అల్లికవా.. రంగవల్లివా! | Geographical identification of Narasapuram Lace Park | Sakshi
Sakshi News home page

అల్లికవా.. రంగవల్లివా!

Published Wed, Jul 31 2024 5:33 AM | Last Updated on Wed, Jul 31 2024 5:33 AM

Geographical identification of Narasapuram Lace Park

నరసాపురం లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు

పారిస్‌లో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు బహుమతిగా నరసాపురం లేసులు

గుబాళించిన లేసు అల్లికల ఖ్యాతి

నరసాపురం: నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌–జీఐ) లభించింది. కేంద్ర జౌళి శాఖ సిఫార్సుల మేరకు నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కుకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. ఫ్రాన్స్‌ వేదికగా పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌కు హాజరయ్యే క్రీడాకారులకు బహూకరించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేసు ఉత్పత్తులు ఎంపికై ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. 

నాలుగు నెలల క్రితం ఈ ఘనత సాధించగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జౌళి శాఖ సిఫార్సుల మేరకు మన కేంద్ర ప్రభుత్వం నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు లభించింది. 1930–35 కాలంలో లండన్‌ వీధుల్లో నరసాపురం లేసు ఉత్పత్తుల అమ్మకాలు జరిగేవి. మళ్లీ ఇన్నాళ్లకు నరసాపురం లేసు అల్లికలు తమ ప్రాముఖ్యతను నిలుపుకొని ముందుకెళ్లడం విశేషం.

కష్టమంతా మహిళలదే
కళా నైపుణ్యంతో విశ్వ ఖ్యాతిని ఆర్జించిన లేసు పరిశ్రమలో కష్టం మొత్తం మహిళలదే. కనీస అక్షర జ్ఞానం కూడా లేని మహిళలదే కీలక పాత్ర. లేసు అల్లికల్లో శ్రమించే మహిళలకు కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు. వారు అల్లే లేసులు ఏ దేశాలకు వెళుతున్నాయో, వాటి రేటు అక్కడ ఎంత ఉంటుందో కూడా వీరికి తెలియదు. కమీషన్‌దారులు కేజీ దారంతో అల్లితే ఇంత అని కూలీ చెల్తిస్తారు. కేజీ దారం అల్లడానికి ఒక మహిళ రోజుకు ఐదారు గంటలు పనిచేస్తే 15 రోజుల సమయం పడుతుంది. కేజీ దారం అల్లడానికి రూ.200 నుంచి డిజైన్‌ను బట్టి రూ.500 వరకు చెల్లిస్తారు. 

అంటే నెలకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు మాత్రమే అల్లేవారికి దక్కుతాయి. నరసాపురం, రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎనిమిదేళ్ల బాలికల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు గిన్నెలో దారం తోడుకుని లేసు కుట్టుకుంటూ ఇప్పటికీ కనిపిస్తారు. లేసు అల్లే మహిళల్లో మార్కెట్‌ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్లలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మేలు జరుగుతుందని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నరసాపురంలో 2005లో లేస్‌ పార్కు, ఇంటర్నేషనల్‌ లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ నెలకొల్పారు. 

డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో లేసు నిర్వహణ సాగేలా చర్యలు తీసుకున్నారు. లేసు పార్కు ప్రారంభమైన తరువాతే నరసాపురంలో ఇంటర్నేషనల్‌ లేస్‌ ట్రేడ్‌ సెంటర్‌ ప్రారంభమైంది. దీంతో లేసులు అల్లే మహిళలకు ఆర్థికంగా గిట్టుబాటు అవుతోంది. వైఎస్సార్‌ నెలకొల్పిన లేసు పార్కుకు ఇప్పుడు భౌగోళిక గుర్తింపు రావడం విశేషం. 

ఇదీ నరసాపురం లేసు చరిత్ర
సుమారు 200 సంవత్సరాల క్రితం స్వీడన్‌ మిషనరీ సంస్థలు ఇక్కడకు వచ్చి, స్థానిక మహిళలతో పరిచయాలు పెంచుకోవడంలో భాగంగా లేసు అల్లికలను పరిచయం చేశాయి. తరువాత కాలంలో ఇది పెద్ద పరిశ్రమగా మారింది. అమెరికా సహా యూరప్‌ దేశాల్లో నరసాపురం ప్రాంత లేసు అల్లికలనే వినియోగిస్తారు. దిండ్లు, సోఫా సెట్, డైనింగ్‌ టేబుల్స్, డోర్‌ కర్టెన్స్‌పై వీటిని వాడతారు. 

విదేశీయులు ధరించే దుస్తులుగా కూడా లేసు అల్లికలకు ప్రాధాన్యం ఉంది. యూరప్‌ దేశాల్లో లేసు గార్మెంట్స్‌ అంటే ఎనలేని క్రేజ్‌. అనేక అబ్బురపరిచే డిజైన్లలో వీటిని తయారు చేస్తారు. అమెరికా, బ్రిటన్, హాలెండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ తదితర దేశాలకు లేసు అల్లికలు ఎగుమతి అవుతున్నాయి.  

ఇది అరుదైన ఘనత 
లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు దక్కడం అరుదైన ఘనత. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లేసు పార్కుకు మరింత గుర్తింపు లభిస్తుంది. లేసు పార్కు వైభవం, నరసాపురం లేసు ఉత్పత్తుల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్నాయి. లేసు పరిశ్రమ అభివృద్ధికి ఇవి మంచి రోజులు. మాపై బాధ్యత మరింత పెరిగింది.  – ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్, డీఆర్‌డీఏ పీడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement