బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్‌ | GI tag for bangainpalli mango | Sakshi
Sakshi News home page

బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్‌

Published Thu, May 4 2017 2:53 AM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్‌

బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్‌

మంజూరు చేసిన జీఐఆర్‌

చెన్నై: పండ్లన్నిటిలో మామిడి రారాజు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక మామిడి పండ్లలో బంగినపల్లికున్న ప్రత్యేకత, దాని రుచి జగద్వితం. ఈ బంగినపల్లి మామిడిపండుకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దీనికి జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ (జీఐ) ట్యాగ్‌ లభించింది. బంగినపల్లి మామిడికి జీఐ ట్యాగ్‌ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన దరఖాస్తును పరిశీలించిన చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ రిజిస్ట్రీ  బుధవారం జియో ట్యాగ్‌ మంజూరు చేసింది. అంటే ఈ పండు ఓ నిర్దిష్ట ప్రాంతానికి చెందినదనే గుర్తింపు లభించిందన్నమాట. ఏదైనా ఉత్పత్తి మూలాలను జీఐ ట్యాగ్‌ ధ్రువీకరిస్తుంది. వందేళ్ల నుంచి బంగినపల్లి మామిడిపండ్లు రాష్ట్రంలో పండుతున్నాయి. వీటిని బెనెషాన్, బనెషాన్, సఫేద అని కూడా పిలుస్తారు.

అలాగే బనగానపల్లె, బంగినపల్లి, బనగానపల్లి మామిడి పండ్లు అని కూడా వ్యవహరిస్తారు. 3నెలలపాటు కోల్డ్‌ స్టోరేజీలో ఉంచినా వీటి రుచి ఏమాత్రం తగ్గదని రాష్ట్ర ప్రభుత్వం జీఐ దరఖాస్తులో పేర్కొంది. కర్నూలు జిల్లా బనగానపల్లె, పాణ్యం, నంద్యాల మండలాలను ఈ మామిడిపండ్లకు ప్రాథమిక మూల కేంద్రాలుగా తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రతోపాటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్‌ ,అదిలాబాద్‌ జిల్లాలను కూడా వీటి మూల కేంద్రాలుగా పేర్కొంది.

వీటి మూలాలకు సంబంధించి ‘బనగానపల్లె– స్టేట్‌ మద్రాస్‌ వార్‌ ఫండ్‌ సీల్‌’ వంటి చారిత్రక ఆధారాలను చూపింది. 2011లో అప్పటి రాష్ట్ర హార్టికల్చర్‌ కమిషనర్‌ రాణి కుముదిని సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం... 7.66 లక్షల కుటుంబాలు బనగానపల్లె మామిడిపండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి.  5500 టన్నులకు పైగా మామిడిపండ్లను అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలకు ఏటా ఎగుమతి చేస్తున్నారు. బంగినపల్లి మామిడిపండ్ల వార్షిక టర్నోవర్‌ సుమారు రూ.1,461 కోట్లు. రైతులకు మెరుగైన మార్కెట్‌ ధర లభించేందుకు జీఐ ట్యాగ్‌ ఉపకరిస్తుంది. మేథో సంపత్తి హక్కుల్లో జీఐ ట్యాగ్‌ కూడా ఒక భాగం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement