీ యాజమాన్యం చెబుతుంతోంది. వీరి వ్యాపారానికి పభుత్వ అనుమతి ఉండే ఉంటుంది. కల్తీ నూనె విషయంలో అక్రమార్కులు కొందరు అదే తరహాలో ప్రచారం చే స్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. వీరి వ్యాపారం అక్రమం. ఫలితంగా సామాన్యులు అనారోగ్యం పాలవుతున్నారు. * జంతు కళేబరాలతో తయారవుతున్న ఆయిల్ * ఆటోల్లో అర్ధరాత్రి తరలింపు * తక్కువ రేటుకు హోటళ్లకు సరఫరా * అనారోగ్యం పాలవుతున్న ప్రజలు ఉలవపాడు : జిల్లాలో కల్తీ నూనె వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. అర్ధరాత్రి ఆటోల్లో కొన్ని దుకాణాలకు రహస్యంగా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ నూనె పీపాలను ఉలవపాడు నుంచి సింగరాయకొండ, కందుకూరులోని పలు షాపులకు తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. జంతు కళేబరాలతో నూనెను తయారు చేసి.. నల్లరంగు వేసి ఉన్న డబ్బాల్లో అచ్చం నూనెను పోలి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయట ప్రాంతంలో తయారవుతున్న కల్తీ నూనెను రాత్రి వేళల్లో మాత్రమే షాపులకు తరలిస్తున్నారు. ప్రతి రెండు రోజులకు సుమారు 7 నుంచి 10 పీపాలు ఒక్క ఉలవపాడుకు సరఫరా చేస్తున్నారంటే అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పీపాలో 220 లీటర్ల నూనె ను నింపుతారు. వ్యాపారులు చిన్న డబ్బాల్లోకి మార్చి ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. కల్తీ నూనెను పామాయిల్ రేటుకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు కూడా ఆ నూనెను వాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ వినియోగించే హోటళ్లకు చాలా తక్కువ ధరకే అమ్ముతుండటంతో వ్యాపారులు కూడా పోటీ పడి మరీ కొట్టున్నట్లు సమాచారం. ఇట్టే.. గుర్తు పట్టొచ్చు ఇటీవల ఓ పండుగకు ఉలవపాడు హైస్కూల్ సంఘానికి చెందిన రైల్వే ఉద్యోగికి ఓ దుకాణం యజమాని కల్తీ నూనె అమ్మాడు. ఇంటికి తీసుకెళ్లి కూర వండిన తర్వాత దుర్వాసన రావడంతో సదరు ఉద్యోగికి అనుమానం వచ్చింది. నూనె కల్తీ జరిగిందని గ్రహించి దుకాణ యజమానిని నిలదీశాడు. సదరు యజమాని హడావుడిగా డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. గుర్తు పట్టలేని ఎందరో ప్రజలు క ల్తీ నూనె భారిన పడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కొందరు అప్రమత్తమై హోటళ్లకు వెళ్లడం మానేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కల్తీ నూనెలో ఎముకల పొడి, కుళ్లిన కళేబరాల అవశేషాలు ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని చెబుతున్నారు. వ్యాపారుల దందా అధికారులకు తెలిసే ఉంటుందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్తీ నూనె విక్రయాలపై కన్నెర్రజేయాలని కోరుతున్నారు. కల్తీ నూనె అమ్మారు : కర్రెద్దుల బాబూరావు, ఉలవపాడు ఉలవపాడులో ఓ దుకాణం యజమాని నాకు కల్తీ నూనె అమ్మాడు. ఇంటికి వెళ్లి దాంతో కూర వండితే అంతా చేదుగా మారింది. వెంటనే వెళ్లి ఆ వ్యాపారిని నిలదీశా. గొడవ వద్దు మాట్లాడుకుందాం.. అని బతిమాలాడు. ప్రజలు కల్తీ నూనె విషయంలో అప్రమత్తంగా ఉండాలి. -
బీభత్సం సృష్టించిన బాంబుస్క్వాడ్ వాహనం
ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై బాంబుస్క్వాడ్ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడపడంతో బైక్‌ను ఢీ కొట్టి రిక్షావాలాపై దూసుకెళ్లింది. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబుస్వ్కాడ్ వాహనాన్ని ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
మళ్లీ తెరపైకి రామాయపట్నం పోర్టు
{పకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు 2,135 ఎకరాల భూసేకరణ కోసం కసరత్తు పోర్టుకు కేంద్రం సానుకూలత ఒంగోలు: రామాయపట్నం పోర్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు సమీపంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు రాగా, వాటిని రద్దుచేసి దీనికి బదులుగా దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణానికి గత యూపీఏ ప్రభుత్వం 2013 మే 9న ప్రతిపాదనలు మార్చింది. అయితే అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ పోర్టు నిర్మాణానికి పలు పర్యావరణ సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పోర్టు నిర్మాణం వల్ల అక్కడి విదేశీ పక్షుల విడిది, పులికాట్ సరస్సు కలుషితమవుతాయని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. 40 వేల మంది జాలర్లు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దుగ్గరాజుపట్నం పోర్టును భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా వ్యతిరేకిస్తోంది. దీంతో రామాయపట్నంలోనే పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రకాశం జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రామాయపట్నం పోర్టు సాధన సమితి కూడా ఏర్పడింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన కేంద్ర బృందం రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా నుంచి పొగాకు, గ్రానైట్, ఉప్పు, పత్తి, జీడిపప్పు లాంటి వస్తువులు జిల్లా నుంచి ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. పోర్టు నిర్మించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరిశీలనా బృందం నెల రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. పోర్టు నిర్మాణానికి గతంలో 5 వేల ఎకరాలు కావాల్సి ఉంటుందన్న ప్రతిపాదనను మారుస్తూ, 2,135 ఎకరాల స్థలంలోనే పోర్టు నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఇందులో 1,200 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంది. దీనికిగాను గత ప్రభుత్వం రూ.420 కోట్లను కేటాయించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది కాలనీలను తొలగించాలి. ఇందులో నివసిస్తున్న 2,200 మందికి ప్రత్యామ్నాయం చూపించాలి. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవుతుందని అంచనా. రోజూ 30 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆరు బెర్తులతో నిర్మాణం చేపట్టి, ఫిషింగ్ హార్బర్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఉండగా, దుగ్గరాజుపట్నం పోర్టు అవసరం అక్కడ ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టడం వల్ల సరుకుల రవాణా కూడా సులభతరమవుతుందని ఆలోచిస్తున్నారు. దీనిపై రామాయపట్నం పోర్టు సాధన సమితి సభ్యులు త్వరలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలవనున్నారు. కాకతీయుల కాలంలోనే పోర్టు ప్రకాశం జిల్లాలో కాకతీయుల కాలంలోనే పోర్టు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. చిన గంజాం సమీపంలోని మోటుపల్లి వద్ద ఆనాటి ఓడరేవు శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అప్పట్లో మోసలపురంగా పిలిచే ఈ ప్రాంతంలో సముద్ర తీరం వంపుగా ఉండటంతో ఓడలు ఆగడానికి వీలుగా ఉందని ఈ ప్రాంతాన్ని ఓడరేవుగా ఉపయోగించుకున్నారు. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఈ ప్రాంతంలో పర్యటించినట్లు మెకంజీ తన పరిశోధనా గ్రంథంలో ఉటంకించారు. ఆయనతో పాటు పలువురు గ్రీకు నావికులు కూడా ఈ ఓడరేవు గురించి పేర్కొన్నారు. ఇక్కడ ఓడరేవుకు గుర్తుగా మూడు ఆలయాలను కూడా నిర్మించారట. ప్రస్తుతం వీరభద్రస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవీ శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేపట్టేందుకుగాను స్థల సేకరణ చేపట్టాలని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భావించారు. అయితే ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు కనుమరుగైంది. రామాయపట్నంలో కానీ, మోటుపల్లిలో కానీ ఓడరేవు నిర్మాణం చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
ప్యాకేజీలతో నాయకులకు వల
ఉలవపాడు, న్యూస్‌లైన్ : నాయకులంటే కార్యకర్తలకు అండగా ఉండాలి. వారి సమస్యలు పరిష్కరిస్తూ నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. కానీ, ప్రస్తుత నేతలు తమ వద్ద ఉన్న నాయకులు, కార్యకర్తలను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారు. ఉలవపాడు మండలంలోని ఇలాంటి నాయకుల తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా ఆ పార్టీ శ్రేణులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అయోమయంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల కోసం టీడీపీ నేతలు వేట ప్రారంభించారు. టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గంగా మారి ఆ పార్టీలో చేరాలని, అలాచేస్తే ప్యాకేజీలు ఇప్పిస్తామని కొందరు టీడీపీ నాయకులు.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా టీడీపీ నేత దివి శివరాంకు వ్యతిరేకంగా పనిచేసినందున.. ఆయనతో సంబంధం లేకుండా నేరుగా కావలి వెళ్లి ఆదాల ఆధ్వర్యంలో టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్యాకేజీల కోసం కావలి, కందుకూరు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి వారికి వద్ద ఉన్న కార్యకర్తలకు ఏమీ అర్థం కావడం లేదు. తమను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసం నాయకులు ఎగబడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఏ పార్టీలోకీ రామని తెగేసి చెబుతున్నారు. కానీ, కందుకూరు నియోజకవర్గంలో మంచి ఊపుమీదున్న వైఎస్ఆర్ సీపీని తట్టుకోవాలంటే తటస్థంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు వల వెయ్యాలని టీడీపీ నాయకులు నానాకష్టాలు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ప్యాకేజీలు ఇవ్వని శివరాం కూడా ఇప్పుడు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీ నాయకులు ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎటూకాకుండా పోయిన దాదాపు 20 మంది కాంగ్రెస్ నాయకులను ఆదాల అనుచరులు కలిసి ప్యాకేజీలు ప్రకటించారు. ఈ ప్యాకేజీలకు కొందరు సుముఖత వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అధిక మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. 100 ఓట్లున్న ఓ నాయకునికి 50 వేల రూపాయలు ఆఫర్ చేయగా.. ఆ నాయకుడు లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన కార్యకర్తలు, ప్రజలు తమ నాయకులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తమను అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు పుచ్చుకుంటున్న వారివెంట వెళ్లేది లేదని వారంతా స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ప్యాకేజీలు మాట్లాడుకున్న కొందరు నేతలు.. తమ వెనుక ఎవరూ రాకపోతుండటంతో తలలు పట్టుకుని కూర్చున్నారు.