నాన్నకు మెడల్ గిఫ్ట్ గా ఇవ్వాలని.. | Jyothikashri ready for Paris Olympics | Sakshi
Sakshi News home page

నాన్నకు మెడల్ గిఫ్ట్ గా ఇవ్వాలని..

Published Thu, Jul 18 2024 5:32 AM | Last Updated on Thu, Jul 18 2024 5:32 AM

Jyothikashri ready for Paris Olympics

పారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమైన జ్యోతికశ్రీ

400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చాటడానికి సిద్ధం 

ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు కైవశం 

తన కలలు నిజమయ్యాయి అంటున్న తండ్రి

అమ్మాయి అని వెనకడుగు వేయలేదు. తండ్రి కల నెరవేర్చాలనే తపనతో 11 ఏళ్లుగా కఠోర శ్రమ చేసింది. రన్నింగ్‌ ట్రాక్‌లో చీతాలా పరుగు పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఒలింపిక్స్‌ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది దండి జ్యోతిక శ్రీ. ఉమెన్స్‌ 400 మీటర్ల రిలే జట్టులో భారత్‌ తరఫున పోటీ పడటానికి పారిస్‌ పయనమైంది. తను పుట్టిన తణుకు ప్రాంతానికి ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు సిద్ధమైంది. 

తణుకు అర్బన్‌: అథ్లెటిక్స్‌లో రాణించి అందరి మన్ననలు పొందుతున్న దండి జ్యోతికశ్రీ ఈ నెల 26 నుంచి పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌­లో భారతదేశం తరఫున పోటీ పడుతోంది. ఆ­గస్టు తొమ్మిదిన జరిగే మహిళల 400 మీటర్ల రిలే­లో జ్యోతికశ్రీ సత్తా చాటనుంది. ఒక సామా­న్య కుటుంబంలో జన్మించిన జ్యోతికశ్రీ అసా­మాన్య ప్రతిభతో ఒలింపిక్స్‌ వరకూ ఎదగడం ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. 

తమ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఒలింపిక్స్‌ వరకూ వెళ్లడంతో తణుకు ప్రాంతంలోని ప్రజల ఆనందానికి అవధుల్లేవు. ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి రాష్ట్రానికే కాకుండా దేశానికి పేరు తీసుకువస్తుందని వారంతా ఆకాంక్షిస్తున్నారు. ఇక ఒలింపిక్స్‌కు ఎంపికైన వెంటనే ఆమెకు రాష్ట్రం నలుమూలల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి.   

ప్రస్థానమిలా.. 
బాడీ బిల్డర్‌గా రాణించాలనుకున్న జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు కోరిక అప్పట్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నెరవేరలేదు. తనకు కుమారుడు జన్మిస్తే మిస్టర్‌ ఇండియాగా తీర్చి దిద్దాలని అనుకున్నారు. అయితే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె కీర్తి సత్యశ్రీ చదువు పట్ల ఆసక్తి చూపగా.. చిన్న కుమార్తె జ్యోతికశ్రీ చదువు పట్ల మక్కువ చూపిస్తూనే తండ్రి కోరిక మేరకు పాఠశాల స్థాయిలోనే అథ్లెట్‌గా మారింది. 13 సంవత్సరాల వయసు­లో తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.

అక్కడ కీర్తిశ్రీ స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ కట్లపర్తి సీతారామయ్య తరీ్ఫదులో రాటుదేలింది. స్థానిక మాంటిస్సోరీ స్కూలులో 10వ తరగతి పూర్తిచేసేలోగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి­లో పలు పతకాలు సాధించింది. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్‌ చదువుతూ అప్పటి ఆంధ్ర చీఫ్‌ కోచ్‌ వినాయక ప్రసాద్‌ కోచింగ్‌లో అండర్‌–18 జాతీయ చాంపియన్‌íÙప్‌ పోటీల్లో పాల్గొంది. కెన్యాలో నిర్వహించిన యూత్‌ వరల్డ్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌íÙప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 

2020లో హైదరాబాద్‌లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌ కోచింగ్‌లో బ్యాంకాక్, కెన్యాల్లో జరిగిన పోటీలతో పాటు భారతదేశ పలు ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటి పలు స్వర్ణ, రజత పతకాలు సాధించింది. 2022లో ఇండియన్‌ క్యాంప్‌లో తర్ఫీదు పొందేలా అర్హత సాధించింది. 

తాజాగా 2024 మే నెలలో బహమాస్‌లో నిర్వహించిన వరల్డ్‌ ఉమెన్స్‌ రిలేలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా ఒలింపిక్స్‌కి అర్హత సాధించి యావత్‌ దేశాన్ని తన వైపు చూసేలా చేసింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 34 మెడల్స్‌ సాధించగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 50 వరకు మెడల్స్‌ సాధించింది.

నాన్న కోసమే నా పరుగు.. 
నాన్న కల నెరవేర్చేందుకే నా పరుగు మొదలుపెట్టాను. ఒక కొడుకు ఉంటే తనను క్రీడాకారుడిగా తీర్చిదిద్దేవాడిని అనే నాన్న మాటలు నాలో పట్టుదలను పెంచాయి. దీంతో అథ్లెట్‌గా ఎదగాలనే దృఢ నిశ్చయంతో సాధన చేశాను. నాన్నతో పాటు మా అమ్మ, అక్క ఇచ్చిన సహకారం, కోచ్‌లు అందించిన అత్యున్నతమైన సూచనలు, సలహాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్‌ సాధించాను. 

ఈ క్రమంలో ఎప్పటికైనా ఒలింపిక్స్‌కి అర్హత సాధించాలనే సంకల్పంతో ప్రయత్నించాను. భారతదేశం తరఫున ఒలింపిక్స్‌కు అర్హత సాధించాననే ప్రకటన నాకు చాలా సంతోషాన్నిచ్చి0ది. ఒలింపిక్స్‌లో పతకం సాధించి నాన్నకు గిఫ్ట్‌గా ఇవ్వాలని సిద్ధమవుతున్నాను.    – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్‌  

నా కల నెరవేరింది.. 
నేను సాధించలేకపోయిన గుర్తింపును నా కుమార్తె సాధించాలనే కృషి, పట్టుదల నాలో పెరిగింది. జ్యోతికశ్రీకి ఐఏఎస్, ఐపీఎస్‌ వైపు వెళ్లాలని చిన్ననాటి నుంచి ఆశ పడింది. నాకు ఇష్టమైన క్రీడారంగంలోకి వచ్చి నా కోరిక నెరవేర్చేందుకు పట్టుదలతో కృషి చేసింది. దేశం మెచ్చే క్రీడాకారిణిలా తనను తీర్చిదిద్దే క్రమంలో నాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నేనెప్పుడూ బెదరలేదు. 

ఆర్థిక సమస్యలను జయిస్తూ ముందుకు వెళ్లాను. నా కుమార్తె ప్రపంచంతో పోటీపడే స్థాయికి వెళ్లడం ద్వారా నేను కన్న కలలు నిజమయ్యాయి. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే తృప్తి ఇంకేం కావాలి. –  దండి శ్రీనివాసరావు, జ్యోతికశ్రీ తండ్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement