
ఉలవపాడుః ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడ బంగినపలి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. 16 వ నెంబరు జాతీయరహదారి పై ఒంగోలు –కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో షుమారు 15 వేల ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరిమామిడి, పునారస్, హిమామ్‌పసంద్ రకాలు సాగు చేస్తారు.
ప్రతి ఏడాది మార్చి నుండి జులై వరకు సీజన్‌సాగుతుంది. ఎకరమునకు 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బంగినపల్లి రకం అత్యధికంగా టన్ను 30 నుంచి 45 వేల వరకు పలుకుతుంది. మిగిలిన రకాలు తక్కువ రేటు ఉంటుంది. ఏడాదికి సుమారు 90 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుంది. బంగినపల్లి రకం షిప్పులు, విమానాలలో అమెరికా, ఇంగ్లాండ్‌లకు పంపిస్తారు. బెంగుళూరు రకం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. ఫల రాజుగా పేరొందిన మామిడి కాయలకు ఉలవపాడు ప్రాంతం ఫేమస్ గా చెప్పుకోవచ్చు.