Banginapalli mango
-
‘బంగినపల్లి’కి అరబ్ దేశాల్లో క్రేజ్
కర్నూలు(అగ్రికల్చర్): అద్భుతమైన రుచి.. ఆకట్టుకునే రూపం.. గుబాళించే సువాసన.. మన బంగినపల్లి మామిడి సొంతం. భారతీయులతోపాటు అరబ్, యూరోప్ దేశాల ప్రజలు కూడా ఈ మధుర ఫలాన్ని లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగినపల్లి (బేనీషా) మామిడికి పుట్టినిల్లు అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగుచేస్తున్న పండ్లకు అరబ్ దేశాల్లో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 25వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. గత ఏడాది సగటున ఎకరాకు 2 నుంచి 3 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 3-4 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో లక్ష టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. దీనిలో 80 నుంచి 90 శాతం వరకు బంగినపల్లి ఉంటుంది. బంగినపల్లి రకం మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో రెండు, మూడేళ్లుగా రైతులు నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గూడూరు, ఓర్వకల్, వెల్దుర్తి, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, కల్లూరు, కర్నూలు, దేవనకొండ, డోన్, క్రిష్ణగిరి తదితర మండలాల్లో కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. చీడపీడల బెడద, కెమికల్స్ ప్రభావం మామిడిపై పడకుండా ఫ్రూట్ కవర్స్ కూడా వినియోగిస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత పెరుగుతోంది. రైతులకు ఉద్యానవనశాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ బడా వ్యాపారులు వచ్చి కొనుగోలు.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి బడా వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. తోటల్లోనే 20 కిలోల బాక్సుల్లో పండ్లను ప్యాకింగ్ చేసి ఆయా నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి అరబ్, యురోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పండిన పండ్లలో 40 శాతం ముంబైకి తీసుకువెళ్లి, అక్కడి నుంచి అరబ్ దేశాలైన దుబాయ్, సౌదీ, కువైట్‌కు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది 2,500 టన్నుల వరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. టన్ను ధర రూ.80 వేల నుంచి రూ.1.05లక్షల వరకు లభించింది. ఈ ఏడాది 5వేల టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మామిడి కొనుగోలు కోసం మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో మామిడికి ఎన్నడూ లేని విధంగా టన్ను ధర రూ.లక్షకు పైగా పలికింది. ఇటీవల మార్కెట్‌కు మామిడి తాకిడి పెరిగిన తర్వాత ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టన్ను ధర రూ.40 వేల వరకు లభిస్తోంది. నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడిలో నాణ్యత పెరిగింది. 50 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేశాం. ఇందులో 85 శాతం చెట్లు బేనీషా రకానికి చెందినవే. ఎగుమతులకు అనువైన నాణ్యత ఉండాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా రసాయనాలు వాడటం లేదు. ఇందువల్ల మామిడిలో నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి కావడంలేదు. ముంబై, తమిళనాడు, హైదరాబాద్ వ్యాపారులు వచ్చి మామిడి కొంటున్నారు. – గొల్ల శ్రీరాములు, గూడూరు -
ఆంధ్రా మామిడి ‘అదుర్స్’.. రికార్డు స్థాయిలో..
సాక్షి, అమరావతి: మామిడి సీజన్ రైతులకు మంచి ‘ఫలాల’తో మొదలైంది. ప్రభుత్వ చర్యలు, రైతులకు ఇచ్చిన సలహాలతో మంచి నాణ్యత కలిగిన పండ్లు వచ్చాయి. దీంతో రికార్డు స్థాయిలో ధర పెరిగింది. వివిధ రాష్ట్రాల వ్యాపారులు తోటల వద్దకు వచ్చి మరీ కొంటున్నారు. గతేడాది టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష పలికిన బంగినపల్లి ఈ ఏడాది ప్రారంభంలోనే రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు పలుకుతోంది. కృష్ణాజిల్లాలో రెడ్డిగూడెం, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో పక్వానికి వచ్చిన నాణ్యమైన మామిడి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం గత రెండేళ్లూ మామిడి మార్కెట్‌ను కరోనా దెబ్బ తీసింది. కరోనా ప్రభావం లేకపోవడంతో ఈసారి కాస్త మంచి రేటు వస్తుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో ఆరంభంలోనే రికార్డు స్థాయి ధర పలకడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాష్ట్రంలో పండే బంగినపల్లి , సువర్ణరేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాదు.. విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. ఎగుమతుల కోసం ఇప్పటికే 18,486 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏడాది 3.35 లక్షల హెక్టార్లలో మామిడి సాగవగా, హెక్టార్‌కు గరిష్టంగా 12 టన్నుల చొప్పున 40.26 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. సత్ఫలితాలిస్తున్న తోటబడులు ఆర్బీకేల కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ తోట బడుల కార్యక్రమంతో పాటు ఫ్రూట్ కేర్ విధానాల వల్ల దిగు బడుల్లో నాణ్యత పెరిగింది. కాయ రెట్టింపు సైజు వచ్చి, బరువు కూడా పెరిగింది. సాధారణంగా కిలోకి 4, 5 కాయలు తూగుతాయి. ఫ్రూట్‌కేర్ విధానం వల్ల కిలోకి రెండుకు మించి తూగడంలేదు. బుట్ట కట్టడం వలన తెగుళ్లు సోకడంలేదు. పురుగుల మందులు వాడే అవకాశం లేదు. మచ్చలు లేవు. తద్వారా నాణ్యత పెరుగుతోంది. తెలంగాణ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బాగుండటంతో రేటు పెంచేందుకు కూడా వెనుకాడటం లేదు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగుంట గ్రామానికి చెందిన రైతు చేబ్రోలు శ్రీనివాసరావుకు 20 ఎకరాల మామిడి తోటలున్నాయి. మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. వైఎస్సార్ తోట బడుల్లో అధికారుల సలహాలు పాటించారు. ఫ్రూట్‌కేర్ విధానంలో పండ్లకు బుట్టలు కట్టారు. తెగుళ్లు సోకలేదు, మందులు వాడలేదు. ఎకరాకు 4 టన్నుల దిగుబడి వస్తోంది. నాణ్యత పెరగడంతో మంచి ధర పలికింది. తెలంగాణకు చెందిన వ్యాపారులు టన్ను రూ.1.30 లక్షల చొప్పున 2 టన్నులు కొన్నారు. ఢిల్లీ వ్యాపారులు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 6 టన్నులు, ముంబై వ్యాపారులు రూ.1.15 లక్షల చొప్పున 5 టన్నులు కొన్నారు. ఇంత ధర గతంలో లేదని శ్రీనివాసరావు తెలిపారు. టన్ను రూ.1.20 లక్షలకు అమ్మాం మాకు ఆరెకరాల మామిడి తోట ఉంది. ఫ్రూట్‌కేర్ విధానం వల్ల పండ్ల నాణ్యత పెరిగింది. గతేడాది గరిష్టంగా టన్ను రూ.లక్ష పలికింది. ఈ ఏడాది టన్ను రూ.1.20 లక్షలు పలికింది. ఇటీవలే 5 టన్నులు అమ్మాం. వ్యాపారులు తోటకే వచ్చి పట్టుకెళ్లారు. – సీహెచ్, కృపారాజు, రెడ్డికుంట, కృష్ణా జిల్లా పండ్ల నాణ్యత బాగుంది ఏపీలో ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఫ్రూట్ కేర్ విధానాలు పాటిస్తుండడం వలన పండ్ల నాణ్యత పెరిగింది. ఏ ఒక్క కాయమీద మచ్చ కన్పించలేదు. మంచి సైజు వస్తోంది. రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 10 టన్నులు కొన్నాం. మరో 20 టన్నులు రూ.80 వేల నుంచి రూ.లక్ష చొప్పున కొన్నాం. ఢిల్లీ, బిహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాలకు ఎగుమతి చేస్తాం. – మహ్మద్ అబ్దుల్ అలీమ్, ఆల్ నఫే ఫ్రూట్ కంపెనీ త్వరలో బయ్యర్స్–సెల్లర్స్ మీట్ వైఎస్సార్ తోట బడులు ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు ఇస్తుండటంతో మంచి ఫలితాలొస్తున్నాయి. ఈ ఏడాది ఎక్స్పోర్ట్ క్వాలిటీ దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) సౌజన్యంతో విజయవాడ, తిరుపతిల్లో బయ్యర్స్– సెల్లర్స్ మీట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యానవన శాఖ -
దక్షిణ కొరియా మార్కెట్లో ఏపీ బంగినపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: భౌగోళిక గుర్తింపు (జీఐట్యాగ్) పొందిన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడికాయలు దక్షిణ కొరియాకు భారీగా ఎగుమతి అవుతున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశీయంగా జీఐ ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించే క్రమంలో కొత్త ఉత్పత్తులతో కొత్త ఎగుమతి గమ్యస్థానాలు కూడా గుర్తిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చదవండి: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే భౌగోళిక గుర్తింపు పొందిన డార్జిలింగ్ టీ, బాస్మతి బియ్యం, నాగా మిర్చి, అస్సాం నిమ్మకాయలు, మణిపూర్ కచాయ్ లెమన్, మిజో చిల్లి, అరుణాచల్ ఆరెంజ్, మేఘాలయ ఖాసి, త్రిపుర క్వీన్ పైనాపిల్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపింది. ఇలా పలు జీఐ ట్యాగ్ ఉత్పత్తులు పలు దేశాలకు భారీగా ఎగుమతి అవుతూ నూతన మార్కెట్లను సొంతం చేసుకుంటున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. -
ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి....
ఉలవపాడుః ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడ బంగినపలి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. 16 వ నెంబరు జాతీయరహదారి పై ఒంగోలు –కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో షుమారు 15 వేల ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరిమామిడి, పునారస్, హిమామ్‌పసంద్ రకాలు సాగు చేస్తారు. ప్రతి ఏడాది మార్చి నుండి జులై వరకు సీజన్సాగుతుంది. ఎకరమునకు 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బంగినపల్లి రకం అత్యధికంగా టన్ను 30 నుంచి 45 వేల వరకు పలుకుతుంది. మిగిలిన రకాలు తక్కువ రేటు ఉంటుంది. ఏడాదికి సుమారు 90 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుంది. బంగినపల్లి రకం షిప్పులు, విమానాలలో అమెరికా, ఇంగ్లాండ్‌లకు పంపిస్తారు. బెంగుళూరు రకం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. ఫల రాజుగా పేరొందిన మామిడి కాయలకు ఉలవపాడు ప్రాంతం ఫేమస్ గా చెప్పుకోవచ్చు. -
Nuziveedu Mango: లండన్‌కు బంగినపల్లి మామిడి
సాక్షి, అమరావతి: కరోనా విపత్తులోనూ మామిడి ఎగుమతుల జోరు కొనసాగుతుంది. రెండ్రోజుల క్రితం దక్షిణకొరియాకు తొలి కన్సైన్మెంట్ వెళ్లగా, తాజాగా నూజివీడు నుంచి లండన్‌కు తొలి కన్సైన్మెంట్ వెళ్లింది. లండన్‌కు చెందిన వ్యాపారులు నూజివీడు ప్రాంతంలో పండే బంగినపల్లి రకం మామిడి 50 టన్నుల కోసం ఇక్కడి రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు తొలి కన్సైన్మెంట్గా నూజివీడు మండలం హనుమంతునిగూడెంకు చెందిన రాఘవులుకు చెందిన 1.5 టన్నుల బంగినపల్లి మామిడిలోడు ముంబై మీదుగా విమానంలో లండన్ బయల్దేరింది. రాఘవులు తోటలో పండిన బంగినపల్లి మామిడిని పామర్రు ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌లో ప్రాసెస్ చేయగా, ప్రత్యేక కంటైనర్ ద్వారా విమానంలో ముంబై పంపించారు. అక్కడ నుంచి లండన్‌కు పంపించనున్నారు. ఈ నెలాఖరులోగా ఒప్పందం మేరకు మిగిలిన బంగినపల్లి మామిడిని లండన్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నూజివీడు ఉద్యాన శాఖ ఏడీ శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. రైతుకు టన్నుకు రూ.32 వేలు చొప్పున చెల్లించారని చెప్పారు. కరోనా ఉధృతి కాస్త తగ్గితే నిర్దేశించిన లక్ష్యం మేరకు యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన చెప్పారు. -
