మామిడిని ఫ్రూట్ కవర్లతో సంరక్షిస్తున్న దృశ్యం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పండిన మామిడి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎగుమతులు పెరిగాయి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) వెబ్‌సైట్‌లో జిల్లా రైతులు 80 మందికిపైగా మామిడి ఎగుమతుల కోసం నమోదు చేసుకున్నారు. అలాగే వ్యాపారులు జిల్లాలో కొనుగోలు చేసిన నాణ్యమైన మామిడిని ముంబాయికి తరలించి..అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నారు.
35 వేల ఎకరాల్లో తోటలు
మామిడి తోటలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కర్నూలు కూడా ముఖ్యమైనది. జిల్లాలో దాదాపు 35 వేల ఎకరాలలో తోటలు ఉన్నాయి. గూడూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, కల్లూరు, కర్నూలు, దేవనకొండ, డోన్, కృష్ణగిరి తదితర మండలాల్లో విస్తరించాయి. గత ఏడాది ఎకరాకు సగటున మూడు టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సారి ఐదు టన్నుల వరకు వస్తోంది. అంటే ఈ సారి జిల్లా నుంచే మామిడి దిగుబడులు 1.75 లక్షల టన్నుల వరకు ఉంటాయని అంచనా. ఇక్కడ ప్రధానంగా బంగినపల్లి రకం పండుతోంది. రసాలు కూడా ఎక్కువే.
నాణ్యతకు ప్రాధాన్యత
పలువురు రైతులు కెమికల్స్ వాడకుండా పూర్తిగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంట పండిస్తున్నారు. అనేక మంది ఫ్రూట్ కవర్లు వినియోగిస్తూ మామిడి నాణ్యత పెంచుతున్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా ఎక్కువ ధరతో కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వస్తున్న మామిడి దిగుబడిలో ఎక్కువ శాతం ముంబాయికే తరలుతోంది. ఆ నగరానికి చెందిన పలు సంస్థలు తమ ప్రతినిధుల ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన మామిడిని ముంబాయిలో ప్రాసెసింగ్ చేసి.. దుబాయ్, సౌదీ, కువైట్ తదితర గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
20 వేల టన్నుల వరకు ఎగుమతికి అవకాశం
జిల్లాలో పండిన మామిడి ఇప్పటికే గల్ఫ్ దేశాలకు 4,000 మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి అయ్యింది. ఈ ఏడాది 20 వేల టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ఎగుమతులకు అనువైన రకం బంగినపల్లి (బేనీసా) మాత్రమే. కొద్దిరోజుల క్రితం వరకు గూడూరు, ఓర్వకల్లు, ప్యాపిలి, డోన్ మండలాలకు చెందిన మామిడి రికార్డు స్థాయి ధరలతో ముంబాయికి వెళ్లింది. మొదట్లో టన్ను రూ.80 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు అమ్ముడుపోయింది. గూడూరుకు చెందిన జి.శ్రీరాములు పండించిన మామిడిలో నాణ్యత ఎక్కువగా ఉండటంతో ముంబాయి వ్యాపారులు కొనుగోలు చేసి.. అమెరికాకు ఎగుమతి చేశారు. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో నాణ్యత కల్గిన మామిడిని గుర్తించి తోటలోనే ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తున్నారు. 20 కిలోల ప్రకారం ప్యాక్ చేసి తరలిస్తున్నారు.
కరోనా ప్రభావం
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పూత, పిందె వచ్చాయి. కానీ ఫిబ్రవరి 6, 7 తేదీల్లో కురిసిన అకాల వర్షాలు, గాలి ప్రభావంతో చాలావరకు పూత, పిందె నేలరాలాయి. ధరలు బాగా ఉండడంతో వచ్చే పంటైనా ఆదుకుంటుందని రైతులు భావించారు. కానీ వారి ఆశలను కరోనా అడియాసలు చేస్తోంది. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా ప్రభావం జిల్లాలోని మామిడి ధరపై పడుతోంది. ముంబాయికి ఎగుమతులు తగ్గడంతో మామిడి ధరల్లోనూ 50 శాతం వరకు తగ్గుదల కన్పిస్తోంది.
రికార్డు స్థాయి ధరలు లభించాయి
మామిడి నాణ్యత కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాం. ఫ్రూట్ కవర్లు వినియోగించాం. దీంతో టన్నుకు రూ.80 వేల ధర లభించింది. అయితే ఇటీవల ముంబాయిలో కరోనా తీవ్రత పెరగడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. దీనివల్ల ధర కూడా తగ్గింది.
– గొల్ల శ్రీరాములు, గూడూరు
కరోనా దెబ్బతీస్తోంది
ఈసారి పూత, పిందె బాగా వచ్చినా.. ఫిబ్రవరిలో అకాల వర్షాల వల్ల చాలావరకు నేలరాలింది. ఉన్న పిందెలను కాపాడుకుంటూ వచ్చాం. నాణ్యత పెంపొందించుకున్నాం. మొదట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఊరట చెందాం. కానీ ఇప్పుడు కరోనా దెబ్బతీస్తోంది. కరోనా వల్ల గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
– వెంకటసుబ్బారెడ్డి, పాలకొలను, ఓర్వకల్లు మండలం
ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం
మామిడిలో నాణ్యతను పెంపొందింపజేసి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం. అపెడా వెబ్‌సైట్‌లో స్వల్ప వ్యవధిలోనే 80 మందికి పైగా రైతులు పేర్లను నమోదు చేసుకున్నారు. నాణ్యతే లక్ష్యంగా పలువురు రైతులు మామిడికి ఫ్రూట్ కవర్లు వినియోగిస్తున్నారు. వీటి వల్ల మామిడిపై చీడపీడల ప్రభావం పడదు. కెమికల్ ప్రభావం కూడా ఉండదు.
– రఘునాథరెడ్డి, ఏడీ, ఉద్యాన శాఖ
చదవండి:
ఓటర్లను ఏమార్చేందుకు టీడీపీ యత్నం
కావాల్సినంత 'కరెంట్'
Comments
Please login to add a commentAdd a comment