ఖండాంతరాలకు నూజివీడు మామిడి
సాక్షి, అమరావతి బ్యూరో: రుచి, నాణ్యతలో నూజివీడు మామిడి పెట్టింది పేరు. అందుకే మామిడి ప్రియులు నూజివీడు మామిడి తినాల్సిందేనంటారు. ఇప్పుడు నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతికి పనికొచ్చేలా వీటి నాణ్యత ఉండటంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ ఉధృత రూపం దాలుస్తుండడంతో మార్కెట్లో మామిడి ధర క్షీణించింది. నెలరోజుల కిందటివరకు టన్ను రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలికిన బంగినపల్లి రకం ఇప్పుడు స్థానిక మార్కెట్లో రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించడం లేదు. ఫిబ్రవరి ఆఖరులో టన్ను తోతాపురి రకం రూ.80 వేల ధర ఉండగా ఇప్పుడు రూ.10 వేలలోపే పలుకుతోంది. అయితే విదేశాలకు ఎగుమతి చేసేవారు నాణ్యమైన బంగినపల్లిని టన్ను రూ.50 వేల వంతున కొనుగోలు చేస్తున్నారు. 10 రోజుల కిందట అర టన్ను బంగినపల్లి మామిడిని టన్ను రూ.30 వేలకు కొనుగోలు చేసి ఎగుమతిదార్లు సింగపూర్‌కు పంపారు. 5 రోజుల కిందట కృష్ణాజిల్లా పామర్రులోని ప్యాక్‌హౌస్ నుంచి 12 టన్నుల మామిడిని ఒమన్ దేశానికి ఎగుమతి చేశారు. అలాగే శనివారం మరో 15 టన్నుల బంగినపల్లి మామిడిని దుబాయ్‌కి పంపనున్నారు. తాజాగా నూజివీడు మండలం హనుమంతునిగూడెం నుంచి రాఘవులు అనే రైతు వద్ద 2 టన్నుల బంగినపల్లి మామిడిని టన్ను రూ.50 వేల చొప్పున కొనుగోలు చేశారు. వీటిని తిరుపతిలోని ప్యాక్‌హౌస్‌లో ప్రాసెస్ చేసి దక్షిణ కొరియాకు ఎగుమతి చేయనున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసేలా ఎగుమతిదారులను ఉద్యానశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఎగుమతిదార్లతో గతనెలలో విజయవాడలో మ్యాంగో బయ్యర్స్, సెల్లర్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా)తో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూజివీడు మామిడి రుచి, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం తదితర ప్రాంతాల ఎగుమతిదార్లు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. 100 టన్నుల ఎగుమతి దిశగా.. గత ఏడాది కృష్ణా జిల్లా నుంచి విదేశాలకు నూజివీడు మామిడి సుమారు 60 టన్నులు ఎగుమతి చేశారు. ఈ సీజనులో ఇప్పటివరకు 12.5 టన్నుల బంగినపల్లి మామిడి సింగపూర్, ఒమన్ దేశాలకు ఎగుమతి అయింది. ఒకటి రెండు రోజుల్లో మరో 17 టన్నులు దుబాయ్, దక్షిణ కొరియాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నూజివీడు ఉద్యానశాఖ ఏడీ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఏడాది దాదాపు 100 టన్నుల వరకు నూజివీడు మామిడిని ఇతర దేశాలకు ఎగుమతికి అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పండిన మామిడి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎగుమతులు పెరిగాయి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) వెబ్సైట్లో జిల్లా రైతులు 80 మందికిపైగా మామిడి ఎగుమతుల కోసం నమోదు చేసుకున్నారు. అలాగే వ్యాపారులు జిల్లాలో కొనుగోలు చేసిన నాణ్యమైన మామిడిని ముంబాయికి తరలించి..అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నారు. 35 వేల ఎకరాల్లో తోటలు మామిడి తోటలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కర్నూలు కూడా ముఖ్యమైనది. జిల్లాలో దాదాపు 35 వేల ఎకరాలలో తోటలు ఉన్నాయి. గూడూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, కల్లూరు, కర్నూలు, దేవనకొండ, డోన్, కృష్ణగిరి తదితర మండలాల్లో విస్తరించాయి. గత ఏడాది ఎకరాకు సగటున మూడు టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సారి ఐదు టన్నుల వరకు వస్తోంది. అంటే ఈ సారి జిల్లా నుంచే మామిడి దిగుబడులు 1.75 లక్షల టన్నుల వరకు ఉంటాయని అంచనా. ఇక్కడ ప్రధానంగా బంగినపల్లి రకం పండుతోంది. రసాలు కూడా ఎక్కువే. నాణ్యతకు ప్రాధాన్యత పలువురు రైతులు కెమికల్స్ వాడకుండా పూర్తిగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంట పండిస్తున్నారు. అనేక మంది ఫ్రూట్ కవర్లు వినియోగిస్తూ మామిడి నాణ్యత పెంచుతున్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా ఎక్కువ ధరతో కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వస్తున్న మామిడి దిగుబడిలో ఎక్కువ శాతం ముంబాయికే తరలుతోంది. ఆ నగరానికి చెందిన పలు సంస్థలు తమ ప్రతినిధుల ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన మామిడిని ముంబాయిలో ప్రాసెసింగ్ చేసి.. దుబాయ్, సౌదీ, కువైట్ తదితర గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 20 వేల టన్నుల వరకు ఎగుమతికి అవకాశం జిల్లాలో పండిన మామిడి ఇప్పటికే గల్ఫ్ దేశాలకు 4,000 మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి అయ్యింది. ఈ ఏడాది 20 వేల టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ఎగుమతులకు అనువైన రకం బంగినపల్లి (బేనీసా) మాత్రమే. కొద్దిరోజుల క్రితం వరకు గూడూరు, ఓర్వకల్లు, ప్యాపిలి, డోన్ మండలాలకు చెందిన మామిడి రికార్డు స్థాయి ధరలతో ముంబాయికి వెళ్లింది. మొదట్లో టన్ను రూ.80 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు అమ్ముడుపోయింది. గూడూరుకు చెందిన జి.శ్రీరాములు పండించిన మామిడిలో నాణ్యత ఎక్కువగా ఉండటంతో ముంబాయి వ్యాపారులు కొనుగోలు చేసి.. అమెరికాకు ఎగుమతి చేశారు. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో నాణ్యత కల్గిన మామిడిని గుర్తించి తోటలోనే ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తున్నారు. 20 కిలోల ప్రకారం ప్యాక్ చేసి తరలిస్తున్నారు. కరోనా ప్రభావం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పూత, పిందె వచ్చాయి. కానీ ఫిబ్రవరి 6, 7 తేదీల్లో కురిసిన అకాల వర్షాలు, గాలి ప్రభావంతో చాలావరకు పూత, పిందె నేలరాలాయి. ధరలు బాగా ఉండడంతో వచ్చే పంటైనా ఆదుకుంటుందని రైతులు భావించారు. కానీ వారి ఆశలను కరోనా అడియాసలు చేస్తోంది. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా ప్రభావం జిల్లాలోని మామిడి ధరపై పడుతోంది. ముంబాయికి ఎగుమతులు తగ్గడంతో మామిడి ధరల్లోనూ 50 శాతం వరకు తగ్గుదల కన్పిస్తోంది. రికార్డు స్థాయి ధరలు లభించాయి మామిడి నాణ్యత కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాం. ఫ్రూట్ కవర్లు వినియోగించాం. దీంతో టన్నుకు రూ.80 వేల ధర లభించింది. అయితే ఇటీవల ముంబాయిలో కరోనా తీవ్రత పెరగడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. దీనివల్ల ధర కూడా తగ్గింది. – గొల్ల శ్రీరాములు, గూడూరు కరోనా దెబ్బతీస్తోంది ఈసారి పూత, పిందె బాగా వచ్చినా.. ఫిబ్రవరిలో అకాల వర్షాల వల్ల చాలావరకు నేలరాలింది. ఉన్న పిందెలను కాపాడుకుంటూ వచ్చాం. నాణ్యత పెంపొందించుకున్నాం. మొదట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఊరట చెందాం. కానీ ఇప్పుడు కరోనా దెబ్బతీస్తోంది. కరోనా వల్ల గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. – వెంకటసుబ్బారెడ్డి, పాలకొలను, ఓర్వకల్లు మండలం ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం మామిడిలో నాణ్యతను పెంపొందింపజేసి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం. అపెడా వెబ్సైట్లో స్వల్ప వ్యవధిలోనే 80 మందికి పైగా రైతులు పేర్లను నమోదు చేసుకున్నారు. నాణ్యతే లక్ష్యంగా పలువురు రైతులు మామిడికి ఫ్రూట్ కవర్లు వినియోగిస్తున్నారు. వీటి వల్ల మామిడిపై చీడపీడల ప్రభావం పడదు. కెమికల్ ప్రభావం కూడా ఉండదు. – రఘునాథరెడ్డి, ఏడీ, ఉద్యాన శాఖ చదవండి: ఓటర్లను ఏమార్చేందుకు టీడీపీ యత్నం కావాల్సినంత 'కరెంట్' -
బంగినపల్లి.. నున్న టు ఢిల్లీ!
నున్న (విజయవాడరూరల్): నున్న మ్యాంగో మార్కెట్లో మామిడికాయల సీజన్ ప్రారంభమైంది. బుధవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బంగినపల్లి మామిడికాయలను ప్యాక్ చేసి వాటిని లారీలో ఢిల్లీకి ఎగుమతి చేశారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రతాప్, ఈదర గ్రామం నుంచి జాన్‌వెస్లీ, కోడూరు గ్రామం నుంచి వెంకటేశ్వరావు, సాయనపాలెం గ్రామం నుంచి వెంకటేశ్వరావు అనే రైతులు తోటల నుంచి వచ్చిన మామిడి పంట దిగుబడులను, 12 టన్నుల కాయలను వేరు చేసి లోడు చేశారు. ఈ ఏడాది మామిడికాయల సీజన్ ప్రారంభంలో బంగినపల్లి మామిడి కాయలు టన్ను ధర రూ.70 వేలకు పలికింది. -
టన్ను బంగినపల్లె రూ.లక్ష..!
ప్రకాశం, ఉలవపాడు: చివరి దశ..మూడు ఎకరాల్లో బంగినపల్లె కాయలు టన్ను లక్ష రూపాయల రేటు పలికింది. ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో మామిడి కాయల సీజన్ పూర్తయింది. బంగినపల్లె కాయలు పూర్తయిపోయాయి. ప్రస్తుతం కేవలం బెంగళూరు, నీలం కాయలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ సోమవారం బంగినపల్లె కాయలు చివరలో పూసిన పూతకు వచ్చిన కాయలు టన్ను లక్ష రూపాయలకు కోశారు. గత పదేళ్లలో ఇదే బంగినపల్లె కాయలకు అత్యధిక రేటు. ఎన్నడూ లేని విధంగా కరోనా కష్టకాలంలో మామిడి కాయల రైతులు లాభాల బాట పట్టారు. టన్ను రూ.65 వేల వరకు బంగినపల్లె ఎగుమతులు జరిగాయి. చివరలో టన్ను లక్ష పలకడం విశేషం. -
నూజివీడు టు లండన్
సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మామిడి తొలిసారిగా లండన్ పయనమైంది. 16 టన్నుల నాణ్యమైన బంగినపల్లి మామిడి పండ్లను శనివారం వేకువజామున నూజివీడు నుంచి కంటైనర్‌లో విశాఖ పోర్టుకు చేర్చారు. అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా నౌకలో లండన్ చేరుకుంటాయి. కృష్ణా జిల్లా నూజివీడుతో పాటు ప్రకాశం జిల్లా ఉలవపాడు ఏరియాలో పండిన బంగినపల్లి మామిడిని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపెడా) ద్వారా విజయనగరానికి చెందిన ఓ ఎగుమతి దారు కొనుగోలు చేశారు. ఈ మామిడిని నూజివీడు లోని ఇంటిగ్రెటెడ్ ప్యాక్ హౌస్‌లో గ్రేడింగ్ చేశారు. నాణ్యతకు అవసరమైన ప్రక్రియను అక్కడ ఉన్న వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో పూర్తయ్యాక 5 కిలోల చొప్పున అట్టపెట్టెల్లో వీటిని ప్యాక్ చేసి కంటైనర్‌లో పేర్చారు. ఏసీ కంటైనర్ ద్వారా.. మామిడి పండ్లను రైతులు, ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో శనివారం వేకువజామున కంటైనర్‌లో విశాఖపట్నం పోర్టుకు పంపారు. అక్కడ నుంచి నౌకలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ కంటైనర్‌లో లండన్‌కు పంపుతారు. విశాఖపట్నం నుంచి లండన్‌కు నౌక చేరుకోవడానికి 28 రోజుల సమయం పడుతుంది. 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచడడం వల్ల మామిడి పాడవదు. ఇన్ని రోజులు సరకు పాడవకుండా ఉండేందుకు ప్యాక్ హౌస్‌లో ముందుగానే పెస్టిసైడ్ ట్రీట్మెంట్ కూడా చేశారు. 16 టన్నుల మామిడిని విశాఖ నుంచి లండన్ చేరవేసేందుకు నౌక యాజమాన్యం 2,500 డాలర్లు వసూలు చేస్తోంది. -
బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్
మంజూరు చేసిన జీఐఆర్ చెన్నై: పండ్లన్నిటిలో మామిడి రారాజు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక మామిడి పండ్లలో బంగినపల్లికున్న ప్రత్యేకత, దాని రుచి జగద్వితం. ఈ బంగినపల్లి మామిడిపండుకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దీనికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ లభించింది. బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన దరఖాస్తును పరిశీలించిన చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ బుధవారం జియో ట్యాగ్ మంజూరు చేసింది. అంటే ఈ పండు ఓ నిర్దిష్ట ప్రాంతానికి చెందినదనే గుర్తింపు లభించిందన్నమాట. ఏదైనా ఉత్పత్తి మూలాలను జీఐ ట్యాగ్ ధ్రువీకరిస్తుంది. వందేళ్ల నుంచి బంగినపల్లి మామిడిపండ్లు రాష్ట్రంలో పండుతున్నాయి. వీటిని బెనెషాన్, బనెషాన్, సఫేద అని కూడా పిలుస్తారు. అలాగే బనగానపల్లె, బంగినపల్లి, బనగానపల్లి మామిడి పండ్లు అని కూడా వ్యవహరిస్తారు. 3నెలలపాటు కోల్డ్ స్టోరేజీలో ఉంచినా వీటి రుచి ఏమాత్రం తగ్గదని రాష్ట్ర ప్రభుత్వం జీఐ దరఖాస్తులో పేర్కొంది. కర్నూలు జిల్లా బనగానపల్లె, పాణ్యం, నంద్యాల మండలాలను ఈ మామిడిపండ్లకు ప్రాథమిక మూల కేంద్రాలుగా తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రతోపాటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ ,అదిలాబాద్ జిల్లాలను కూడా వీటి మూల కేంద్రాలుగా పేర్కొంది. వీటి మూలాలకు సంబంధించి ‘బనగానపల్లె– స్టేట్ మద్రాస్ వార్ ఫండ్ సీల్’ వంటి చారిత్రక ఆధారాలను చూపింది. 2011లో అప్పటి రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ రాణి కుముదిని సమర్పించిన అఫిడవిట్ ప్రకారం... 7.66 లక్షల కుటుంబాలు బనగానపల్లె మామిడిపండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 5500 టన్నులకు పైగా మామిడిపండ్లను అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు ఏటా ఎగుమతి చేస్తున్నారు. బంగినపల్లి మామిడిపండ్ల వార్షిక టర్నోవర్ సుమారు రూ.1,461 కోట్లు. రైతులకు మెరుగైన మార్కెట్ ధర లభించేందుకు జీఐ ట్యాగ్ ఉపకరిస్తుంది. మేథో సంపత్తి హక్కుల్లో జీఐ ట్యాగ్ కూడా ఒక భాగం.